ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ నీతి ఇప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్ వర్గాల్లో తీవ్ర అసహనానికి దారితీస్తోంది. ఆ వర్గాలను తమ కల్ట్ ఓటు బ్యాంక్‌గా వాడుకుంటూనే, కీలకమైన సమయాల్లో వారికి అండగా నిలవకుండా వైసీపీ వెన్నుపోటు పొడుస్తున్నారు. రాజకీయ కుట్రలకు వారిని వాడుకుంటున్నారు కానీ.. మద్దతుగా మాత్రం ముందుకు రావడం లేదు.
పావులుగా మారుతున్న ఓటు బ్యాంక్
ఆకివీడులోని రామాలయం పునర్నిర్మాణ వివాదం కావచ్చు, లేదా మతం మారిన దళితులకు ఎస్సీ హోదా రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు కావచ్చు.. ప్రతిచోటా వైసీపీ ఒకే వ్యూహాన్ని అమలు చేస్తోంది. కన్వర్టెడ్ క్రిస్టియన్ సంఘాలను తెర వెనుక ఉండి రెచ్చగొట్టడం, వారిని రోడ్లపైకి వచ్చేలా ప్రోత్సహించడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకుంటోంది. కానీ, అధికారికంగా , బహిరంగంగా ఆ వర్గాలకు మద్దతు ప్రకటించడానికి మాత్రం జగన్ రెడ్డి వెనకాడుతున్నారు. ఇతర వర్గాల ఓట్లు ఎక్కడ పోతాయో అన్న భయంతో, తనను నమ్ముకున్న వర్గాలనే ఆయన బలిపశువులను చేస్తున్నారని స్పష్టమవుతోంది.
నిరసనలు మీవి.. రాజకీయం జగన్ ది!
ఆకివీడు ఘటనలో క్రైస్తవ సంఘాలు నిరసనలు తెలియజేస్తుంటే, ఆ నిరసనల వెనుక ఉండి నడిపిస్తున్న వైసీపీ నేతలు మాత్రం ఎక్కడా కెమెరాలకు చిక్కడం లేదు. మాకు జగన్ మాత్రమే అండ అని ఆ వర్గాలు నమ్ముతుంటే, జగన్ మాత్రం వారిని కేవలం ఎన్నికల టూల్స్ గా మాత్రమే చూస్తున్నారన్నది నగ్న సత్యం. సుప్రీంకోర్టు తీర్పు వంటి సున్నితమైన అంశాల్లో కూడా, ఒక స్పష్టమైన వైఖరి తీసుకోకుండా ఆ వర్గాలను అయోమయంలో నెట్టేయడం వైసీపీకి అలవాటుగా మారింది. ఇది తన సొంత ఓటు బ్యాంక్‌ను తానే మోసం చేయడం కాదా?
న్యాయపరమైన చిక్కుల్లోకి నెట్టి.. చేతులు దులుపుకోవడం!
ఎస్సీ సర్టిఫికేట్ రద్దు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో లక్షలాది మంది కన్వర్టెడ్ క్రిస్టియన్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్లిష్ట సమయంలో వారికి దారి చూపాల్సింది పోయి, వారిని ప్రభుత్వంపైకి లేదా వ్యవస్థలపైకి ఉసిగొల్పి వైసీపీ నాయకత్వం మౌనంగా కూర్చుంది. ఒకవైపు హిందూ ఓట్లు కోల్పోకూడదని ముసుగు వేసుకుంటూనే, మరోవైపు క్రిస్టియన్ వర్గాలను రెచ్చగొట్టి సామాజిక అశాంతిని సృష్టించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూడటం అత్యంత ప్రమాదకరం. జగన్ రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసం ఒక వర్గాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారో ఆకివీడు ఉదంతమే సాక్ష్యంగా నిలుస్తోంది.
మోసపోతున్న కల్ట్ ఓటర్లు.. మేల్కొనే సమయం వచ్చిందా?
వైసీపీని గుడ్డిగా నమ్ముతున్న కన్వర్టెడ్ క్రిస్టియన్ వర్గాలు ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తమ ప్రయోజనాల కంటే కూడా తమను పావులుగా వాడుకోవడానికే వైసీపీ ప్రాధాన్యత ఇస్తుందన్న విషయం తాజా పరిణామాలతో తేటతెల్లమైంది. తెర వెనుక మంత్రాంగం నడుపుతూ, సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ముఖం చాటేసే నాయకత్వాన్ని ఎంతవరకు నమ్మాలి? నేరుగా అండగా నిలవని పార్టీ, కేవలం రహస్య మద్దతుతో రెచ్చగొడుతూ ఉంటే అది ఆ వర్గాల వినాశనానికే దారితీస్తుంది తప్ప మరేం జరగదు. తనను నమ్ముకున్న వర్గాలకే వెన్నుపోటు పొడిచే విధంగా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డి తీరు, భవిష్యత్తులో ఆ ఓటు బ్యాంక్ ఆయనకు దూరం కావడానికి ప్రధాన కారణం కావచ్చు. రాజకీయాల్లో నిజాయితీ లేకపోతే, అది ఎంతటి బలమైన ఓటు బ్యాంక్‌నైనా తుడిచిపెట్టేస్తుందని వైసీపీ గుర్తుంచుకోవాలన్న సలహాలు వినిపిస్తున్నాయి
