తమిళరాజకీయాల్లో విజయ్ను మునగచెట్టు ఎక్కించేస్తున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే గుంభనంగా ఉంటున్నాయి. కానీ తొలి సారి ఎన్నికల బరిలో దిగిన పార్టీ ..పైగా సినీ ఫ్యాన్స్ కాబట్టి.. ఆయనను ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నారు. విజయ్ కూడా అదేతరహాలో వ్యవహరిస్తున్నారు. కానీ ఆయన ఓట్లు సాధించి.. సీట్లు సాధించకపోతే మాత్రం.. గెలిచిన కొంత మంది నికాపాడుకోవడం కష్టమవుతుంది.
హైప్ వర్సెస్ రియాలిటీ
తమిళనాట విజయ్ రాజకీయ ప్రవేశం ఒక సునామీలా కనిపిస్తోంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఆయన పార్టీకి ఏకంగా 100కు పైగా సీట్లు వస్తాయని, ఆయన సీఎం రేసులో స్టాలిన్ కంటే ముందే ఉన్నారని ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే, దశాబ్దాలుగా పాతుకుపోయిన డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలు ఈ హైప్‌ను చూసి గుంభనంగా ఉన్నాయి. కేవలం సినిమా గ్లామర్ , యూత్ ఫాలోయింగ్తోనే సీట్లు సాధించడం సాధ్యమేనా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. నియోజకవర్గ స్థాయిలో బలమైన క్యాడర్ లేకపోవడం, కేవలం స్టార్ పవర్ మీద ఆధారపడటం విజయ్ను మునగచెట్టు ఎక్కించినట్లు అవుతుందేమోనని అనుమానాలు కూడా ఉన్నాయి.
ఒంటరిగా గెలిచిన చరిత్ర ఉన్న పార్టీ లేని తమిళనాడు
తమిళనాడు ఎన్నికల చరిత్రను గమనిస్తే, ఇక్కడ పొత్తులు లేకుండా గెలవడం అసంభవం. గతంలో విజయకాంత్ వంటి నేతలు కూడా ప్రారంభంలో భారీ ఓట్లు సాధించినా, క్రమంగా పొత్తుల చట్రంలో ఇరుక్కుపోయారు. విజయ్ కూడా ఇప్పుడు ఓట్లు భారీగా చీల్చగలిగినా, అవి సీట్లుగా మారకపోతే మాత్రం ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. గెలిచిన అతి కొద్ది మంది ఎమ్మెల్యేలను ద్రవిడ పార్టీల ఆపరేషన్ ఆకర్ష్ నుంచి కాపాడుకోవడం కూడా ఆయనకు కత్తి మీద సాము లాంటిదే.
డీఎంకే, అన్నాడీఎంకే మౌనం వెనుక వ్యూహం!
విజయ్ ఎలాంటి ప్రభావం చూపిస్తారన్న దానిపై డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు పైకి లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నా, లోలోపల గట్టి వ్యూహాలే రచిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ ఓట్లు చీలిస్తే అది ఎవరికి నష్టం కలిగిస్తుందనే లెక్కల్లో వారున్నారు. ఒకవేళ విజయ్ గణనీయమైన ఓట్లు సాధించి, హంగ్ అసెంబ్లీ ఏర్పడితే మాత్రం పరిస్థితి మారుతుంది. అప్పుడు విజయ్ ఏదో ఒక కూటమిలో చేరాల్సిన లేదా బయటి నుంచి మద్దతు ఇవ్వాల్సిన, తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడవచ్చు. అలా కాకుండా కేవలం 10-15 సీట్లకే పరిమితమైతే, ఆయన పార్టీ ఉనికిని కాపాడుకోవడం కష్టమవుతుంది.
క్యాడర్ బలం లేని కరిష్మా.. ఎంతవరకు నిలుస్తుంది?
రాజకీయాల్లో జెండా పాతాలంటే కేవలం అభిమాన సంఘాలు సరిపోవు. ప్రతి బూత్ స్థాయిలో కమిటీలు, బలమైన క్షేత్రస్థాయి నాయకత్వం అవసరం. విజయ్ పార్టీకి ప్రస్తుతం ఈ వ్యవస్థాగత బలం తక్కువగా ఉందనేది వాస్తవం. డీఎంకే వంటి పార్టీలకు ఉన్న దశాబ్దాల అనుభవం, నెట్‌వర్క్‌ను ఎదుర్కోవాలంటే కేవలం ఆవేశం సరిపోదు. ఒకవేళ ఎన్నికల తర్వాత ఆశించిన ఫలితాలు రాకపోతే, విజయ్ వెనుక ఉన్న ఈ హైప్ ఒక్కసారిగా నీరుగారిపోయే ప్రమాదం ఉంది. సోమవారం రాబోయే ఫలితాలు విజయ్ సెంట్రిక్‌గానే ఉంటాయి. ఆయన రాజకీయ భవిష్యత్‌ను తేలుస్తాయి.


