ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ – విశ్వసనీయమైన రాజకీయ భాగస్వాముల కొరత. సజ్జల రామకృష్ణారెడ్డి వంటి కీలక నేతలు సమాన భావజాలం ఉన్న పార్టీలతో కలిసి పోరాడతామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. వైసీపీకి తోడుగా నిలిచే వారు కావాలని పార్టీ అధిష్టానం కోరుకుంటున్న తరుణంలో, కేవలం జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్ వంటి వారే ఆ పార్టీకి దగ్గరవుతున్నారు.
జడ శ్రవణ్‌ను పట్టుకుని ఈదుతున్న వైసీపీ
గత ఎన్నికల్లో కనీస ఓటు బ్యాంకును కూడా నిరూపించుకోలేకపోయిన శ్రవణ్ కుమార్ వంటి నేతలను అక్కున చేర్చుకోవడం వల్ల వైసీపీకి రాజకీయంగా వచ్చే లాభం ఎంతో ఎవరూ అంచనా వేయలేరు. ఒకప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు జరుగుతున్నాయని జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన శ్రవణ్, ఇప్పుడు అదే పార్టీకి మద్దతుగా నిలవడం రాజకీయ వింతగా మారింది. వైసీపీ రాజకీయంగా ఏకాకి కావడానికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీతో ఆ పార్టీకి ఉన్న సన్నిహిత సంబంధాలేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ .. వైసీపీకి మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా లేవు. సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి వచ్చే పార్టీలను ఆహ్వానిస్తున్నప్పటికీ, బీజేపీ నీడ పడటానికి ఇష్టపడని ఏ పార్టీ కూడా వైసీపీ వైపు కన్నెత్తి చూడటం లేదు.
ఎవరూ నమ్మకుండా చేసుకున్న జగన్
గత ఐదేళ్ల పాలనలో వైసీపీ అనుసరించిన ఒంటరి పోరు వ్యూహం ఇప్పుడు ఆ పార్టీకి శాపంగా మారింది. సంక్షేమ పథకాల ద్వారా 5 కోట్ల మందిని నేరుగా టచ్ చేశామని పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ, ఇతర రాజకీయ పార్టీలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడంలో వైఫల్యం చెందారు. నాయకత్వంలోని లెక్కలేనితనం, అహంకారం వల్ల సొంత పార్టీ నేతలే పార్టీకి దూరమవుతున్న తరుణంలో, కొత్త మిత్రులు రావడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. రాజకీయంగా వైసీపీ ఉనికి చాటుకోవాలంటే బలమైన రాజకీయ మిత్రులు అవసరం. కానీ, కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం వచ్చే జడ శ్రవణ్ వంటి వారు పార్టీకి వాల్యూ యాడ్ చేయడం అటుంచితే, పార్టీ ఫేస్ వాల్యూని మరింత తగ్గించే ప్రమాదం ఉంది.
ఇండియా కూటమిలో జగన్ చేరితేనే మిత్రులు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఇండియా కూటమిలో చేరడం అనేది మంచి ఆప్షన్ అని ఎక్కువ మంది అభిప్రాయం. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిని జాతీయ స్థాయిలో ఢీకొట్టడానికి జగన్‌కు ఇండియా కూటమి ఒక వేదికగా ఉపయోగపడవచ్చు. ఒకవేళ జగన్ ఈ కూటమిలో చేరితే, రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక ఓట్లు , మైనారిటీ ఓట్లు గంపగుత్తగా వైసీపీకి పడే అవకాశం ఉంది. గతంలో ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు తెలపడం , కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో అవసరమైనప్పుడు సహకరించడం వల్ల, ఆయనను ఇండియా కూటమి నేతలు ఎన్డీయే అనధికార భాగస్వామి గా భావిస్తున్నారు. అంతేకాకుండా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జగన్ సోదరి వైఎస్ షర్మిల నాయకత్వం వహిస్తుండటంతో ఆయనను ఇండియా కూటమిలో కూడా చేర్చుకోవడం కష్టంగా భావిస్తున్నారు. అందుకే జగన్‌కు మిత్రులు లేరు.. సింహం సింగిల్ అని డైలాగులు చెప్పుకోవాల్సిన పరిస్థితే కొనసాగనుంది.
