అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని కళ్లారా చూడటం ఇష్టం లేక బెంగళూరు వెళ్లిన జగన్ రెడ్డి..ప్యాలెస్ లో హాయిగా కూర్చొని ట్వీట్లు చేస్తున్నారు. అమరావతి రీస్టార్ట్ కావడంతో కనీసం శుభాకాంక్షలు కాదుకదా, సలహాలు, సూచనలు ఇవ్వడం మానేసి కొత్తగా రైతు రాజకీయం మొదలు పెట్టారు.
రైతులకు పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల ఊబిలోకి కూరుకుపోయారని జగన్ ట్వీట్ చేశారు. వారి గోడును కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడు అంటూ పేర్కొన్నారు. రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం చేసేందుకు కూటమి సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. రైతులకు వర్షాకాలం ప్రారంభానికి ముందే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించారు. మే నెలలోనే ఆ నగదును ఆయా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రమంతా అమరావతి రీస్టార్ట్ గురించి చర్చించుకుంటుంది. ఈ సమయంలో వైసీపీ రాక్షస రాజకీయంపై కూడా చర్చ జరుగుతోంది. దీంతో జగన్ రైతు రాజకీయం చేసేందుకు ఈ అంశాన్ని లేవనెత్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి రైతులకు సమస్య ఉంటే ట్వీట్ల కన్నా, ఫీల్డ్ లోకి దిగితేనే రైతులకు భరోసా కల్పించినట్లు అవుతుంది. కానీ , ఆయన ఎజెండానే రాజకీయం కావడంతో ట్వీట్లతో కాలక్షేప రాజకీయం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.