అప్పు చేసి పప్పుకూడు పెడుతున్న ఏపీ సీఎం ..!

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి నగదు బదిలీ పథకాలతో ప్రజలను మైమరపింప చేస్తున్నారు. మొన్న ఆటో డ్రైవర్లకు రూ. పదివేలు.. నిన్న రైతు భరోసాతో రైతులకు రూ. 7,500 ఇచ్చిన జగన్ సర్కార్.. మరిన్ని పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవంబర్‌ 21న ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు రూ. 10వేలు, డిసెంబర్ 21న మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి రూ. 24వేలు చొప్పున సాయం పంపిణీ చేయనున్నారు. జనవరి 26న అమ్మ ఒడి కార్యక్రమం కింద ఏపీలో స్కూలుకు వెళ్తున్న ప్రతి విద్యార్థి తల్లి 15వేలు ఇవ్వాల్సి ఉంది. ఇలా పథకాల ప్రవాహం కొనసాగుతోంది. ఏప్రిల్ నుంచి మళ్లీ రీసైక్లింగ్ నగదు బదిలీ జరుగుతుంది. వచ్చే ఏడాది 45 ఏళ్లు నిండిన ప్రతీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 75వేలు, డ్వాక్రా రుణ మాఫీ లాంటివి అదనం.

నగదు బదిలీ పథకాలన్నింటికీ అప్పులే గతి..!

నగదు బదిలీ పథకాలకు ప్రధానంగా ఏపీ సర్కార్ అప్పులపైనే ఆధారపడుతోంది. ఏ రాష్ట్రమైనా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ప్రకారం అప్పులు చేయాలి. జీఎస్‌డీపీ ఆధారంగా ఈ పరిమితి నిర్ణయిస్తారు. ఏపీకి ఈ ఏడాది 32,000 కోట్ల రుణాలను బహిరంగ మార్కెట్‌ నుంచి రాష్ట్రం సమీకరించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 23 వేల కోట్ల రుణం తీసుకుంది. ఇంకా 6,000 కోట్లు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. వాటి కోసమూ.. ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఎస్బీఐ మరిన్ని వివరాలు కోరడంతో.. మూడు వేల కోట్ల రుణం అగిపోయింది. మరో నెలలో ఈ ఆరు వేల కోట్ల రుణాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. కొత్తగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పౌరసరఫరాల శాఖల ద్వారా మరో ఏడు వేల కోట్లను రుణాలుగా తీసుకునేందుకు నిన్న కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే అప్పు చేసి ప్రజలకు పంచుతున్నారన్నమాట.

రాష్ట్ర ఆదాయం ఉద్యోగుల జీతాలకూ సరిపోవడం లేదు..!

అధికారిక లెక్క ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మూడున్నర లక్షలు. వీరి జీతాల ఖర్చు నెలకు రూ. కు 2,083కోట్లు. మూడున్నర లక్షల మంది పెన్షన్ దారులకు రూ. 1,064. నాలుగు లక్షల 45వేల మంది టీచర్లు, కార్పొరేషన్ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఇచ్చే జీతాలతో కలిపితే ఈ శాలరీ బిల్ నెలకు రూ., 5,500కోట్లు దాటి పోతుంది. ఇప్పుడు రిక్రూట్ చేసిన వాలంటీర్‌లకి, సచివాలయ ఉద్యోగులకి కలిపి నెలకి.. రెండు వేల ఐదు వందల కోట్లు అవుతుంది. ఒకటి, రెండు నెలల్లో ఆర్టీసీ ఉద్యోగుల్ని విలీనం చేస్తారు. అంటే.. జీతాల బిల్లు రూ. 8, 300 కోట్లు నెలకు అవుతుంది. అంటే ఏడాదికి దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు ఉద్యోగులుకు జీతాలుగా చెల్లించాలి. కానీ.. 2019-20 బడ్జెట్‌లో టాక్స్ రెవెన్యూ చూపించింది రూ. 75,438 కోట్లు మాత్రమే. ఈ రెవిన్యూ ఇప్పుడు సగానికి సగం తగ్గింది. కానీ జీతాల భారం తగ్గదు. అంటే.. వచ్చే ఆదాయం కన్నా… జీతాల ఖర్చే చాలా … చాలా ఎక్కువ.

సంపద సృష్టించి పంచడమే గొప్ప.. అప్పులు చేయడం కాదు..!

ప్రభుత్వాని అంత సొమ్మును సముపార్జించగలిగే సామర్థ్యం నాయకుడికి ఉండాలి. ఏప్రిల్ – జూలై నెలల్లో ఆంధ్రప్రదేశ్ పన్నుల ఆదాయం అంతకు ముందు ఏప్రిల్ – జూలైతో పోలిస్తే..ఏకంగా 42.7 శాతం తగ్గిపోయింది. గత ఏడాది సెప్టెంబరుతో పోల్చితే రాష్ట్ర ఆదాయం 450 కోట్లు తగ్గిపోయింది. ఓ వైపు ఆదాయం పతనం అవుతూంటే… మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం… ఆదాయార్జనపై దృష్టిపెట్టకుండా.. పథకాలకు నగదు బదిలీపై దృష్టి సారించింది. ఏపీలో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. నగదు చలామణి ఆగిపోయింది. దీంతో.. ప్రభుత్వానికి పన్ను ఆదాయం పడిపోయింది. ఇదంతా స్వయంకృతమే. సంపద ని సృష్టించడం చేతనయ్యే వారికే పంచే అవకాశం, అధికారం ఉంటుంది. డబ్బే చేతిలో వుంటే ఏ ముఖ్యమంత్రీకీ సమస్యలు ఉండవు. సంపద సృష్టించి పంచడమే నాయకుని లక్షణం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com