ప్రతిపక్ష నేత హోదా లేదు కాబట్టి ఆ రేంజ్ మెయిన్టెయిన్ చేయాల్సిన అవసరం లేదని కొంత మంది అనుకుంటూ ఉంటారు. అందుకే.. ఇరుగు పొరుగు గొడవలు, కాలేజీల విద్యార్ధుల ఘర్షణల్ని తీసుకు వచ్చి.. శాంతిభద్రతలు అసల్లేవని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు. నిజానికి వారి రేంజ్ అదే. కానీ ప్రజల దురదృష్టం కొద్దీ పెద్ద నాయకులుగా చెలామణి అవుతూంటారు.
రెండు రోజుల కిందట తిరుపతిలోని మోహన్ బాబు వర్శిటీలో ఇద్దరు విద్యార్థులు కొట్టుకున్నారు. కాలేజీల్లో ఇలాంటి గొడవలు జరుగతూనే ఉంటాయి. రామ్ గోపాల్ వర్మ శివ సినిమా తీయడానికి ముందు నుంచీ ఉన్నాయి. ఆతర్వాత కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదో కొత్తగా కొట్టుకుంటున్నారని ఇది శాంతిభద్రతల నిర్లక్ష్యం అని .. వైసీపీ అధ్యక్షుడు 39.3 శాతం ఓట్ల ప్రతినిధిగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఓ ట్వీట్ వేసేశారు. ఆయన ట్వీట్ చూసి చాలా మంది ఇదే పెద్ద సమస్య అయితే.. ఇంతకు మించి పెద్ద సమస్యలు రాష్ట్రంలో లేనట్లేనని అనుకుంటున్నారు.
జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హత్యలు, దోపిడీలు కామన్. అవి జరిగితే ఎవరూ ఆశ్చర్యపోయేవారు కాదు. రొటీనేగా అనుకునేవారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కాలేజీల్లో చిన్న చిన్న గొడవలు మాత్రమే పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. స్వయంగా జగన్ రెడ్డినే ఈ విషయాన్ని చెబుతున్నారు. కుల రాజకీయాల కోసం పనికి వస్తాయని తప్పుడు రాజకీయాలు చేయడానికి జగన్ రెడ్డి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇలాంటి రాజకీయ నేతలతోనే సమాజానికి పెనుముప్పు ఉంటుంది.