వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల పేరుతో షో చేశారు. ఉదయం లారీలకు జెండా ఊపారు. మళ్లీ కార్యాలయంలో కీలక సమావేశం అని ప్రసంగం విడుదల చేశారు. తర్వాత గవర్నర్ నివాసం లోక్ భవన్ కు ర్యాలీగా వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. అన్ని చోట్లా ఒకటే చెప్పారు. తాను అనుకున్నదే చెప్పారు. అక్కడ ఆయన చెబుతున్నది ప్రభుత్వం చేయడం లేదని మాత్రం ఆయన అనుకోవడం లేదు. ఈ విషయం పక్కన పెడితే.. ఆయన షెడ్యూల్ ఇంతటితో పూర్తయిపోయింది. క్రిస్మస్ హాలీడేస్ తర్వాత మళ్లీ నూతన సంవత్సరంలోనే ఆయన ఏపీలోకి అడుగు పెట్టనున్నారు.
తాడేపల్లి నుంచి లోక్ భవన్ వరకు వెళ్లేందుకు పార్టీ ముఖ్యనేతలందర్నీ పిలిచి ర్యాలీ చేశారు. ఓ పాతిక కార్లతో పాటు దేవినేని అవినాష్ లాంటి వాళ్లు మరో వంద బైకుల్ని పంపించారు. వాటితోనే డ్రోన్ విజువల్స్ తీసుకున్నారు. అదో గొప్ప ర్యాలీ అన్నట్లుగా మీడియాకు పంపించారు. ఆ డ్రోన్ మరీ పైకి పోవడంతో వారధిపై సగం కూడా ఆయన కాన్వాయ్ లేదని తేలిపోయింది. దీంతో జన సమీకరణ పెద్దగా చేయలేదని క్లారిటీ వచ్చింది. అయినా గవర్నర్ ను కలవడానికి వెళ్లేటప్పుడు కూడా ఇలా జన సమీకరణ చేయడం ఏమిటో వైసీపీ నేతలకే తెలియాలి.
అసలు పీపీపీ మోడల్ అంటే ప్రైవేటీకరణ కాదని జగన్ కూడా తెలుసు. ఆయన రాజ్ భవన్ ముందు నిలబడి అంతా ప్రభుత్వం చేతుల్లో ఉంటుందని జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటో జగన్ ఎవరినైనా నిపుణుల్ని అడిగితే చెప్పి ఉండేవారు. అన్నీ తెలిసి ప్రజలకు ఏమీ తెలియదని తాము వాళ్లను గందరగోళంలో పెట్టేసి.. ఫేక్ ను నమ్మించేయాలని అనుకుంటున్నారు.


