ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా మావిగన్ మానియానే కనిపిస్తోంది. ఇది వైసీపీ మీడియా సాక్షికి ఓ రకంగా కనిపిస్తోంది. అద్భుతమైన ఆలోచన అని జనం చర్చించుకుంటున్నారట. ఇలాగే జగన్ ను నమ్మించి ఈ స్థాయికి తీసుకు వచ్చారు. ఇప్పటికీ మారలేదు. నిజంగా జగన్ లేదా వైసీపీ నేతలు ఫీడ్ బ్యాక్ ఏంటో తెలుసుకోవాలంటే పెద్దగా కష్టపడక్కర్లేదు.
స్టాండప్ కమెడియన్స్ కూడా ఇలా నవ్వించలేరు!
మావిగన్‌పై మూడు రోజులుగా ఈ పేరుపై జరుగుతున్న ట్రోలింగ్, వస్తున్న మీమ్స్ చూస్తుంటే.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒకే ఒక్క మాటతో రాష్ట్రం మొత్తాన్ని కామెడీ క్లబ్ గా మార్చేశారని అర్థమవుతోంది. మూడు రాజధానుల ఎపిసోడ్ ఫ్లాప్ అయిన తర్వాత, మళ్లీ పాత అలవాటు ప్రకారం ఒక వింతైన రాజధాని ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు.
సోషల్ మీడియాలో గన్ పేలింది!
సాధారణంగా ఏదైనా బ్లాస్ట్ అయ్యే ఇష్యూ జరిగితే సోషల్ మీడియాలోఒకటి రెండు రోజులు హడావుడి జరుగుతుది. తర్వాత తగ్గిపోతుంది. కానీ మావిగన్ మాత్రం తగ్గడం లేదు. నెటిజన్లు దీనికి రకరకాల పేర్లు పెట్టి ఆడుకుంటున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపితే మావిగన్ అయితే.. మరి తిరుపతి, నెల్లూరు, చిత్తూరు కలిపితే తినెచి అవుతుందా అంటూ వెటకారాలు ఆడుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో, యూట్యూబ్ షార్ట్స్ లో జగన్ వాయిస్ కు రకరకాల కామెడీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి తెగ వైరల్ చేస్తున్నారు. వైసీపీ మేధావులు ఈ పేరును ఏ ఉద్దేశంతో సృష్టించారో కానీ, అది ఇప్పుడు వారి పార్టీ పరువును బజారున పడేసే సెల్ఫ్ గోల్ గన్ లా మారింది.
అంబటి, పేర్ని నాని.. నవ్విన నాపచేనే పండుతుంది!
ఇంత జరుగుతున్నా వైసీపీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మాత్రం తమదైన శైలిలో కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. “ఇప్పుడు నవ్వుతున్న వాళ్లంతా రేపు మావిగన్ గొప్పతనం చూసి ఆశ్చర్యపోతారు” అని వారు సెలవిస్తున్నారు. అంటే, అప్పట్లో మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లు కాలక్షేపం చేసి, ఒక్క ఇటుక కూడా వేయని వైనాన్ని ప్రజలు మర్చిపోయారని వారు అనుకుంటున్నట్లున్నారు. అంబటి అప్పట్లో సంక్రాంతి డ్యాన్సులు’ వేసి ఎలాగైతే ఫేమస్ అయ్యారో, ఇప్పుడు ఈ మావిగన్ వాదనతో అంతకంటే ఎక్కువ కామెడీని పంచుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఘాటైన ఫీడ్ బ్యాక్ ను పట్టించుకోకుండా, అదే పాత పంథాలో సమర్థించుకోవడం అంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదడమే అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఫీడ్ బ్యాక్ అదుర్స్.. వైసీపీ పరిస్థితి బేజార్!
నిజానికి ఏ రాజకీయ పార్టీకైనా ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ప్రాణవాయువు లాంటిది. కానీ వైసీపీ మాత్రం ఆ ఆక్సిజన్ కన్నా తమ కోటరీ ఇచ్చే కార్బన్ డయాక్సైడ్ నే ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు కనిపిస్తోంది. అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత లభించిన తర్వాత, ప్రజలంతా ఒక క్లారిటీతో ఉంటే.. మళ్లీ విడ్డూరమైన పేర్లతో గందరగోళం సృష్టించడం జగన్ రెడ్డి చేసిన అతిపెద్ద తప్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మావిగన్ అనేది విజన్ కాదని, అది కేవలం టెన్షన్ అని ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చేశారు. తనను తాను సంస్కరించుకోకపోతే, భవిష్యత్తులో వైసీపీ అడ్రస్ కూడా ఇలాంటి ఏదైనా ఒక వింత పేరుతో కలిసిపోవడం ఖాయం.
గన్ లో లోడ్ ఉందా?
జగన్ మావిగన్ లో గాలి తప్ప గోలీ లేదని తేలిపోయింది. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి, ఇప్పుడు కొత్త కొత్త పేర్లతో ప్రజలను బురిడీ కొట్టించాలనుకోవడం వారి అమాయకత్వమే అవుతుంది. నవ్వుల పాలవడానికి కూడా ఒక హద్దు ఉంటుందని, ఆ హద్దును వైసీపీ ఎప్పుడో దాటేసిందని సోషల్ మీడియాలో వస్తున్న ఫీడ్ బ్యాక్ స్పష్టం చేస్తోంది. కానీ వారు కళ్లు తెరిచి నిద్రపోతున్నారు. తెలుసుకోలేరు.
