ఏపీ లిక్కర్ స్కామ్‌లో అసలు నగదు రూపంలోనే ఎందుకు లావాదేవీలు నిర్వహించారో సిట్ అధికారులు ఆరా తీస్తే.. స్కామ్ ఎంత పెద్దదో తెలుస్తుందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అంటున్నారు. లిక్కర్ స్కామ్‌పై ఆమె విజయవాడలో స్పందించారు. సిట్ దర్యాప్తు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందన్నారు. ఎందుకంటే ఎంత సేపు.. కమిషన్లు, లంచాల గురించే చెబుతున్నారు కానీ.. నగదు లావాదేవీల వెనుక జరిగిన అసలు స్కాం గురించి ఆలోచించడం లేదన్నారు.
షర్మిల లెక్క ఏమిటంటే.. లిక్కర్ కు సంబంధించి అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మించారు. అంటే ఫ్యాక్టరీల్లో తయారవుతుంది. కానీ లెక్క ఉండదు. లిక్కర్ షాపునకు వస్తుంది. లెక్క ఉండదు. అమ్మేస్తారు. కానీ లెక్క ఉండదు. లెక్క అంతా.. ప్రత్యేక వ్యవస్థ చేతుల్లోకి వెళ్తుంది. అంటే ఒక్కో దుకాణంలో రోజుకు ఓ పది కేసులు ఇలాంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మించినా దాదాపుగా మూడు వేల దుకాణాలు, బెల్టు షాపుల ద్వారా ఎంత అమ్మించారో లెక్క వేయవచ్చు. ఇలా వేల కోట్లు కొట్టేశారని షర్మిల అంటున్నారు. ఇది నేరుగా ఖజానాను దోచుకోవడమేనని ఇంత కంటే ఘోరమైన నేరం ఉంటుందా అని అంటున్నారు.
షర్మిల చెప్పిన కోణంలో ఇప్పటి వరకూ సీఐడీ సిట్ అధికారులు విచారణ చేయలేదు. గతంలో డిస్టిలరీల్లో విచారణ జరిగినప్పుడు.. ఉత్పత్తికి .. మద్యం దుకాణాలకు పంపిణీ చేసిన మొత్తానికి సంబంధం లేదు. ఇతర రాష్ట్రాల్లో అమ్మడానికి పర్మిషన్ లేదు. ఉత్పత్తి అయిన అదనపు మద్యం ఎటు పోయిందన్నది సీఐడీ అధికారులు గుర్తించలేదు. ఇక ముందు అయినా అలాంటివి బయటకు లాగితే.. లిక్కర్ స్కామ్ విస్తృతి పెరుగుతుంది.