ఏపీలో కాంగ్రెస్ ను రేసులోకి తీసుకొచ్చేందుకు షర్మిల అనేకానేక ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయాల్లో ఎదిగేందుకు ప్రస్తుతం ఆమెకు ఇది కీలక సమయం.తన ఉనికి కోసం ఈ సమయాన్ని వినియోగించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఆమె చేస్తోన్న రాజకీయం కొంత ఎబ్బెట్టుగా కనిపిస్తోన్నా, ఉనికిని పదిలం చేసుకునేందుకు ఏదో విధంగా శ్రమిస్తున్నారు. షర్మిల రాజకీయ అడుగులను గమనిస్తే వైసీపీ స్థానంలో కాంగ్రెస్ ను రేసులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.
అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం నేపథ్యంలో ఏపీలో రెండు వారాల కిందటే హడావిడి మొదలైంది. రాజకీయాలు అంతా అటువైపు టర్న్ అయ్యాయి. ఒక్క వైసీపీ మాత్రం మరో టర్న్ తీసుకొని పాలిటిక్స్ చేసింది. శవ రాజకీయాలు చేసింది. వైసీపీ ప్లేసుపై కన్నేసిన షర్మిల ఈ సమయాన్ని పక్కాగా ఉపయోగించుకోవాలని అమరావతి మట్టిని ప్రధానికి పంపుతున్నానని చెప్పుకొచ్చారు. దీని ద్వారా పెద్దగా ప్రభావం ఉండకపోయినా వార్తల్లో వైసీపీ కన్నా షర్మిలే ఎక్కువ హైలెట్ అయ్యారు.
అమరావతి పునర్ నిర్మాణ సభ ముగిసిన తర్వాత ప్రధాని పర్యటనపై విమర్శలు చేసేందుకు జగన్ రెడ్డికి నోరు రాలేదు. అంబటి రాంబాబును ఎగదోశారు. లాజిక్ మాట్లాడుతున్నానని భ్రమలో లాజిక్ లేకుండా మాట్లాడి మమా అనిపించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని కోరుతున్న జగన్ రెడ్డి.. అమరావతి నిర్మాణం తథ్యం అని తెలిసాక కనీసం సలహాలు, సూచనలు చేయడానికి కూడా ఇష్టపడలేదు.
షర్మిల మాత్రం ఏపీలో అనధికారికంగా కాంగ్రెస్ ను ప్రతిపక్ష పార్టీగా నిలిపేందుకు ప్రయత్నిస్తూ ప్రధానిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని వ్యాఖ్యలను చూస్తుంటే చిచ్చుబుడ్డి తుస్సుమన్నట్లుగా ఉందని సెటైర్ వేశారు. షర్మిల చేసిన వ్యాఖ్యలు ప్రభావం చూపించకపోయినా, ప్రతిపక్షంగా విమర్శ చేసే స్థానంలో జగన్ కు బదులు షర్మిల కనబడుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో కలిగేలా చూసుకున్నారు.