ప్రభాస్ తో నాకు సంబంధం ఉందంటూ టిడిపి విషప్రచారం చేస్తోంది: షర్మిల

వైఎస్ఆర్సిపి నాయకురాలు, వై ఎస్ ఆర్ సీ నేత జగన్ చెల్లి షర్మిల ఈరోజు సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న విష ప్రచారం గురించి హైదరాబాద్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రముఖ హీరో ప్రభాస్ తో తనకు సంబంధం ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారం వెనకాల తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ అసత్య ప్రచారం పై దర్యాప్తు జరిపి, దీని వెనకాల ఉన్న వాళ్ళను కఠినంగా శిక్షించాలని షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రభాస్ ని జీవితంలో ఎప్పుడూ కలవలేదు , మాట్లాడలేదు: షర్మిల

షర్మిల మాట్లాడుతూ,” ఏ హీరోతో అయితే సంబంధం ఉందని తప్పడు ప్రచారం చేస్తున్నారో, ఆ వ్యక్తిని నా జీవితంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కలవలేదు, మాట్లాడలేదు. ఇదే నిజమని నాపిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఈ రోజు మాట్లాడకపోతే ఇదే నిజం అని కొంతమంది అయినా అనుకునే అవకాశం ఉంది కాబట్టి, ఈ తప్పుడు ప్రచారాలను మూలాలతో సహా తొలగించాలనే ఉద్దేశంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశాము” అని వ్యాఖ్యానించింది

ఈ విష ప్రచారం వెనుక టిడిపి హస్తం : షర్మిల

షర్మిల మాట్లాడుతూ, 2014 ఎన్నికలకు ముందు నుండి సినీ హీరో ప్రభాస్‌కు తనకు సంబంధం ఉంది అని ఆన్‌లైన్‌లో దుష్ప్రచారం మొదలు పెట్టారని , ఎన్నికల తరువాత దీనిపై ఫిర్యాదు కూడా చేశామని, పోలీసుల విచారణ అనంతరం కొంతకాలం ఈ విష ప్రచారం ఆగిపోయిందని, కానీ, ఎన్నికలు వస్తున్నాయి కనుక ఈ విషప్రచారానికి మళ్లీ వేగం పెంచారని వ్యాఖ్యానించింది. ఈ ప్రచారాల వెనుక టీడీపీ ఉందని తాను భావిస్తున్నానని, టీడీపీకి పుకార్లు పుట్టించడం కొత్త కాదని, నాన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫ్యాక్షనిస్టు అంటూ పుకార్లు పుట్టించింది, తన అన్న వైఎస్‌ జగన్‌ కోపిష్టి, గర్విష్టి అని పుకార్లు పుట్టించింది కూడాా టీడీపీయేనని షర్మిల వ్యాఖ్యానించింది

వైఎస్ఆర్సిపి మళ్లీ వ్యూహాత్మక తప్పిదం చేసిందా?

హఠాత్తుగా షర్మిల , సోషల్ మీడియా ప్రచారం పై పోలీస్ కంప్లైంట్ చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటిదాకా సోషల్ మీడియాలో మాత్రమే నలుగుతున్న ఈ ప్రచారాన్ని తానే స్వయంగా ప్రధాన మీడియాకు తీసుకువచ్చినట్టు అయిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా ఈ ప్రచారం ఇప్పటిది కాదు. కడప మాజీ మేయర్ మరియు వైయస్ రాజశేఖర్ రెడ్డి బంధువు అయిన రవీంద్రనాథ్ ప్రభాస్ తో యోగి సినిమా తీసిన సమయం నుండి అడపాదడపా ఈ రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే 2014 ఎన్నికలకు ముందు ఈ రూమర్లు మరి తీవ్ర రూపం దాల్చడంతో స్వయానా ప్రభాస్ వచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే సోషల్ మీడియా ప్రచారానికి ఈ ఖండనలు , వివరణలు అడ్డుకట్ట వేయలేకపోయాయి. ఇప్పుడు షర్మిల కంప్లైంట్ ల తర్వాత ఇది ఏమాత్రం తగ్గుతాయా అన్నది సందేహమే.

జగన్ వ్యాఖ్యలను గుర్తు చేస్తున్న వ్యతిరేకులు:

అయితే జగన్ వ్యతిరేకులు మాత్రం, సాక్షాత్తు వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్ సైతం మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.” పవన్కళ్యాణ్ కార్లను మార్చినట్టు పెళ్లాలను మారుస్తాడు, ఇదే పని ఇంకొకరు చేసి ఉంటే బొక్కలో వేసే వాళ్ళు” అంటూ పరమ నాటు భాషలో జగన్ మాట్లాడిన విషయాలను గుర్తు చేస్తున్నారు జగన్ వ్యతిరేకులు. అలాగే వైఎస్ఆర్సిపి అభిమానులు కూడా సోషల్ మీడియాలో లోకేష్ ని పప్పు అంటూ హేళన చేయడాన్ని, గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబును ఉద్దేశించి “నా కడుపున ఎందుకు పుట్టాడా అని నీ తల్లి బాధపడేలా” అంటూ చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేస్తూ, అన్ని పార్టీల వాళ్ళు ఒకే తానులోని ముక్కలే అని ముక్తాయింపు ఇస్తున్నారు.

మొత్తం మీద:

మహిళా నాయకులను టార్గెట్ గా చేసుకుని మీడియాలోనూ సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారానికి అడ్డుకట్ట వేయాల్సి ఉంది, అది ఏ పార్టీ నాయకులైనా సరే. అయితే సోషల్ మీడియాలో ఇటువంటి ప్రచారాన్ని చేసే ఆకతాయిల ను కంట్రోల్ చేయడానికి ముందు రాజకీయ నాయకులు తాము మాట్లాడుతున్న భాష ను కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి షర్మిల ఫిర్యాదు తర్వాత అయినా ఈ ప్రచారం ఆగుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com