వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ కోర్టులో సునీత తరపు లాయర్లు గట్టి వాదనలు వినిపించారు. వారు ఒకే ప్రధాన పాయింట్‌ను వినిపించారు. హత్య జరిగిన విషయం ఎవరికీ తెలియక ముందే హంతకుల నుంచి జగన్ మోహన్ రెడ్డికి, ఆయన సతీమణికి సమాచారం వచ్చింది. అంతా గుట్టుగా చేసేసి.. ఉదయం వచ్చిన పీఏ ద్వారా బయట ప్రపంచానికి తెలిసేలా చేశారని అనుమానాలు బలపడుతున్నాయి. సీబీఐ కూడా హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో ఈ అంశం గురించి కల్లాం అజేయరెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని సమర్పించారు.
ఇప్పుడు సీబీఐ దర్యాప్తు కొనసాగింపు గురించి ఇదే పాయింట్ ను సునీత తరపు న్యాయవాదులు ఎక్కువగా కోర్టులో వాదించారు. ఇలాంటి అనుమానాలు ఉన్నప్పుడు..వాటికి ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు దర్యాప్తు అవసరం లేదని చెప్పడానికి అవకాశం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మరో వైపు వివేకా హత్యకేసు నిందితులు మాత్రం.. కేసు విచారణను ఇక్కడితో ఆపేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సునీత వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేసును కొనసాగిస్తున్నారని వాదిస్తున్నారు.
సునీత తన తండ్రికి జరిగిన అన్యాయానికి, అలా చేసిన వారికి శిక్షించడానికి నిరంతరాయంగా పోరాడుతున్నారు. ఆమెకు వ్యక్తిగత ప్రయోజనాలు .. ఇతర అవసరాలు ఉండి ఉంటే ఈ పాటికి ఎప్పుడో నిందితులు అయిన తన బంధువులతో రాజీపడిపోయేవారు. కానీ వారు ఆమెను, ఆమె భర్తనే నిందితులుగా మార్చాలని కుట్రలు చేశారు. కేసు సీబీఐకి వెళ్లకపోతే వారు అదే చేసి ఉండేవారు. అందుకే అలాంటి వారిని వదలకూడదని పోరాడుతున్నారు. కోర్టు తీసుకునే నిర్ణయం ఈ కేసులో అత్యంత కీలకం అనుకోవచ్చు.


