వైఎస్ వివేకానందరెడ్డ భార్య సౌభాగ్యమ్మకు పులివెందులలో ఏడు ఎకరాల భూమి ఉండేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ భూమి ఆన్ లైన్ లో ఎవరి పేరు మీదకో మారిపోయింది. ఆ భూమిని వారు అమ్మలేదు. కనీసం అమ్మే ప్రయత్నం చేయలేదు.కానీ రికార్డుల్లో మాత్రం మారిపోయింది. ఇటీవల ఈ విషయం గుర్తించిన వైఎస్ సునీత, ఆమె తల్లి కడప కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు తెలిశాయి. కృష్ణారెడ్డి అనే తహశీల్దారు ఈ పనికి పాల్పడ్డారు.
వివేకానందరెడ్డి చనిపోయారు కాబట్టి ఆయన భార్యపై ఉన్న ఆస్తుల్ని కొట్టేస్తే ఎవరూ పట్టించుకోరని ఈ పనికి పాల్పడ్డారు. అయితే తహశీల్దారు సొంతానికి ఇలాంటి పనులు చేయరు. ఆయనపై ఖచ్చితమైన ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి ఎవరిదన్నది తెలియాల్సి ఉంది. వైఎస్ వివేకాను అత్యంత దారుణంగా హతమార్చడమే కాకుండా ఆ కుటుంబానికి ఉన్న ఆస్తులను కాజేసేందుకు ఐదు సంవత్సరాల హయాంలో భారీ కుట్రలు జరిగాయి. ఆ హత్యకేసును కూడా చివరికి వివేకా కుమార్తె, అల్లుడిపైనే నెట్టేందుకు కుట్రలు జరిగాయి. ఎలాగోలా సీబీఐకి వెళ్లడంతో బయటపడ్డారు.
ఇప్పుడు అధికారులు ఈ భూముల బదలాయింపుకుట్ర వెనుక ఎవరున్నారో ఆరా తీస్తున్నారు. వివేకా కుటుంబ ఆస్తులు పై స్థాయి వారికి తెలియకుండా ఇతరులకు బదిలీ కావు. అసలు రిజిస్ట్రేషన్ లావాదేవీ లేకుండా ఇలా ఆన్ లైన్ రికార్డుల్లో వారి పేర్లు తీసేసి వేరే పేర్లు పెట్టుకోవడమే అత్యంత దారుణమైన విషయం. ఇలా భూములపై వివాదాలు సృష్టించుకుంటే.. ఏపీలో ఒక్క భూమి కూడా క్లీన్ గా ఉండదు. వైసీపీహయాంలో ఇలా నేతలు తమఇష్టం వచ్చినట్లుగా వెబ్ ల్యాండ్ లో పేర్లు మార్చుకుని అరాచకాలకు పాల్పడటంతో భూవివాదాలు లక్షల సంఖ్యలో వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటినీ సరి చేయడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
