ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ఇస్తామని వైసీపీ ఏ మాత్రం సిగ్గుపడకుండా ప్రకటించేసింది. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణ ద్వారా ప్రకటించారు. ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి మద్దతివ్వడం ఏమిటని వచ్చిన ప్రశ్నలకు బొత్స తనకు మాత్రమే సొంతమైన లాంగ్వేజ్‌లో సమాధానం ఇచ్చారు. అదేమిటంటే నెంబర్ గేమ్ ఉండొద్దని అట. నెంబర్ గేమ్ ఏమి ఉందో.. బొత్స చెప్పాల్సింది. అక్కడ ఎలాంటి నెంబర్ గేమ్ లేదు. ఎన్డీఏకు సంపూర్ణమైన మెజార్టీ ఉంది. వైసీపీ ఇచ్చే సపోర్టుతో వచ్చేది .. పోయేది ఏమీ ఉండదు. అయినా సారగిలపడిపోయారు.
గతంలో ప్రణబ్ ముఖర్జీకి కూడా మద్దతు ఇచ్చామని.. ఇప్పుడు అలాగే ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నామని బొత్స వాదించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీకి మద్దతిచ్చారు..ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి మద్దతిస్తున్నారని పరోక్షంగా చెప్పారని అనుకోవాలి. తమ ప్రత్యర్థులకు మద్దతు ఇచ్చి రాజకీయం ఎలా చేస్తారని వస్తున్న ప్రశ్నలకు బొత్స వద్ద సమాధానం లేదు. ఇలా ఓ వైపు మద్దతు ఇస్తూ.. మరో వైపు విమర్శలు చేస్తే ప్రజలు అసహ్యించుకుంటారని కూడా అనుకోవడం లేదు.
ఇప్పటికే జాతీయ స్థాయిలో జగన్ రెడ్డి ఒంటరి అయ్యారు. ఆయన కోసం అయ్యోపాపం అనే వారు లేకుండా పోయారు. గతంలో ఆయన ఢిల్లీలో ధర్నా చేస్తే ఇండీ కూటమిలోని చాలా పార్టీలు మద్దతు పలికాయి. కానీ ఈ సారి ఆయన ఢిల్లీకి పోతే.. అటు ఎన్డీఏ కూటమి నుంచి కానీ.. ఇటు కాంగ్రెస్ కూటమి నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా మద్దతు తెలియచేయరు. పూర్తి స్థాయిలో ఒంటరిగా మారిన ఆయన.. తన నెత్తి మీద తాను చేయి పెట్టుకుంటున్నారు.