జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసెంబ్లీ గడప తొక్కమని ప్రగల్భాలు పలికిన వైసీపీ నేతలు, ఇప్పుడు అనర్హత వేటు పడుతుందనే భయంతో కేవలం ఒక్క రోజు సభకు రావాలని నిర్ణయించుకోవడం ఆ పార్టీ నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం 60 పనిదినాలు గైర్హాజరైతే పదవి పోతుందన్న ఏకైక కారణంతోనే ఒక్క రోజు సందర్శన తప్ప, ప్రజా సమస్యలపై చర్చించాలన్న ఉద్దేశ్యం ఇక్కడ ఏమాత్రం కనిపించడం లేదు. కేవలం సంతకం పెట్టి సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి వస్తున్న వీరు, తమను ఎన్నుకున్న ప్రజలను మోసం చేయడం కాదా?
రాజీనామా చేసి ప్రజల మద్దతు కోరాలి !
రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఉంటే జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల మద్దతు ఉందని భావిస్తే, వైసీపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ ప్రజల తీర్పును కోరాలి. మా నేతకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు మేము అసెంబ్లీకి వెళ్లడం లేదు.. మా నిర్ణయం కరెక్ట్ అయితే మమ్మల్ని మళ్లీ గెలిపించండి అని ప్రజల వద్దకు వెళ్లి డిమాండ్ చేసే దమ్ము వైసీపీకి.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉండాలి అలా కాకుండా, అసెంబ్లీకి ఎగ్గొట్టి మళ్లీ అదే అసెంబ్లీ ద్వారా వచ్చే జీతభత్యాలను, ప్రజా సొమ్మును అప్పనంగా తీసుకోవడం ఏ రకమైన రాజకీయమో ఆ పార్టీ నేతలే చెప్పాలి.
ఒక్క రోజు సభకు వచ్చి సంతకం పెట్టడం ప్రజల్ని మోసం చేయడమే !
ప్రజా ప్రతినిధులుగా గెలిచింది అసెంబ్లీలో ప్రజా గళం వినిపించడానికి తప్ప, కేవలం హోదాల కోసం మొండికేసి ఇంట్లో కూర్చోవడానికి కాదు. ప్రతిపక్ష హోదా అనేది రాజ్యాంగబద్ధమైన సంఖ్యాబలంపై ఆధారపడి ఉంటుందని తెలిసి కూడా, దానిని సాకుగా చూపి సభకు రాకపోవడం బాధ్యతారాహిత్యమే అవుతుంది. ఇప్పుడు అనర్హత భయంతో దొడ్డిదారిన వచ్చి ఒక రోజు సంతకం పెట్టి వెళ్లడం అంటే, కేవలం తమ పదవుల మీద ఉన్న వ్యామోహమే తప్ప ప్రజా సంక్షేమం కాదని స్పష్టమవుతోంది. ఇది నిలువునా ఓటర్లను వంచించడమే అని ప్రజలు భావిస్తున్నారు.
సభకు వెళ్లని వారికి పదవులు ఎందుకు?
సభకు వెళ్లని వాళ్లకు ఆ పదవులు ఎందుకు.. ప్రజా ధనాన్ని జీతాల రూపంలో తీసుకుంటూ, సభలో చర్చలకు దూరంగా ఉండటం పౌర సమాజాన్ని అవమానించడమే. వైసీపీ నిజంగా తమ విధానానికి ప్రజల మద్దతు ఉందనుకుంటే, రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలి. అప్పుడు ప్రజలు మళ్లీ వారిని ఎన్నుకుంటే, వారు అసెంబ్లీకి ఎగ్గొట్టడం సరైనదే అని భావించవచ్చు. వైసీపీ తీరు చూస్తుంటే, ప్రజలకు జవాబుదారీగా ఉండటం కంటే తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడమే ముఖ్యమని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. గౌరవప్రదంగా అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనడం లేదా రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలో తేల్చుకోవడం ..ఈ రెండింటిలో వైసీపీ ఏదో ఒకటి చేయాలి.
