వైసీపీ శ్రేణుల్లో ప్రస్తుతం ఒక వింత ధోరణి కనిపిస్తోంది. ప్రభుత్వంపై , ప్రత్యర్థి పార్టీలపై ఎంతటి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తే, ఎన్ని కేసులు పెట్టించుకుంటే పార్టీ హైకమాండ్ దృష్టిలో అంతటి మొనగాడు అనిపించుకోవచ్చనే భావన బలంగా నాటుకుపోయింది. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, అధికారులను బెదిరించడం, భౌతిక దాడులకు దిగడం వంటి చర్యల ద్వారా వార్తల్లో నిలిచి, తద్వారా అధినేత మెప్పు పొందాలని నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో చట్టాన్ని ధిక్కరించడం కూడా ఒక అర్హత గా మారిపోయింది.
హైకమాండ్ ప్రోత్సాహం
ఈ ధోరణికి హైకమాండ్ ఇస్తున్న సంకేతాలే ప్రధాన కారణం. వరైతే దూకుడుగా వ్యవహరించి కేసులు ఎదుర్కొంటారో, వారికే పార్టీలో ప్రాధాన్యత లభిస్తుండటంతో కిందిస్థాయి క్యాడర్ కూడా అదే బాట పడుతోంది. లీడర్ తగ్గ క్యాడర్ అన్నట్లుగా, ఉన్నత స్థాయి నాయకుల భాషా ప్రయోగాలు, ప్రవర్తనను క్షేత్రస్థాయి కార్యకర్తలు అనుకరిస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రాజకీయ పోరాటం అంటే ప్రజల సమస్యలపై ఉండాలి కానీ, వ్యక్తిగత దూషణలు, దాడులపై కాదని సామాన్య జనం అసహ్యించుకుంటున్నారు.
ప్రజాస్వామ్యం ఆలోచనే లేదు !
ప్రజాస్వామ్యంలో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి. కానీ, కేవలం కేసుల కోసమే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల సామాజిక వాతావరణం కలుషితమవుతోంది. కేసులు పెట్టించుకోవడం వల్ల త్యాగధనులుగా ముద్ర వేయించుకోవాలని చూస్తున్న నేతలు, తద్వారా తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. అయితే, ఇలాంటి సంస్కృతి వల్ల పార్టీ పట్ల తటస్థ ఓటర్లలో ప్రతికూలత పెరుగుతుందనే నిజాన్ని వైసీపీ నాయకత్వం విస్మరిస్తోంది. కేవలం సొంత క్యాడర్ను ఉత్సాహపరచడానికి చట్టవ్యతిరేక పనులను ప్రోత్సహించడం దీర్ఘకాలంలో పార్టీకి నష్టదాయకమని గుర్తించలేకపోతున్నారు.
ప్రజల్ని బెదిరిస్తే పనులు కావు!
ప్రజాప్రతినిధులు కావాలనుకునే వారు ప్రజల హృదయాలను గెలవాలి కానీ, పోలీసు రికార్డుల్లో పేర్లు ఎక్కించుకుని పదవులు ఆశించడం హాస్యాస్పదం. వైసీపీ హైకమాండ్ ఈ “కేసుల రేస్”ను కట్టడి చేయకపోతే, అది పార్టీ నైతిక పతనానికి దారి తీయడమే కాకుండా రాష్ట్ర రాజకీయ సంప్రదాయాలను కూడా దెబ్బతీస్తుంది. జనం గమనిస్తున్నారనే స్పృహతో నాయకులు తమ ప్రవర్తనను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
