కల్తీ నెయ్యిపై వైసీపీ నేతలు సంబరాలు చేస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో వైసీపీ హయాంలో యానిమల్ ఫ్యాట్ వాడలేదని సిట్ చెప్పిందని రెచ్చిపోతున్నారు. అంటే సిట్ విచారణ నివేదికను వారు పూర్తిగా అంగీకరించినట్లే. రేపు వారు ఈ విషయంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేరు. పేర్ని నాని అయినా మరొకరు అయినా వైసీపీ పూర్తిగా సిట్ నివేదికను అంగీకరించే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడే అసలు సినిమా ప్రారంభం కానుంది.
ఐదు సంవత్సరాల పాటు నెయ్యి కాని నెయ్యిని వాడారని తేల్చిన సిట్
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై దర్యాప్తు చేపట్టిన సిట్ , నివేదికలో విస్తుపోయే నిజాలను వెల్లడించింది. బయటికి వినిపిస్తున్న పేర్లే కాకుండా, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారుల పాత్రను నివేదికలో స్పష్టంగా పొందుపరిచినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని, కల్తీ నెయ్యి కొనుగోలుకు ఎలా కుట్ర పన్నారో చార్జిషీటులో సాక్ష్యాధారాలతో సహా వివరించారు. ఈ వ్యవహారం మొత్తం అడ్డగోలు అవినీతికి నిదర్శనమని సిట్ తేల్చింది.
యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పలేదని వైసీపీ సంబరాలు
వైసీపీ నేతలు సిట్ నివేదికలో నేరుగా యానిమల్ ఫ్యాట్ అనే పదాన్ని వాడలేదని ప్రచారం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, ఇది కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మాత్రమే. కల్తీ జరిగిందని, నిబంధనలు ఉల్లంఘించారని సిట్ స్పష్టంగా పేర్కొన్నప్పుడు, అందులో ఏ పదార్థాలు కలిశాయనేది న్యాయస్థాన విచారణలో మరింత లోతుగా బయటపడనుంది. నివేదికలోని సాంకేతిక అంశాలను సాకుగా చూపి తప్పించుకోవాలని చూడటం వారి అజ్ఞానమే అవుతుంది
సిట్ నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం చర్యలు
అసలు సినిమా కోర్టులో విచారణ ప్రారంభమయ్యాక మొదలవుతుంది. సిట్ సమర్పించిన తుది నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందిన తర్వాత, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎంతటి వారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని అంటున్నారు. ఈ కల్తీ నెయ్యి కేసు చివరకు వైసీపీకి రాజకీయంగా తీరని నష్టాన్ని మిగల్చడమే కాకుండా, ఆ పార్టీని దహించి వేయడం ఖాయంగా కనిపిస్తోంది. భక్తుల సెంటిమెంట్‌తో ఆడుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూటమి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో సిట్ బయటపెట్టే మరిన్ని నిజాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించనున్నాయి. సిట్ నివేదిక నిజమేనని వారు అంగీకరిస్తున్నందున చర్యలు తీసుకున్నా వారు ఖండించలేరు. ఇలా ఇరుక్కుపోయామని వారికి తెలుస్తుందో లేదో ?
