ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం ఏమిటో మరోసారి ప్రజల కళ్ల ముందు కనిపిస్తోంది. దాదాపుగా లక్షా పాతిక వేల కోట్ల రూపాయల పెట్టుబడితో గూగుల్ ఏఐ హబ్‌ను విశాఖలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చి ఒప్పందం చేసుకుంటే.. వైసీపీ నేతలంతా గుక్క పెట్టి ఏడుస్తున్నారు. ఉద్యోగాలు ఎక్కువ రావు.. కరెంట్ తెగ వాడేస్తారు.. నీళ్లు వాడేస్తారు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కొంత మంది ఇలా ఏడవలేక ధ్యాంక్యూ జగన్ అని పోస్టులు పెట్టుకుంటున్నారు. వీరి వ్యవహారం చూసి రాజకీయం ఎలా చేయాలో కూడా తెలియని రాజకీయ పార్టీ అని జనం అసహ్యించుకుంటున్నారు.
ఏఐ హబ్ రాకతో రాష్ట్రానికి లక్షల కోట్ల లాభం
ఏఐ హబ్ వస్తే ఉద్యోగాలు రావని ఎవరో పనికి మాలిన మేధావితో మాట్లాడిస్తారు. ఆయనేదో తీర్పులిచ్చే వ్యక్తి అని ఆ మాటల్ని వైరల్ చేసుకుంటారు. అసలు ఏ పరిశ్రమ పెట్టినా నేరుగా పని చేసేవాళ్లు లేకుండా ఎలా నడుస్తుందన్న కనీస జ్ఞానం కూడా ఉండక్కరలేదా ?. విశాఖలో లక్షన్నర కోట్లు ఖర్చు పెడుతున్నారంటే.. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది?. ఆ సంస్థ నిర్మాణం దగ్గర నుంచి ప్రత్యక్షంగా .. పరోక్షంగా ఎంత మందికి ఉపాధి లభిస్తుంది. ఆ ఏఐ హబ్ అక్కడ ఏర్పాటు కావడం వల్ల అనుబంధం ఎన్ని సంస్థలు వస్తాయి?. సంపద ఎంత పెరుగుతుంది?. ఇవన్నీ లెక్కలేసుకుని దేశం మొత్తం ఏపీని అభినందిస్తోంది. దీర్ఘకాలంలో .. ఏఐ హబ్ వల్ల రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం రాబోతోందనేది అందరికీ తెలిసిన విషయం.
జగన్ తెచ్చినట్లుగా ప్రకటించుకున్న డేటా సెంటర్లు గొప్పవా?
అదానీ సంస్థ 2019 ఎన్నికలకు ముందు విశాఖలో డేటా సెంటర్ నిర్మాణానికి ఒప్పందం చేసుకుంది. శంకుస్థాపన కూడా చేశారు. జగన్ వచ్చాక దాన్ని క్యాన్సిల్ చేశారు. తర్వాత ఆయనే మరో ఖరీదైన కొండను రాసిచ్చారు. అందులో 130 ఎకరాలను.. అప్పనంగా రాసిచ్చారు. సాధారణంగా లీజులకు ఇస్తారు..కానీ అదానీకి గ్రూప్ తాకట్టు పెట్టుకునేలా సేల్ డీడ్ రాసిచ్చారు. కానీ ఒక్కటంటే ఒక్క డేటా సెంటర్ నిర్మాణం కాలేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ దాన్ని గొప్పగా చెబుతున్నారు మాజీ పరిశ్రమల మంత్రి అమర్నాథ్. తాము డేటా సెంటర్ కు వందల ఎకరాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. మరి డేటా సెంటర్ ఏది అంటే చెప్పడం లేదు. అంటే జగన్ రెడ్డి డేటా సెంటర్ తెచ్చినట్లు షో చేస్తే మాత్రం అవి గొప్పవి. లేకపోతే చెడ్డవి.
డెలవప్మెంట్ సెంటర్లకు భూమి ఇచ్చినా ఏడుపులేగా?
గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ ను తీసుకు రావాలని గుడివాడ అమర్నాథ్ సవాల్ చేశారు. టీసీఎస్ డెలవప్మెంట్ సెంటర్ కు భూములు ఇస్తే గుక్కపెట్టి ఏడ్చి కోర్టులకు వెళ్లింది కూడా ఈ బ్యాచే. అలాగే కాగ్నిజెంట్,యాక్సెంచర్ డెవలప్మెంట్ సెంటర్లపైనా ఏడుస్తున్నారు. అంటే వీళ్ల బాధ.. కంపెనీలు వస్తున్నందుకు.. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నందుకే. రాష్ట్రం బాగుపడితే చూసి ఓర్చుకోలేని ఘోరమైన వికృత మనస్థత్వం ఉన్న వీరు.. తమ పద్దతి మార్చుకోవడం లేదు. పరిపాలన చేసినప్పుడు పెట్టుబడుల్ని తరిమేసి.. వాటాల కోసం వేధించేవారు. ఇప్పుడు వస్తూంటే.. విమర్శలు, కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు.
వైసీపీ చేసే కుట్రల్ని కంట కనిపెడుతూ ఉండాలి !
ఇలా విమర్శలు చేసి ఊరుకునే రకం కాదు వైసీపీ. లిక్కర్ స్కామ్‌లో తమ దందా బయటపడిందని.. ప్రస్తుత ప్రభుత్వంపైనా నకిలీ లిక్కర్ మరక వేయాలని ఎంత పెద్ద కుట్ర చేశారో కళ్ల ముందే ఉంది. అమరావతిపై ఎన్నెన్ని కుట్రలు చేశారో కళ్ల ముందే ఉంది. ఇంకా అవి కొనసాగుతున్నాయి. పెట్టుబడులపైనా ఆ కుట్రలు జరుగుతాయి. గూగుల్ కు ఇవ్వాల్సిన భూములపైనా ఇప్పటికే కోర్టుకెళ్లారు. ఇలాంటి వారిని కఠిన చర్యలతోనే నియంత్రించటమే రాష్ట్రాభివృద్ధికి ముఖ్యం.