మళ్లీ పనిలోకి చంద్రబాబు..! సమీక్షలొద్దని ఈసీకి వైసీపీ ఫిర్యాదులు..!

ysrcp
ysrcp

ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి.. మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానన్న నమ్మకాన్ని చంద్రబాబు చేతల్లోనే చూపిస్తున్నారు. పోలింగ్ ముగిసే వరకూ క్యా లైన్లలో ఉన్న మహిళలు, వృద్ధులను చూసి.. టీడీపీ వర్గాలు..గుండెలపై చేయి వేసుకున్నాయి. కానీ తర్వాతి రోజు నుంచి చంద్రబాబు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తూండటంతో… పరిస్థితి మారిపోయింది. గెలుపుపై వైసీపీలో విశ్వాసం పెరిగిపోయింది. టీడీపీలో అనుమానాలు మొదలయ్యాయి. ఈ సమయంలో చంద్రబాబు ఏ మాత్రం తొణకకుండా.. మిగిలిన పనులు పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు గెలుపు తమదంటే.. తమదని చెప్పుకోవడం తప్ప..రాజకీయ పార్టీలు చేయగలిగిందేమీ లేదు. కౌంటింగ్‌కు ఇంకా నలభై రోజులు ఉంది. ఈ లోపే ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు నెలలుగా ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర ప్రభుత్వ వ్యవహారాలపై… దృష్టి పెట్టారు. దాదాపుగా నలభై ఐదు రోజుల తర్వాత తొలిసారి ఆయన సచివాలయానికి వచ్చారు. అమరావతి నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షకు.. మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులు హాజరయ్యారు. నిన్న కూడా.. చంద్రబాబు పోలవరం, మంచినీటి సమస్యపై సమీక్షించారు. అయితే.. ఆ సమీక్షను ప్రజావేదికలోనే నిర్వహించారు. ఈ రోజు మాత్రం సచివాలయానికి హాజరయ్యారు. పోలింగ్ ముగిసినప్పటికీ… కౌంటింగ్ జరిగే వరకూ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అందుకే సీఎస్ , డీజీపీలు ముఖ్యమంత్రి జరిపే సమీక్షలకు హాజరు కావడం లేదు. జాతీయ రాజకీయాల్లో.. బీజేపీయేతర పార్టీలకు ప్రచారం చేయాడానికి చంద్రబాబు రెడీ అయ్యారు. కర్ణాటక, తమిళనాడుల్లో ఇప్పటికే అక్కడి పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేశారు. రేపు రాహుల్ గాంధీ, కుమారస్వామితో పాటు.. రాయచూర్‌లో… బహిరంగసభలో ప్రసంగించబోతున్నారు. ఆ తర్వాత కూడా.. పలు రాష్ట్రాలకు ప్రచారానికి వెళ్లనున్నారు. ఏపీలో… వేసవి సందర్భంగా ఏర్పడే.. సమస్యల పరిష్కారానికి ఓ వైపు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూనే.. మరో వైపు.. రాజకీయ కార్యకలాపాల్లోనూ బిజీగా ఉంటున్నారు.

అయితే ఈ సమీక్షలపై.. వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ద్వివేదీకి లేఖ అందించారు. కోడ్‌ అమలులో ఉన్నప్పుడు సీఎం ఎలాంటి సమీక్షలు నిర్వహించొద్దని ఆదేశించాలని వారు కోరారు. అధికారిక భవనాల్లో మీటింగ్‌లు పెట్టొద్దు, విధాన నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ… అధికారులను చంద్రబాబు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజావేదికలో పార్టీ సమీక్షలు నిర్వహించడం కోడ్‌ ఉల్లంఘనేనని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com