తిరుమలలో మద్యం సీసాలు అంటూ హడావుడి.. సింహాచలంలో ప్రసాదంలో నత్త అనే వీడియోలు.. ఇలా వరుసగా ఆలయాలపై కుట్రలు జరుగుతున్నాయి. అన్నీ కావాలని చేస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది. ఈ కుట్రలన్నీ ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసి మీడియాలో హడావుడి చేయడానికి కూడా పక్కా ఏర్పాట్లు చేసుకుని రంగంలోకి దిగుతున్నారు. తిరుమల మద్యం సీసాల కేసులో సాక్షి రిపోర్టర్లే దొరికిపోయారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన మద్యం సీసా కుట్ర ఉదంతం పెను సంచలనంగా మారింది. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్ర క్షేత్రాలను కూడా వాడుకోవాలనే వైసీపీ ఆలోచనా విధానం, ఆ కుట్రల్లో భాగమవుతున్న సాక్షి మీడియా తీరుపై భక్తుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఘటన వెనుక ఒక వ్యవస్థీకృత కుట్ర ఉందనే ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఆలయాలపై కుట్రల కేంద్రంగా సాక్షి మీడియా?
తిరుమలలో భద్రతా వైఫల్యం ఉందని నిరూపించే ప్రయత్నంలో, సాక్షి మీడియాకు చెందిన ఒక ప్రతినిధి మద్యం సీసాతో కొండపైకి వెళ్లడం, దాన్ని ఫోటోలు తీసి తప్పుడు ప్రచారం చేయడం అడ్డంగా దొరికిపోయింది. పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. ఇందులో సాక్షి ప్రతినిధులున్నారు. ఒక మీడియా సంస్థగా ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సింది పోయి, ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా కుట్రలు చేయడమే అర్హతగా మారింది. జగన్ రెడ్డి రాజకీయ అవసరాల కోసం తమ సిబ్బందిని ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయమని ప్రోత్సహించడం, వారిని నేరాల్లో భాగస్వాములను చేయడం దారుణమన్న విమర్శలు వస్తున్నాయి.
నేరాలకు అలవాటు పడుతున్న క్యాడర్
జగన్ రెడ్డిని నమ్ముకున్న నేతలు, కార్యకర్తలు చివరకు జైలు పాలు కావడం ఇప్పుడు కామన్‌గా మారిపోయింది. రాజకీయాల్లో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ప్రజా సమస్యలను ఎంచుకోకుండా, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం వైసీపీ మార్క్ రాజకీయంగా కనిపిస్తోంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి దొరికిపోయిన చరిత్ర ఉన్నా, జగన్ తన వారిని మార్చుకోకపోగా.. ఇలాంటి పనులకే వారిని పురమాయిస్తున్నారని జరుగుతున్న పరిణామాలతో అర్థం చేసుకోవచ్చు.
ఆలయాల పవిత్రతపై రాజకీయ దాడి
ఒక్క తిరుమల విషయంలోనే కాదు చాలా ఆలయాలపై ఇదే తరహా దాడి చేస్తున్నారు. ఇటీవల ప్రసాదంలో నత్త అంటూ సింహాచలం ఆలయంపైనే కుట్ర చేశారు. ఇలాంటి వారిని ఎప్పటికప్పుడు కట్టడి చేయకపోతే.. హిందూత్వంపై వారు చేసే దాడి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. హిందూ సమాజం అత్యంత పవిత్రంగా భావించే తిరుమలను రాజకీయ రొంపిలోకి లాగడం ద్వారా వైసీపీ స్వయంకృతాపరాధం చేసుకుంటోంది. అధికారం పోయిన తర్వాత అసహనంతో ఆలయాలపై కుట్రలు చేయడం వల్ల ప్రజల్లో పార్టీపై ఉన్న గౌరవం పూర్తిగా పోతుంది. చిల్లర నేరాలకు అలవాటు పడి, పవిత్ర క్షేత్రాల వద్ద ఇలాంటి పనులకు పాల్పడటం వల్ల రాజకీయంగా కూడా వైసీపీ భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది.
