తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ సాగుతున్న రాజకీయ రచ్చ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన , కీలకమైన అంశంగా మారింది. ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తిరుమల పవిత్రతకు సంబంధించి జరిగిన పరిణామాలు, బయటపడిన కల్తీ నెయ్యి వ్యవహారం మధ్య పోలికలు ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయాయి. వాటి నుంచి బయటపడేందుకు వైసీపీ నేతలు చేయని కుట్రలు లేవు. తిరుమలలో బీడీల దగ్గర నుంచి టీటీడీ చైర్మన్ పై ఫేక్ వీడియోల వరకూ చాలా చేస్తున్నారు.
జగన్ బ్యాచ్ హిందువులని ప్రజలు నమ్ముతున్నారా?
వైసీపీ హయాంలో టీటీడీ బోర్డు ఛైర్మన్లుగా పనిచేసిన వై.వి. సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలపై అప్పట్లోనే అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వై.వి. సుబ్బారెడ్డి అన్యమత ప్రచారంపై ఉన్న ఆరోపణలు, భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికత్వం శ్రీవారి భక్తులలో ఒక రకమైన అభద్రతా భావాన్ని కలిగించాయి. దీనికి తోడు జగన్ మోహన్ రెడ్డి అన్యమతస్థుడు అనే ముద్ర ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బలపడింది. తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వకపోవడం వంటి అంశాలను హిందూ సంఘాలు నేరుగానే ప్రజల్లోకి తీసుకెళ్లాయి. తాను క్రైస్తవుడ్ని కాదని జగన్ చెప్పడం లేదు. హిందువునని కూడా చెప్పుకోవడం లేదు.
కల్తీ నెయ్యి కేసు దృష్టి మళ్లించడానికి తిరుమలపై అనేక కుట్రలు
కల్తీ నెయ్యికేసు చేసిన డ్యామేజీ నుంచి బయటపడేందుకు వైసీపీ చేయని కుట్రల్లేవు. బాత్రూముల్లో బీడీ ముక్క దొరికింది , మద్యం బాటిల్ దొరికింది అంటూ వైరల్ అయిన వీడియోలు కుట్రపూరితంగా చేసినవని తేలింది. ఇప్పుడు కూడా ఏఐ సాంకేతికతతో టీటీడీ ఛైర్మన్‌ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా హిందూ ఓటర్లలో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవచ్చని ఆ పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ, ఇటువంటి చిల్లర ప్రచారాల వల్ల వైసీపీపై ప్రజల్లో మరింత అసహ్యం పెరుగుతుందే తప్ప, కల్తీ నెయ్యి మరక చెరిగిపోదని వైసీపీ గుర్తించడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన శ్రీవారి ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారం వైసీపీకి ఒక చెరగని మచ్చగా మిగిలిపోయింది. ఈ భారీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, క్షేత్రస్థాయిలో భక్తులు ఆ పార్టీని శంకిస్తూనే ఉంటారు. దేవుడి విషయంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంది.
తిరుమల విషయంలో ఏం జరిగినా వైసీపీ కుట్రే ?
తిరుమల విషయంలో ఎంత రచ్చ చేస్తే, పాత విషయాలు అంతగా చర్చకు వస్తాయి అనేది జగన్ రెడ్డి అండ్ కో గుర్తుంచుకోవాల్సిన విషయం. వైసీపీ నాయకత్వం ఇప్పటికైనా ఆధ్యాత్మిక అంశాలను రాజకీయం చేయడం ఆపాల్సి ఉంది. లేనిపక్షంలో హిందూ ఓటర్ల నుంచి ఆ పార్టీ పూర్తిగా దూరం కావడం ఖాయమని అంచనాలు చెబుతున్నాయి. ఇప్పటికే భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటి నేతలపై ప్రజల్లో స్పష్టత వచ్చేసింది. కాబట్టి, పదే పదే టీటీడీ పైన, హిందూ సంస్థల పైన విమర్శలు చేయడం వల్ల వైసీపీకే రాజకీయంగా నష్టం వాటిల్లుతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏముంటుంది?


