ఏ పని చేస్తున్నా… అడ్డం పడేందుకు వైసీపీ కుట్ర చేసిందని గగ్గోలు పెట్టడం అంటే.. చేతకానితనమే అవుతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నారు. వైసీపీ ఎలాంటి కుట్రలకు పాల్పడుతుందో సమాచారం వస్తుంది. మరి అలాంటప్పుడు ఆ కుట్రల్ని నిర్వర్యం చేసి.. అలాంటి వాటికి పాల్పడేవారికి గట్టిగా బుద్ది చెప్పాలి. ఆ తర్వాతే వారేం చేశారో బయటపడేలా చేయాలి. అంతే కానీ.. తమకు కష్టం వచ్చినప్పుడు.. వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించడం చేతకాని తనం అవుతుంది. గూగుల్ డేటా సెంటర్ భూముల విషయంలో అదే జరుగుతోంది. కుట్రలకు పాల్పడేవారిని కఠిన చర్యలతో అణిచివేయకుండా.. కుట్రలని గగ్గోలు పెడితే ఎలా?
గూగుల్ భూములపై కుట్రలని ఇప్పుడు గగ్గోలు
తర్లువాడలో గూగుల్ ఏఐ హబ్ వస్తుంది. అక్కడ భూసేకకరణ, సమీకరణ కలిపేసిన మంచి ప్యాకేజీని అమల్లోకి తెచ్చారు. భూములు ఇచ్చిన వారికి ఎకరానికి రూ. ఇరవై లక్షలతో పాటు అదనంగా వేరే ప్రాంతంలో.. ఆ ప్రాంతం అభివృద్ధి చెందితే అందులో భాగమయ్యేలా భూమి కూడా కేటాయిస్తున్నారు. దీని వల్ల రైతులకు రెండు విధాలుగా ప్రయోజనం ఉంటుంది. కానీ ఆ భూములపై గతంలోనే వైసీపీ హయాలో పని చేసిన ఓ సీనియర్ ఐఏఎస్ కన్నేశారు. రిటైరవ్వక ముందే..అసైన్డ్ భూములు కొన్నారు. ఫ్రీహోల్ పేరుతో మార్పు చేసుకోవాలనుకున్నారు. కుదరలేదు. ఇప్పుడు ఆ రైతుల పేరుతో కుట్రలు చేస్తున్నారు. పరిహారం ఎక్కువ ఇప్పిస్తామని.. మరొకటని చెప్పి .. అడ్డం పడుతున్నారు.
ఆ రిటైర్డ్ ఐఏఎస్ జాతకం ప్రభుత్వం వద్ద లేదా ?
కోర్టులోనూ ఓ పిటిషన్ వేయించారు. అందులోఓ మృతుడి పేరు ఉండటంతో అసలు కుట్రలు వెలుగులోకి వచ్చాయి. మరి అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి.. ఇలాంటి కుట్రలకు పాల్పడేవారిని అణిచి వేయాలి. కానీ రైతులకు పరిహారం పంపిణీ ప్రారంభించిన తర్వాత కూడా ఇలా కుట్రలని గగ్గోలు పెట్టడం ఏమిటి?. గట్టిగా చర్యలు తీసుకోవాల్సింది ఎవరిపైనో కానీ.. సీఎస్‌గా కూడా పని చేసి రిటైరైన ఆ పెద్ద మనిషిపై దృష్టి పెడితే సరిపోతుంది. అక్రమంగా వందల కోట్లు సంపాదించి.. అడ్డగోలుగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన ఆ రిటైర్డ్ జగన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అక్రమాల జాబితా అంతా ప్రభుత్వం వద్ద ఉంటుంది. ఎందుకు ఉపేక్షిస్తున్నారు ?
కుట్రలు ఫలించకముందే అణిచివేయాలి !
ఎదుటివాటి చేతిలో రాయి ఉందని తెలుసు. వాడు పిచ్చోడని తెలుసు. అలాంటప్పుడు వాడు రాయితో కొట్టే వరకూ చూస్తారా.. లేక ముందే మేలుకుని కొట్టక ముందే వాడి చేతిలో రాయి లాగేసుకుని కూర్చోబెడతారా అన్నదే కీలకం. చేయాల్సింది పూర్తి చేసేసిన తర్వాతనే వారు చేసిన కుట్రలను బయటపెట్టాలి. ప్రజల ముందు పెట్టాలి. వారి సైకోతనాన్ని వివరించాలి. అలా కాకుండా.. తమ కాళ్లకు అడ్డం పడినప్పుడే కుట్రలని గగ్గోలు పెడితే ఎప్పటికీ అడ్డం పడుతూనే ఉంటారు.