ప్రజల్ని ఎంత టార్చర్ పెడితే అంతగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని వైసీపీ నేతలు భావిస్తూ ఉంటారు. అలా ప్రజలు ఇబ్బందిపడే పనులన్నింటినీ లక్ష్యంగా చేసుకుని కోర్టుల్లో కేసులు వేసి పనులు ఆగిపోయేలా చేస్తున్నారు. వీరి దృష్టి ఇప్పుడు గుంటూరు శంకర్ విలాస్ వంతెనపై పడింది. దశాబ్దాలుగా బ్రిడ్జిని ప్రతిపాదనల్లోనే ఉంచిన వాళ్లు .. ఇప్పుడు సాకారం అవుతూంటే.. లేనిపోని వంకలు పెట్టి కోర్టుల్లో కేసులు వేస్తున్నారు.
పనులు వేగంగా సాగుతున్నాయి. పాత వంతెన కూల్చివేసి కొత్త వంతెన కోసం పిల్లర్లు వేశారు. అయితే ఇప్పుడు డిజైన్ అలా లేదు ఇలా లేదు అంటూ వైసీపీ స్పాన్సర్డ్ సంఘాలు కొన్ని కోర్టును ఆశ్రయించాయి. కొన్ని దుకాణాల యజమానుల్ని రెచ్చగొట్టి అదే పని చేయించారు. అలా చేయడమే కాకుండా అంబటి రాంబాబు వారానికోసారి వెళ్లి పనులు ఎప్పుడు అవుతాయంటూ సొంత మీడియా ముందు డ్రామాలేస్తున్నారు.
శంకర్ విలాస్ వంతెన గుంటూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఉంటుంది. అటు వైపు, ఇటు వైపు పూర్తి చేసినా.. ట్రాక్ మీదుగా ఉన్న వంతెనను పూర్తి చేయాలంటే చాలా పెద్ద కసరత్తు అవసరం. దాని కోసం రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అసలు పనులు ప్రారంభించిన తర్వాత ఈ పని చేయాలి. కానీ ముందుగా ఆ పని చేయలేదు ఎందుకని కొంత మంది రెచ్చిపోతున్నారు. వీరి తీరు ఎలా ఉందంటే.. ఇప్పటికిప్పుడు పనులు ఆగిపోతే చాలు తాము రాజకీయం చేసుకుంటామని అనుకుంటున్నారు.
కేంద్ర మంత్రి పెమ్మసాని ప్రతి వారం వంతెన నిర్మాణాన్ని సమీక్షిస్తున్నారు. వైసీపీ రెచ్చగొడుతున్న వారితో కూడా చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ను జూలై, 2027 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి ప్రారంభించాలని పట్టుదలగా ఉన్నారు. అయితే అడ్డం పడితే చాలని వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది.
