రాజకీయాల్లో వ్యూహం ఉండాలి కానీ, ఎదుటివారు చేసే మంచిని కూడా అడ్డుకోవాలనే నైజం ఉండకూడదు. కానీ వైసీపీకి ఉంది అదే. జగన్ నైజమే ఆ పార్టీ ఇజం. వైసీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీకి ఏ అంశంపైనా ఒక స్పష్టమైన విధానం అంటూ పెట్టుకోవడం లేదు. రాజధాని అమరావతి విషయంలో ప్రజలను అయోమయానికి గురిచేయడం మొదలుకొని, పారిశ్రామిక విధానం వరకు వైసీపీ అడుగులు ఎప్పుడూ అస్థిరంగానే ఉన్నాయి. గూగుల్ ఏఐ హబ్ వంటి అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టుల విషయంలో కూడా ఆ పార్టీ ప్రదర్శిస్తున్న తీరు వారి రాజకీయ అపరిపక్వతను బయటపెడుతోంది. ఒకవైపు ఆ ప్రాజెక్టు మేమే తెచ్చాం అని క్రెడిట్ కోసం పాకులాడుతూనే, మరోవైపు అదే ప్రాజెక్టుకు భూములు ఇవ్వకుండా కోర్టుల్లో లిటిగేషన్లు పెట్టడం చూస్తుంటే, ఆ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ స్వలాభమే ముఖ్యమని స్పష్టమవుతోంది.
అక్షింతలు వేసినా మారని బుద్ది
అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీకి న్యాయస్థానంలో గట్టి షాక్ తగిలింది. ఏఐ హబ్ భూములపై వేసిన పిటిషన్ విషయంలో కోర్టు మందలించినా ఆ పార్టీ నేతల్లో మార్పు రాకపోవడం విచారకరం. రాజకీయం అంటే కేవలం అధికార పక్షాన్ని విమర్శించడమే కాదు, ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ వైసీపీ తీరు మాత్రం అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు లాగడం అన్నట్లుగా ఉంది. ఇలాంటి ప్రతికూల ధోరణి వల్ల కేవలం పార్టీకే కాదు, రాష్ట్ర ప్రతిష్టకు కూడా భంగం కలుగుతోంది.
స్పష్టత లేని నాయకత్వంతో గందరగోళంలో కేడర్!
పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ , మౌలిక సదుపాయాల కల్పన.. ఇలా ఏ అంశం తీసుకున్నా వైసీపీ దగ్గర ఒక స్థిరమైన ప్రణాళిక లేదు. ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డి ఆలోచనలు ఎలా ఉంటాయో, పార్టీ నిర్ణయాలు కూడా అలాగే మారుతూ ఉంటాయి. ఇవాళ ఉన్న విధానం రేపు ఉండదు, రేపు చెప్పే మాటకు ఎల్లుండి విలువ ఉండదు. ఈ అనిశ్చితి వల్ల అటు పెట్టుబడిదారులు, ఇటు ప్రజలు ఆ పార్టీని నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. అసలు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైసీపీకి ఉన్న స్పష్టత ఏంటో కనీసం వారి కార్యకర్తలకైనా తెలుసా అంటే.. దిక్కులు చూడాల్సిందే.
రాజకీయ అర్హతపైనే ప్రశ్నలు
నిర్మాణాత్మక విపక్షంగా వ్యవహరించాల్సింది పోయి, ప్రతి చిన్న విషయాన్ని వివాదాస్పదం చేస్తూ కోర్టుల చుట్టూ తిరగడం వైసీపీ మార్క్ రాజకీయంలా మారిపోయింది. ప్రజాస్వామ్యంలో పోరాటాలు సహజం, కానీ అవి అభివృద్ధిని అడ్డుకునేలా ఉండకూడదు. గూగుల్ ఏఐ హబ్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర యువతకు ఉపాధినిచ్చే వనరులు. వాటిని కూడా రాజకీయాల్లోకి లాగడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. నిజానికి గూగుల్ హబ్ ను వ్యతిరేకించాలనుకుంటే.. దైర్యంగా ఒకే మాట మీద వ్యతిరేకించవచ్చు.కానీ క్రెడిట్ మాదేనని చెప్పుకుని కోర్టుల్లో పిటిషన్లు వేయడం ఏ మాత్రం రాజకీయం? బుర్ర ఉన్న వాళ్లు ఎవరైనా చేస్తారా?
