రాజకీయాల్లో ఏదైనా అంశంపై విమర్శించడానికి సరుకు లేకపోతే సైలెంటుగా ఉండిపోవాలి. అప్పుడు ఆ అంశానికి పెద్దగా ప్రచారం రాదు. కానీ వైసీపీ నేతలు అలా అనుకునే టైప్ కాదు. విమర్శించడానికి తమ స్థాయిలో కారణాలు ఉంటాయని వారు గట్టిగా అనుకుంటారు. అందుకే ముందుకు వచ్చేస్తారు. బిల్ గేట్స్ విషయంలో అదే చేస్తున్నారు. బిల్ గేట్స్ ఏపీకి వచ్చారు. ఓ పూట పర్యటించారు. పలు కార్యక్రమాలను పరిశీలించారు. తన ఫౌండేషన్ తరపున చేపడుతున్న పనుల గురించి మాట్లాడారు. చంద్రబాబును ప్రశంసించి వెళ్లారు.
మిగతా అంతా ఏమో కానీ.. చంద్రబాబును ప్రశంసించిన మాటలు వింటే వైసీపీ నేతలకు బీపీ వచ్చేస్తుంది. ఎవరికి బీపీ వస్తుందో చెప్పాల్సిన పని లేదు. వాళ్లకు బీపీ వస్తే అందరూ అదే తెచ్చుకుని మీడియా గొట్టాల ముందుకు వచ్చి బిల్ గేట్స్ ను చెడామడా తిట్టేయాలి. ఇప్పుడు వైసీపీ నేతలు అదే చేస్తున్నారు. అలా తిట్టడానికి కారణాలేమున్నాయి.. ఆయనేమైనా వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి వచ్చాడా.. పెట్టుబడులు పెట్టడానికి వచ్చాడా.. లేకపోతే ఏదైనా ప్రయోజనం ఆశించి వచ్చాడా.. ఏదో ఒక నింద వేయడానికి. ఏమీ రాలేదు. కేవలం ఏపీకి సాయం చేద్దామనే వచ్చారు.
అయినా సరే తిట్టాల్సిందే కాబట్టి ముందుకు వచ్చేశారు. టీజేఆర్ సుధాకర్ బాబు అనే పెద్ద మనిషి ప్రెస్ మీట్ పెట్టి.. బిల్ గేట్స్ కు పెట్టిన టీ, కాఫీ, టిఫిన్ల ఖర్చు గురించి కూడా కడిగేశారు. ఆయనేం మాట్లాడుతున్నారో ఆయన ఎదురుగా కూర్చున్న జర్నలిస్టులకు అయినా అర్థం అయిందో లేదో. ప్రపంచ కుబేరుడు అయినా బిల్ గేట్స్ కి పెట్టిన టీ, కాఫీల ఖర్చు గురించి మాట్లాడాలనే ఆలోచన సుధాకర్ బాబుకు ఎలా వచ్చిందో కానీ ఆయన.. మాట్లాడిన విధానం.. హై పిచ్ లో ప్రశ్నించిన విధానం కూడా హైలెట్ గా ఉంది.
గతంలో చంద్రబాబును ప్రశంసించారని రజనీకాంత్ పై దండయాత్ర చేశారు. తిట్లందుకున్నారు. ఇప్పుడు బిల్ గేట్స్ ను వదిలి పెడతారని లేదు. కానీ ఎలా విమర్శించాలో తెలియనప్పుడు సైలెంటుగా ఉండటమే బెటర్. ఏమీ లేనట్లు టీ, కాఫీల ఖర్చు గురించి మాట్లాడితేనే ఎబ్బెట్టుగా ఉంటుంది.
