వైసీపీ రాజకీయ పార్టీనే. కానీ రాజకీయం అంటే ఏమిటో కనీస అవగాహన లేకపోవడమే సమస్య. ప్రజల్ని ప్రత్యర్థులు అనుకుని.. రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువులుగా ప్రకటించుకోవడం రాజకీయం కాదు. ప్రజాకోణంలోనే రాజకీయాలు చేయాలి. ప్రజలు ఎంత నష్టపోతే..ఎన్ని ప్రాణాలు పోతే మాకు అంత ఆనందం అనుకుంటే .. అది రాజకీయం కాదు. శాడిజం అవుతుంది. ఇప్పుడు వైసీపీ నిలువెల్లా అదే చూపిస్తోంది. ఓ వైపు తుపాన్ వచ్చి ప్రజలంతా అల్లాడిపోతూంటే.. మరో వైపు వైసీపీ చేసే నీచ రాజకీయాలు అసహ్యించుకునేలా చేస్తున్నాయి.
ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తూంటే ప్రచారమని గగ్గోలు
ప్రభుత్వ యంత్రాంగం అంతా తుఫాన్ ను ఎలా ఎదుర్కోవాలి.. ప్రాణ నష్టం జరగకుండా ఏం చేయాలి.. తీరం దాటిన తర్వాత ప్రజలకు ఆకలిదప్పులు లేకుండా ఏం చేయాలన్నదానిపై అదే పనిటెన్షన్ పడుతూ.. ఏర్పాట్లు చేసుకుంటూంటే.. ప్రచారం కోసమే అంతా చేస్తున్నారని అంటున్నారు. నిజానికి ఇలాంటి విపత్తుల సమయంలో ప్రచారమే చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికీ ప్రకృతి విపత్తుపై అవగాహన పెరగాలి. అప్పుడే తమను తాము జాగ్రత్త చేసుకుంటారు. కానీ ఇదంతా తప్పన్నట్లుగా రెచ్చిపోయారు. తప్పుడు ప్రచారంతో విషం కక్కే ప్రయత్నం చేశారు.
ప్రజలకు సాయం చేయడంపైనా నిందలేనా ?
ప్రజల్ని కాపాడుకోవడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. నిద్రాహారాలు మాని ప్రభుత్వ పెద్దలు అదే చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ఆర్టీజీఎస్లోనే ఉండి రియల్ టైమ్ పర్యవేక్షిస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ పిఠాపురం వెళ్లడం లేదు.. చంద్రబాబు కుప్పం వెళ్లడం లేదని ఏడ్చేస్తున్నారు. ప్రజలకు సాయం చేస్తూంటే.. అలా ఎందుకు.. ఇలా ఎందుకు అని అడ్డం పడే ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి అసలు తుపాన్ తీరం దాటక ముందే.. ప్రభుత్వం ఏమీ చేయడం లేదు.. వైసీపీ నేతలే ప్రజలకు సాయం చేస్తున్నారని ఫేక్ ఫోటోలతో ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి రాజకీయం చేయాలని ఎలా అనిపిస్తుంది ?.
ముందు ప్రజల్ని ఆదుకోండి..తర్వాత రాజకీయాలు !
జగన్ రెడ్డి తుపాన్ వస్తుందని తెలిసి కూడా బెంగళూరు వెళ్లిపోయారు. ప్లైట్లు క్యాన్సిల్ అయ్యాయని తాడేపల్లికి కూడా రాలేదు. రావాలనుకుంటే రావడం ఆయనకు పెద్ద విషయం కాదు.కానీ కోట్లు పెట్టి నడిపే సోషల్ మీడియా ఉంది.. నాలుగు ఫేక్ పోస్టులు.. ఎలివేషన్ పోస్టులు పెట్టుకుంటే..చాలు ప్రజలు నమ్మేస్తారు. మనమేం చేయకపోయినా పర్వాలేదు అనుకునే మనస్థత్వతోనే రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు కనీసం సైలెంట్ గా ఉండాలి. ప్రభుత్వం చేయగలిగినంత చేయనివ్వాలి.అందులో లోపాలుంటే ప్రశ్నించాలి కానీ.. అసలు ఇంకా తుపాన్ రాష్ట్రం దాటి పోక ముందే.. తప్పుడు ప్రచారాలతో విరుచుకుపడటం ఏమిటి?. పిల్లికి బిచ్చం వేయని నేతలు.. ఓ రెండు కేజీల బియ్యం తీసుకెళ్లి ఎవరికో ఇచ్చి ఫోటోలు దిగి ప్రచారం చేసుకోవడం ఏమిటి?. ప్రజలపై కాస్త అయినా కనికరం చూపించరా ?
