అటు పాలనలో ఇటు రాజకీయంగా లోకేష్ అంతకంతకూ ఎదిగిపోతూండటం వైసీపీ నేతలకు నచ్చడం లేదు. నారా లోకేష్ ఎదుగుదల, దానికి కౌంటర్ అంటూ వైసీపీ అనుసరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కార్డు ఇప్పుడు ఆ పార్టీ దివాలా కోరు తనాన్ని సూచిస్తోంది. జగన్ రెడ్డి కమెడియన్ కావడం.. లోకేష్ జాతీయ స్థాయిలో మంచి నేతగా గుర్తిపు పొందడం.. సహజంగానే వైసీపీకి మింగుడుపడని అంశం. దీంతో లోకేష్ ఎదుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు, నందమూరి కుటుంబంలో చిచ్చు పెట్టే పాత వ్యూహాన్నే వైసీపీ మళ్ళీ తెరపైకి తెస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పేరును పదే పదే ప్రస్తావిస్తూ, టీడీపీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించాలని ప్రయత్నిస్తోంది.
రాజకీయ నీడ కూడా పడకుండా కెరీర్ నిర్మించుకుంటున్న ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన సినిమా కెరీర్లో అత్యున్నత దశలో ఉన్నారు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించే క్రమంలో ఆయన రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంటున్నారు. కనీసం రాజకీయ నీడ కూడా తనపై పడకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న తారక్ నిర్ణయాన్ని గౌరవించాల్సింది పోయి, వైసీపీ నేతలు ఆయన పేరును రాజకీయ రొంపిలోకి లాగడం నీచానికి పరాకాష్ట. ఒక వ్యక్తికి ఇష్టం లేకపోయినా, వారిని బలవంతంగా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అనేది అనైతికం. వైసీపీ నేతలకు అలవాటైందే అది.
సొంత కుటుంబాన్నే చిన్నాభిన్నం చేసుకున్నా మారరా?
గతంలో కూడా ఇదే తరహాలో కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరిగినప్పుడు అవి రివర్స్ ఎఫెక్ట్ ఇచ్చాయి. ఒకరి వ్యక్తిగత జీవితాన్ని , కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగినప్పుడు అది కేవలం ఆ కుటుంబానికే కాకుండా, ఆ పని చేసిన పార్టీకి కూడా తీరని నష్టం కలిగిస్తుందన్నది చరిత్ర చెబుతున్న సత్యం. వైసీపీ గతంలో అనుసరించిన ఇటువంటి వ్యూహాలే నేడు ఆ పార్టీని 11 స్థానాలకే పరిమితం చేశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ సభ్యులను దూరం చేసుకోవడం వల్ల కలిగే వేదనను ఇప్పటికే జగన్ రెడ్డి అనుభవిస్తున్నప్పటికీ, ఇంకా పాఠాలు నేర్చుకోకపోవడం ఆశ్చర్యకరం.
రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని లాగకూడదు!
రాజకీయాల్లో పోటీ అనేది పనితీరుపై ఉండాలి కానీ, ఒక వ్యక్తిని మానసిక ఇబ్బందులకు గురిచేసేలా ఉండకూడదు. లోకేష్ తన పనితీరుతో మార్కులు కొట్టేస్తుంటే, దానికి సమాధానం అభివృద్ధి రూపంలో ఇవ్వాలి తప్ప.. సంబంధం లేని వ్యక్తుల పేర్లను తెరపైకి తెచ్చి కక్షలు పెంచడం మూర్ఖత్వమే. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్న ఈ ప్రచారం వల్ల ఎన్టీఆర్కు ఒరిగేదేమీ లేదు సరే కదా, అటు నందమూరి అభిమానుల్లోనూ, ఇటు తటస్థ ప్రజల్లోనూ వైసీపీ పట్ల అసహనం మరింత పెరుగుతోంది.
దేవుడు చూస్తూంటాడు గుడ్!
జగన్ రెడ్డి తరచుగా చెప్పే మాట ఒకటి ఉంది—అన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు అని. అది నిజమే అయితే, ఒకరు ప్రశాంతంగా తన పని చేసుకుంటుంటే, వారిని స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవాలని చూడటం ఖచ్చితంగా ఆ పైవాడి దృష్టిలో తప్పే అవుతుంది. రాజకీయ లబ్ధి కోసం కుటుంబాలను చిన్నాభిన్నం చేసే కుట్రలకు ఇప్పటికైనా స్వస్తి పలకపోతే ఇంకా ఇంకా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఇంకా పూర్తిగా ఉన్నది కోల్పోకుండా ఉండాలంటే.. జాగ్రత్త పడాల్సిందే.
