గిరిజన మూలాలను చాటుకుంటూ, సామాన్య ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్న గాయని మంగ్లీ, ఇప్పుడు అదే గిరిజన బిడ్డలను నిలువునా ముంచినట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కోట్ల రూపాయల మేర సాగిన ఈ మైక్రో ఫైనాన్స్ కుంభకోణంలో మంగ్లీ, ఆమె సోదరుడు శివ చౌహాన్ ప్రధాన సూత్రధారులుగా ఉన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తండాల్లోని అమాయక గిరిజనుల నుండి అధిక వడ్డీలు, సినిమా ఫైనాన్సింగ్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి, ఇప్పుడు ముఖం చాటేసినట్లు కేసులు నమోదయ్యాయి. ఒకవైపు తాను గిరిజన బిడ్డనని చెప్పుకుంటూనే, మరో వారినే ఆర్థికంగా దెబ్బతీయడం తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది.
స్కాం డబ్బులు మంగ్లీ సోదరుడి ఖాతాకు!
ఈ కేసులో పోలీసులు జరిపిన తాజా దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు రమావత్ మధు అకౌంట్ నుండి మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాలోకి మూడు విడతలుగా పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయినట్లు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం ప్రాథమికంగా గుర్తించింది. నగదు జమ అయిన రోజే ఆ మొత్తాన్ని విత్డ్రా చేసినట్లు బ్యాంకు లావాదేవీలు స్పష్టం చేస్తున్నాయి. నిందితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ బహిరంగంగా ప్రకటిస్తున్నప్పటికీ, ఈ ఆర్థిక సంబంధాలు , డిజిటల్ సాక్ష్యాలు ఆమె వాదనలు కరెక్ట్ కాదని నిరూపిస్తున్నాయి.
బాధితులంతా గిరిజనులే – తండాల్లోని వారే
మోసపోయిన వారిలో అత్యధికులు మధ్యతరగతి, గిరిజన వర్గాలకు చెందిన వారే . న్యాయవాది సుబ్బారావు ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ స్కామ్లో మంగ్లీ కేవలం బ్రాండ్ అంబాసిడర్గానే కాకుండా, తెరవెనుక ఆర్థిక లావాదేవీల్లో కూడా కీలక పాత్ర పోషించినట్లు సాక్ష్యాలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులను బెదిరించడం, నోరు నొక్కే ప్రయత్నం చేయడం వంటి ఆరోపణలు కూడా మంగ్లీ కుటుంబంపై వస్తున్నాయి.
పూర్తి లావాదేవీల వివరాలు సేకరిస్తున్న పోలీసులు
ప్రస్తుతం మంగ్లీ , ఆమె సోదరుడి ఖాతాల వివరాలను సేకరించాలని పోలీసులు బ్యాంకులకు లేఖలు రాశారు. ఒక సెలబ్రిటీగా సమాజంలో ఉన్న గౌరవాన్ని అడ్డుపెట్టుకుని, అమాయకుల సొమ్ముతో రియల్ ఎస్టేట్ , మైక్రోఫైనాన్స్ కార్యకలాపాలు సాగించారన్న ఆరోపణలు ఇప్పుడు నిజమని తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోజురోజుకూ వెలుగులోకి వస్తున్న సాక్ష్యాలు, బాధితుల గోడు చూస్తుంటే.. మంగ్లీ చట్టం ముందు నిలబడక తప్పని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. గిరిజన తండాల నుండి వచ్చిన ఒక ప్రతిభావంతమైన గాయని, ఇలాంటి ఆర్థిక నేరాల్లో చిక్కుకోవడం ఆమె అభిమానులను సైతం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
