రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం తన కోసం పని చేసిన వారిని కాపాడుకోవడం. తన కోసం త్యాగాలు చేసిన వారికి కనీస గౌరవం ఇవ్వడం . అలా చేయకపోతే రేపు ఆయన కోసం పని చేసేవారంతా.. ఏదో స్వార్థం కోసం ఆలోచించి పనిచేసేవారే ఉంటారు తప్ప.. కనీస విధేయత చూపించరు. అలాంటి స్వార్థపరమైన నేతలకు రాజకీయాల్లో మనుగడ ఉండదు. అలాంటి నిలువెత్తు కటౌట్ వైఎస్ జగన్ రూపంలో ప్రజల ముందు ఉంది. ఆయన పార్టీ ఉంది. ఆయన కోసం జైలుకెళ్లిన వారిపై తన స్వార్థం కోసం ఆయన చేయిస్తున్న కుట్రలు నెక్ట్స్ లెవల్ వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా మారుస్తున్నాయి.
జగన్ నమ్మి సర్వం కోల్పోయిన శ్రీలక్ష్మిపై తాజా కుట్రలు
శ్రీలక్ష్మి తన ఉద్యోగ జీవితంలో వేల కోట్లు సంపాదించారని జగన్ రెడ్డి ఆత్మబంధువు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. శ్రీలక్ష్మిపై ఆయన చేసింది చిన్న చిన్న ఆరోపణలు కావు. తేలికగా తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే శ్రీలక్ష్మి చిన్న వయసులోనే ఐఏఎస్ అయ్యారు. ఆమెకు క్లీన్ రికార్డు ఉంటే.. చీఫ్ సెక్రటరీ అయ్యేవారు. కానీ ఎప్పుడైనా జగన్, వైఎస్ చెప్పిన మాటలు విన్నారో అప్పుడే పాతాళంలోకి పడిపోయారు. జైలుకెళ్లారు. ఆనారోగ్యం పాలయ్యారు. చివరికి ఆమె ఎవరికి కనిపించినా ఓ భయంకరమైన అవినీతి అధికారిగానే అందరూ మనసులో గుర్తు చేసుకుంటారు. జగన్ రెడ్డి కోసం అలాంటి ముద్ర వేయించుకున్న ఆమెను ఇప్పుడు వైసీపీ టార్గెట్ చేసింది.
వాడుకుని వదిలేయడం కాదు.. వాళ్లపైనే కుట్రలు !
రాజకీయ నేతలు.. తమకు ఉపయోగపడేవారిని వాడుకుంటారు. ఆ ఉపయోగపడేవారికి తెలివి ఉంటే.. తాము కూడా ఎదిగి.. తమ అవసరం ఆ నేతలకు ఉండేలా చేసుకుంటారు. తమకు ఉపయోగపడేవారిని కాపాడుకునేందుకు నేతలు కూడా ప్రయత్నిస్తారు. కానీ వైసపీ, జగన్ మనస్థత్వం పాములాంటిది. వారిని వాడుకునే క్రమంలో.. అవసరం లేదనుకుంటే వారిపైనే కుట్రలు చేసి.. వారిని రోడ్డున పడేయడానికి ఏ మాత్రం వెనుకాడరు. ఎల్వీ సుబ్రహ్మణ్యం నుంచి మోపిదేవి వెంకటరమణ వరకూ జగన్ రెడ్డి కోసం.. ఎంతో మంది బలయ్యారు. వారిని జగన్ రెడ్డి తర్వాత బలి తీసుకునే ప్రయత్నం చేశారు. తనకు రాజకీయంగా చిన్న లాభం జరుగుతుందని అనుకున్నా.. వారి పరువు తీయడానికి ఏ మాత్రం వెనుకాడరు.
శ్రీలక్ష్మి పైనా టీడీపీ ముద్ర – ఇక వ్యక్తిత్వాలెందుకు వైసీపీయన్స్ ?
శ్రీలక్ష్మి టీడీపీ నేతలతో కుమ్మక్కు అయిందని భూమన ఆరోపించారు. లిక్కర్ స్కామ్ నిందితుల నుంచి తల్లి, చెల్లికి కూడా టీడీపీ నేతలతో సంబంధాలు అంటగట్టారు వైసీపీ లీడర్లు, శ్రీలక్ష్మికి అంటగట్టడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇలా ఆరోపణలు చేసే ముందు.. కాస్త ముందూ వెనుకా చూసుకోరా.. తాము ఏం మాట్లాడుతున్నామో.. ఎవరి గురించి మాట్లాడుతున్నామో పట్టించుకోరా ?. తమ వ్యక్తిత్వాలు ఇంత నేలబారుగా ఉంటాయని రోజూ నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది ?. వైసీపీకి నమ్ముకున్న వాళ్ల గతి ఎలా ఉంటుందో.. శ్రీలక్ష్మినే సాక్ష్యం.