“బాడీ షేమింగ్” చేస్తేనే అచ్చెన్నాయుడిని కంట్రోల్ చేయగలుగుతారా..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్‌పై చర్చ జరగడం లేదు. ప్రశ్నోత్తరాల్లో ఆరోపణలు.. ఆ తర్వాత చర్చలో ఆరోపణలు.. వాటికి ప్రతిపక్షం కౌంటర్ .. మధ్యలో.. వ్యక్తిగత ఆరోపణలు చేసుకుని చర్చకు పక్కదారి పట్టించడం … చివరికి గందరగోళంతో వాయిదా వేసుకోవడం… జరిగిపోతోంది. మంగళవారం రోజు కూడా.. అదే జరిగింది. ఉదయం.. వైసీపీ సభ్యులు.. పలువురు టీడీపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేశారు. పేర్నీ నాని, రామచంద్రారెడ్డి వంటి వారు.. అచ్చెన్నాయుడు టార్గెట్ చేసుకున్నారు. అచ్చెన్నాయుడును బాడీ షేమింగ్ చేశారు. దాంతో అచ్చెన్న స్పందించారు. కానీ స్పీకర్ అడ్డుకోవడంతో.. అచ్చెన్న ఆగ్రహంతో..” మీరు రాసివ్వండి ..నేను చదువుతానని” స్పీకర్‌ని అనడంతో వివాదం చోటు చేసుకుంది. చివరికి.. సభలో వ్యక్తిగత విమర్శలు మంచివి కాదని అందరూ ప్రకటించుకుని చర్చకు వెళ్లారు.

అయితే అది కాసేపే.. మళ్లీ వ్యక్తిగత దూషణలే హైలెట్ అయ్యాయి. బడ్జెట్ పై చర్చలో కాపు రిజర్వేషన్ల అంశం చర్చకు వచ్చినప్పుడు.. కాపులను చంద్రబాబు మోసం చేశారని.. వైసీపీ సభ్యులు ఆరోపించారు. తనపై ఆరోపణలు చేశారు కాబట్టి.. తాను మాట్లాడాల్సిందేనని చంద్రబాబు… కౌంటర్ ఇచ్చారు. కాపు రిజర్వేషన్లు ఇప్పటి అంశం కాదని…2014 మేనిఫెస్టోలో చెప్పినట్లే కాపు రిజర్వేషన్లు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లపై జగన్‌ వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారా? లేదా? అని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్లపై నన్ను విమర్శిస్తే.. నేను సమాధానం చెప్పాలి కదా? అని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్లపై తాను మోసం చేయలేదని.. 2004, 2009లో మేనిఫెస్టోలో పెట్టి వైఎస్‌ ఏం చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. 5 శాతం రిజర్వేషన్లకు వైసీపీ కట్టుబడి ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

దీనిపై తానే మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్ల కొనసాగింపుపై స్పష్టత ఇవ్వలేదు కానీ…చంద్రబాబుపై.. అచ్చెన్నాయుడుపై వ్యక్తిగత విమర్శలు చేశారు. సినిమాలో కనిపించే విలన్‌ క్యారెక్టర్‌, మోసగాడు.. అసెంబ్లీకి వస్తే చంద్రబాబులా ఉంటాడని జగన్‌ తీవ్రంగా విమర్శించారు. అచ్చెన్నాయుడు భూమి మీద అంత లావు, ఎత్తు పెరిగాడు కానీ..

బుర్ర ఎందుకు పెరగలేదో నాకు అర్థం కావడం లేదన్నారు. అచ్చెన్నాయుడికి ఆ భారీ సైజు, గొంతు ఉంది కాబట్టి.. సభకు పదే పదే అడ్డుపడుతున్నాడని మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ల సంగతి ఏంటి అని అడుగుతుంటే.. 2004, 2009 సంగతి ఇప్పుడు ఎందుకని జగన్ ప్రశ్నించారు. జనం ఎందుకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారో.. చంద్రబాబు ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు. లేకపోతే.. వచ్చే ఎన్నికల్లో పదమూడు సీట్లే వస్తాయన్నారు. కాపు రిజర్వేషన్లకు అధికారికంగా ఆమోదముద్ర పడినా.. ఏపీలో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీనిపై జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ.. కాపు కార్పొరేషన్‌కు ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చుచేస్తామని.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామని..మొదటి బడ్జెట్‌లో కాపులకు రూ.2 వేల కోట్లు కేటాయించాని చెప్పుకొచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com