రాజకీయాలు చేయడం అంటే తాము సంపాదించుకోవడం, తమ వ్యక్తిగత ఇష్టాఇష్టాలు, వ్యక్తిగత కక్షలు, తమకు నచ్చని వారి అంతు చూడటమే అనుకుంటారు వైసీపీ నేతలు. అందుకే ఎపుడూ ప్రజల్ని పరిగణనలోకి తీసుకోరు. తమకు ఓటు వేసింది కూడా తమను సంపాదించుకోమని .. తమ పనులు చేయించుకోమని అనుకుంటారు. ఐదు సంవత్సరాలు అదే చేశారు. కానీ తాము అనుకున్నది కాదని ప్రజలు అనుకున్నది చేయాలని ఎన్నికల్లో తీర్పును ప్రజలు ఇచ్చారు. కానీ నేర్చుకునే అవకాశం వచ్చినా .. తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. కానీ ఇంకా ఇంకా ఘోరంగా దిగజారిపోతున్నారు వైసీపీ నేతలు. జగన్ .. ఆయనను ఆడించే సజ్జల ఇద్దరూ రాటుదేలిపోయారు.
రివర్ బేసిన్ అని యథాలాపంగా అన్నారా?
జగన్ రెడ్డి నదీగర్భంలో రాజధానిని కడుతున్నారని ప్రకటించారు. సుప్రీంకోర్టు స్పందించాలన్నారు. ఆయన చాలా తెలివితోనే .. అన్నీ తెలిసే ఆ మాట అన్నారని స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ మాటతో జగన్ రెడ్డిని ప్రజలు మరో రూపంలో అసహ్యించుకుంటున్నారని తెలియగానే సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. జగన్ ఏదో యథాలాపంగా అన్నారని…రివర్ బేసిన్ అని చెప్పడం ఆయన ఉద్దేశం కాదని.. జగన్ ఎప్పుడూ రాష్ట్రానికి ద్రోహం చేయలేదని కవర్ చేయడానికి మీడియా ముందుకు వచ్చారు. ఆయన చెప్పిన మాటలు విని ప్రజల్ని వీరు ఎంత తక్కువగా అంచనా వేస్తున్నారని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఘోరమైన రాజకీయానికి.. వీరిద్దరూ నిలువెత్తు సాక్ష్యంలా మారారు.
ప్రజల్ని ఇప్పటికీ తక్కువగా అంచనా వేస్తున్న ద్వయం
జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి ఇద్దరికీ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. ముఖ్యమంత్రిగా చేసినా కనీసం ప్రతిపక్ష నేత హోదా రాలేదు. అంతగా ఓడించారు. ప్రజల పవర్ ఏమిటో అప్పటికైనా తెలియాలి. కానీ ఇంత షాక్ కొట్టినా ప్రజల్ని ఇంకా తక్కువ అంచనా వేస్తూనే ఉన్నారు. తాము ఏది చెప్పినా నమ్ముతారని అనుకుంటారు. కానీ వారు ఇప్పటికే వైసీపీని పిచ్చోళ్ల పార్టీగా చూడటం ప్రారంభించారు. ఏది చేసినా డ్రామాలుగా చేయడం.. అన్న ప్రతి మాటను రివర్స్ లో తీసుకోవడం, ఒక్క మాట మీద నిలబడకపోవడం.. అసలు రాజకీయం చేస్తున్నారా..లాటరీ వేస్తున్నారా అన్నది కూడా అర్థం కానట్లుగా ప్రవర్తించడాన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి వారికి ఓటు ఎలా వేస్తారు?
ప్రజలు అన్నీ మర్చిపోతారని అనుకునే మూర్ఖులు
ఇవాళ జరిగింది రేపటికి ప్రజలు మర్చిపోతారని.. ఓటింగ్ దగ్గరకు వచ్చే సరికి ఇవన్నీ గుర్తుండవని.. జగన్ కావాలా.. చంద్రబాబు కావాలా అనేది మాత్రమే తేల్చుకుని ఓటేస్తారని వీరు అనుకుంటారు. కానీ ప్రజలు తీర్పు ఇచ్చే ముందు తమ జీవితాల్ని చూసుకుంటారని వీరు నమ్మడం లేదు. ఐదు సంవత్సరాల పాటు వారి నెత్తి మీద పడి చేసిన డాన్స్ ను చూసిన తర్వాత ప్రభుత్వాలు తమ జీవితాలను ఎలా మార్చగలవో వారికి బాగా అర్థమయింది. కానీ అర్థం కావాల్సింది వైసీపీ పెద్ద రెడ్లకే. కానీ వారు అర్థం చేసుకోలేరు. ప్రజలు పిచ్చివాళ్లు కులం, మతం, ప్రాంతం పేరుతో రెచ్చగొడితే పని పూర్తయిపోతుందని అనుకుంటున్నారు.కానీ ఇప్పటికే ప్రజల దెబ్బకు తామే పిచ్చివాళ్లుగా మారామని గుర్తించలేకపోతున్నారు.
