అంబటి రాంబాబుకు పరామర్శల కోసం డైలీ షెడ్యూల్ ఏర్పాటు చేశారు వైసీపీ సిద్ధాంతకర్త సజ్జల. ఓ పద్దతి ప్రకారం ఆయన వద్దకు లీడర్లను పంపుతున్నారు. ఆయనను ఏదో ప్రభుత్వం కక్ష కట్టి జైల్లో వేసిందన్నట్లుగా సీన్ క్రియేట్ చేస్తున్నారు. అ ప్రజల్ని తక్కువ అంచనా వేస్తున్నారో తమ రాజకీయం అలాంటిదని ఫిక్సయ్యారో కానీ.. అసలు ఇలాంటి రాజకీయం ప్రజా సమస్యల విషయంలో ఎందుకు చేయలేరన్నది సామాన్యులకు వచ్చే ప్రశ్న.
వైసీపీ ప్రజాసమస్యలపై ఇలా ఎప్పుడైనా స్పందించిందా?
వైసీపీ నేతలపై కేసులు నమోదైనప్పుడు లేదా అరెస్టులు జరిగినప్పుడు కనిపిస్తున్న ఉత్సాహం, ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న పరామర్శల పర్వం చూస్తుంటే.. పార్టీ ప్రాధాన్యతలు ఎటువైపు ఉన్నాయో స్పష్టమవుతోంది. అంబటి రాంబాబు వంటి నేతలను ఒక రాజకీయ బాధితుడిగా చిత్రీకరించేందుకు పక్కా షెడ్యూళ్లతో నేతలను పంపడం కేవలం కార్యకర్తల్లో నైతిక ధైర్యం నింపడానికే తప్ప, అందులో ప్రజా ప్రయోజనం శూన్యం. గత ఇరవై నెలలుగా రాష్ట్రంలో ప్రజాసమస్యలపై గళమెత్తని పార్టీ, కేవలం సొంత నేతల చుట్టూ రాజకీయాన్ని తిప్పడం సామాన్యులను విస్మయానికి గురిచేస్తోంది.
పార్టీ కోసం తప్ప .. ప్రజల కోసం ఎప్పుడూ బయటకు రాని జగన్
మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ చేసిన పోరాటం కామెడీగా మారింది. పునాదులు కూడా పడని చోట కాలేజీలు కట్టేశామంటూ చేసిన ప్రచారాలు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యాయి. క్షేత్రస్థాయిలో వాస్తవాలను గమనించకుండా, కేవలం గ్రాఫిక్స్ లేదా అసంపూర్తి కట్టడాల వద్ద నిలబడి ఫొటో షూట్లు చేయడం వల్ల ప్రజల్లో పార్టీ విశ్వసనీయత మరింత దెబ్బతిన్నది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ శైలి ఇప్పుడు కేవలం ప్రెస్ మీట్లు లేదా పరామర్శ యాత్రలకే పరిమితమైంది. గతంలో పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లిన ఆయన, ఇప్పుడు కేవలం తన పార్టీ నేతలకు కష్టం వస్తేనే బయటకు రావడం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల ఇబ్బందులపై పోరాడకుండా, కేవలం తన వర్గ ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోతోంది.
ప్రజల్ని తక్కువ అంచనా వేయడం ప్రమాదకరం
సామాన్య ప్రజలకు ఏది రాజకీయ డ్రామానో, ఏది నిజమైన పోరాటమో స్పష్టంగా తెలుసు. దారుణమైన తప్పును ఎదుర్కొంటున్న నేతను త్యాగధనుడిలా వర్ణించడం వల్ల ప్రజలు సానుభూతి చూపిస్తారని అనుకోవడం భ్రమ అవుతుంది. అంబటి రాంబాబును మునగచెట్టు ఎక్కించి చేస్తున్న ఈ పరామర్శల రాజకీయం చూస్తుంటే.. ప్రజల సమస్యల కంటే తమ ఉనికిని కాపాడుకోవడమే వైసీపీకి ముఖ్యం అనిపిస్తోంది. ఇలాంటి ధోరణి కొనసాగితే, రాబోయే రోజుల్లో ప్రజల నుండి ఆ పార్టీ మరింత దూరం అయ్యే ప్రమాదం ఉంది.
