A legislature that fails to represent the people’s voice is a betrayal of the democratic ideal: Abraham Lincoln
చట్టసభ సభ్యుడు ప్రజల గొంతును ప్రతిబింబించడంలో విఫలమైతే, అది ప్రజాస్వామ్య సిద్ధాంతానికి ద్రోహం చేసినట్లే అని అమెరికాలో బానిసత్వాన్ని రద్దు చేసిన మహోన్నత రాజకీయ నేతగా గుర్తింపు పొందిన అబ్రహం లింకన్ శతాబ్దం కిందట చెప్పిన మాట ఇది. ప్రపంచదేశాలన్నీ ప్రజాస్వామ్యంగా మారుతున్న సమయంలో .. ఆ ప్రజాపాలన పటిష్టంగా ఉండాలన్నా.. డెమోక్రసీ పునాదులు బలంగా ఉండాలన్నా.. చట్టసభల్ని గౌరవించాలి. ప్రజలు ఇచ్చిన తీర్పును అనుసరించాలి. అలా కాకుండా తాను అనుకున్నదే చేస్తానని ఏం చేసినా ప్రజలు తనకు ఓట్లు వేస్తారు అనే మూర్ఖత్వంతో రాజకీయాలు చేస్తే.. అది రాజకీయం అవదు. ప్రజాస్వామ్యం అసలు కాదు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉన్న సంప్రదాయం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన పార్టీ తరపున మరో 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరు ఎవరూ అసెంబ్లీకి హాజరు కావడం లేదు. అనర్హతా వేటు వేస్తారన్న భయంతో ఒక్కసారి గవర్నర్ ప్రసంగానికి వచ్చి 11 నిమిషాల పాటు సభలో కూర్చుని రచ్చ చేసి వెళ్లిపోయారు. ఆ అటెండెన్స్ ఉంటుందా.. ఊడుతుందా అన్నది తర్వాత సంగతి. అసలు ఆ ఎమ్మెల్యేలు చట్టసభకు ఇచ్చిన గౌరవం చూసిన తర్వాత ప్రజాస్వామ్య వాదులకు ఎన్నో అనుమానాలు వచ్చాయి. ఇలాంటి వారికి ఎమ్మెల్యేలుగా ఉండే అర్హత ఉంటుందా ?. వీరిని శాసన సభ్యులుగా కొనసాగించడం వల్ల ఉపయోగం ఏమిటి ? వీరికి జీతభత్యాలు ఎందుకు ఇవ్వాలి ? వంటివి ఆ సందేహాలు. వీటికి సమాధానం లేదు. ఎందుకంటే వీరు అసెంబ్లీకి ఎందుకు హాజరు కావడం లేదో వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిర్మోహమాటంగానే చెబుతున్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అని అంటున్నారు. అలా అడుగుతున్నారు అంటే.. ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ప్రజలు ఇవ్వలేదని సులువుగా అర్థం అయిపోతుంది. ప్రజలు ఇవ్వని దాన్ని బెదిరించి.. అసెంబ్లీకి రాబోమని బ్లాక్ మెయిల్ చేసి సంపాదించాలనుకుంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది ?. చట్టసభలకు సంబంధించి రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశాలు ఉన్నాయి. వాటిని బట్టి సంప్రదాయాలు కొనసాగుతూ ఉంటాయి. ఆ ప్రకారం ఇప్పటి వరకూ అసెంబ్లీలో లేదా పార్లమెంట్లో ప్రజలు ఇచ్చిన తీర్పుల ఆధారంగానే హోదాలు నిర్ణయం అవుతున్నాయి. సభానాయకుడిగా ముఖ్యమంత్రి లేదా ప్రధాని ఉంటారు. మెజార్టీ సభ్యుల మద్దతు ఉన్న వారు సభా నాయకుడు అవుతారు. మనది బహుళ పార్టీల వ్యవస్థ కాబట్టి ప్రతిపక్ష నేతగా ఎవరు ఉండాలన్న దానిపై కొన్ని రూలింగ్స్ ఉన్నాయి. కనీసం పది శాతం మంది సభ్యులు ఉన్న వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంత కంటే ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీలు ఉంటే.. పెద్ద పార్టీ పక్ష నేతకు ఆ హోదా ఇస్తారు. ఏపీలో జనసేన పార్టీకి వైసీపీ కన్నా ఎక్కువ సీట్లు ఉన్నాయి. కానీ అధికారపక్షంలో ఉంది. వైసీపీకి పది శాతం సీట్లు లేవు. కానీ ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీనే. అధికారికంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం అనే హోదా మాత్రం ఇవ్వరు.
హోదా లేకపోతే ప్రతిపక్షం కాదా.. ? ఎన్డీఏకు మద్దతిస్తున్నందుకు అధికారపక్షమా ?
ఇది ఏపీలో మాత్రమే జరుగింది కాదు.. జరుగుతోంది కాదు. ప్రస్తుతం రాహుల్ గాంధీ లోకసభలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా పొందారు. కానీ 2014 నుంచి 2024 వరకూ కాంగ్రెస్ పార్టీ లోకసభలో ప్రతిపక్షమే కానీ.. ప్రధాన ప్రతిపక్ష హోదా గుర్తింపు లేదు. ఎందుకంటే ఆ పార్టీకి పది శాతం సీట్లు రాలేదు. కాంగ్రెస్ పార్టీ 2014లో 44 సీట్లు మాత్రమే సాధించింది. స్పీకర్ సుమిత్రా మహజన్ సోనియా గాంధీకు LoP హోదా ఇవ్వలేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లు సాధించింది పది శాతం సీట్లు 55 కంటే తక్కువ. – మోదీ ప్రభుత్వం మళ్లీ 10 శాతం నియమాన్ని అనుసరించి, రాహుల్ గాంధీ లేదా ఇతరులకు LoP హోదా ఇవ్వలేదు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రతినిధులు 10 శాతం నియమాన్ని రద్దు చేయాలని సుప్రీం కోర్టును సంప్రదించారు. కానీ, సుప్రీంకోర్టు కోర్టు ఈ నియమాన్ని రద్దు చేయలేదు . స్పీకర్ నిర్ణయాన్ని సమర్థించింది. ఇది సంప్రదాయమేనని, చట్టం కాదని పేర్కొంది. ప్రతిపక్ష పార్టీకి ప్రధాన ప్రతిపక్షం అనే హోదా లేకపోవడం అసెంబ్లీల్లోనూ కొత్తేమీ కాదు. భారతదేశంలో 28 రాష్ట్రాల్లో చాలా చోట్ల 10 శాతం సీట్ల నియమం అమలులో ఉంది. ఇప్పటికి 7 రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. అరుణాచల్ ప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు 1 శాతం సీట్లు లేవు. గుజరాత్లో కాంగ్రెస్ 62 సీట్లు ఉన్నయి కానీ 10 శాతం లేవు. మహారాష్ట్రలో 2024 ఎన్నికల్లో మహా వికాస్ ఆఘాడి లోని పార్టీలు పదిశాతం సీట్లు సాధించలేకపోయాయి. అందుకే 60 సంవత్సరాల తర్వాత మొదటిసారి ప్రధాన ప్రతిపక్ష నేత మహారాష్ట్రలో లేరు. మణిపూర్ , నాగాలాండ్, సిక్కింలలోనూ ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. దీని అర్థం అక్కడ ప్రతిపక్ష పార్టీలన్నీ ఇంట్లోనే పడుకుంటున్నాయని కాదు. తాము హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తామని బాయ్ కాట్ చేసి.. ప్రెస్మీట్లతో కాలక్షేపం చేస్తున్నాయని కాదు.. అందరూ ప్రజాస్వామ్యబద్దంగా ఎవరి పనులు వారు చేస్తున్నారు. అంటే తమకు హోదా లేదు కాబట్టి తాము ప్రతిపక్షం కాదు అని వారు అనుకోవడం లేదు. అలాగని స్పీకరూ ట్రీట్ చేయండి లేదు. వారు ప్రతిపక్ష పార్టీ సభ్యులే. సభాసంప్రదాయాల ప్రకారం వారికి గౌరవం లభిస్తోంది. తమకు లేని..రాని హోదా కోసం ఆయా రాష్ట్రాల్లో ఎవరు ఏడుపులు, పెడబొబ్బలు పెట్టడం లేదు. దమ్ముంటే హోదా ఇచ్చి చూడు అని చావు తెలివి తేటలూ చూపించడం లేదు. ఎందుకంటే హోదా అనేది జస్ట్ ప్రోటోకాల్ మాత్రమే. ప్రజలు ఇవ్వని దాని కోసం వారెవరూ వెంపర్లాడటం లేదు. కానీ ఏపీలో ఘనత వహించిన జగన్మోహన్ రెడ్డి.. తాను పట్టిన కుందేలుకు అసలు కాళ్లే ఉండవని వాదించడానికి ఏ మాత్రం మొహమాటపడని మేదావి మాత్రం.. అందరూ నవ్వుకుంటారన్న కనీస జ్ఞానం లేకుండా అదే కారణంగా అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. తాను మాత్రమే కాదు..తన ఎమ్మెల్యేలనూ పంపడం లేదు. హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్నారు. ఇక్కడ అసలు దారుణమైన విషయం ఏమిటంటే.. ఈ ఎమ్మెల్యేలు జగన్ సహా ఎవరూ ప్రజలకు తమకు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించడం లేదు. కానీ జీతభత్యాలు మాత్రం రెగ్యులర్గా తీసుకుంటున్నారు. చివరికి అసెంబ్లీకి హాజరైనవారికి సమావేశాల ముగింపు సమయంలో చిన్న చిన్న గిఫ్టులు ఇస్తారు. వాటిని కూడా తీసుకుంటున్నారు. కానీ తమ నియోజకవర్గ ప్రజల గొంతును వినిపించేందుకు మాత్రం సభకు రాజన్ కావడం లేదు. ఒక సభ్యుడు చట్టసభకు హాజరు కాకపోతే ఆ నియోజకవర్గం గొంతు గల్లంతయినట్లే. ఎన్నికైన ప్రతినిధి హాజరు కాకపోతే, ఆ ప్రాంత ప్రజల హక్కులు, డిమాండ్లు చర్చకు రావు. అంటే.. ఆ ప్రాంత ప్రజల గొంతు కోసినట్లే అవుతుంది. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు అదే పని చేస్తున్నారు. చట్టసభకు హాజరు కేవలం బాధ్యత కాదు, ప్రజలకు ఇచ్చిన మాట నే విషయాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేరు. అడగకపోయినా ఎన్డీఏకు మద్దతుగా ఉంటున్నందుకు తమను కూడా అధికార పార్టీ ఖాతాలో జగన్ వేసుకుంటున్నారేమో .. ? ఆయన మనస్తత్వం ప్రకారం అలా కూడా జరిగినా ఆశ్చర్యం లేదు.
ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత బలాలు ఉండవు.. ప్రజలదే బలం !
నువ్ చేసేది ఉద్యోగమైనా.. సేవ అయినా చేసే దాంట్లో చిత్తశుద్ధి లేకపోతే ముందుకు వెళ్లడం అసాధ్యం. అదృష్టవశాత్తూ వచ్చే విజయాలను నెత్తికెక్కించుకుని తనకు మించిన బలవంతుడు లేడని అనుకుంటే పాతాళంలోకి పడిపోతారు. ఇలా జరిగినా ఇంకా పాఠాలు నేర్చుకోకపోతే ఎప్పటికీ కోలుకోవడం అనేది ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలు. తమ కు గౌరవం ఇవ్వని వారిని ప్రజలు ఎప్పటికీ గెలిపించరు. ఆ విషయాన్ని జగన్ రెడ్డి అండ్ కో అర్థం చేసుకోలేకపోతున్నారు. నిజానికి అర్థం చేసుకుంటున్నారు కానీ వారి అహం దాన్ని గుర్తించడానికి అడ్డం వస్తోంది. ప్రజలదేముంది.. అన్నీ మర్చిపోతారని అనుకుంటున్నారు. ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ అని.. పాలకులకుపై తప్పుడు ప్రచారాలు చేసి.. కుల, మత రాజకీయాలు చేస్తే.. అన్నీ మర్చిపోయి తమకు ఓటు వేస్తారని అనుకుంటున్నారు. తప్పుడు ప్రచారాలతో.. తప్పుడు రాజకీయాలు చేయడం ద్వారా పాలకులపై వ్యతిరేకత పెంచితే.. తమకే ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు. కానీ భారత ప్రజాస్వామ్య స్పృహ గురించి కాస్త అవగాహన ఉన్నా వారు ఎవరూ ఇలా భావించరు. ప్రజలకు ప్రత్యామ్నాయం లేకపోతే సృష్టించుకుంటారు. ఇప్పుడు ఉన్న నాయకులు కూడా ప్రజలు ఎంచుకున్న వారే. ఎంతో మంది నేతలు ప్రజల్ని గౌరవించకపోయినా పర్వాలేదు.. తమకు బానిసలుగా ఉంటారని అనుకున్న వారు కాలగర్భంలో కలసిపోయారు. నడమంత్రపు నేతలు మాత్రం ఇంకా తమ అహంకారాన్ని వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే ప్రజలకు తమను పాతాళంలోకి నెట్టేశారని .. గుర్తించకపోతే.. ఇంకా ఇంకా నెట్టేస్తారని మాత్రం అనుకోవడం లేదు.
తప్పు దిద్దుకుంటే ప్రజలు ఆలోచిస్తారు..లేకపోతే మర్చిపోతారు !
తాము ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి.. తాము ఇచ్చిన బాధ్యతల్ని నిర్లక్ష్యం చేస్తే ప్రజలు కొట్టే దెబ్బ చాలా వయోలెంట్ గా ఉంటుంది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నో తీర్పులు ఇలా వచ్చాయి. కొన్ని కొన్ని తప్పుడు ప్రచారాలు, భావోద్వేగాలతో ప్రజల్ని మాయపుచ్చి అధికారాన్ని దక్కించుకోవచ్చు కానీ నిజం తెలుసుకున్న తర్వాత ప్రజలు శిక్షిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న రాజకీయం అర్థం అదే. ప్రజాస్వామ్య మూలసూత్రం అర్థం చేసుకుని ప్రజల్ని గౌరవించిన వారు.. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. లేని వాళ్లు.. వారసత్వంతో వచ్చినా.. కనుమరుగైపోతారు. ఏపీలో జరగబోతోంది అదే. ఇప్పటికైనా తాము చేసిన తప్పులు దిద్దుకుంటే.. ప్రజలు అర్థం చేసుకుని క్షమించేందుకు ఆలోచిస్తారు. ఇలాగే ప్రజాతీర్పును కించ పరుస్తూ.. చట్టసభలకు హాజరు కాబోమని రాజకీయాలు చేస్తే.. వారు మర్చిపోతారు. అప్పుడు పట్టించుకునే వాళ్లూ ఉండరు.