వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దైన్య స్థితికి పార్లమెంట్ క్వశ్చన్ అవర్లో ఆ పార్టీ ఎంపీలు లేవనెత్తుతున్న అంశాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఏపీలో అంశాలను కూడా వారు ప్రస్తావించలేకపోతున్నారు. కనీసం ధైర్యం చేయలేకపోతున్నారు. సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ.. టైం పాస్ చేస్తున్నారు. మిథున్ రెడ్డి జీరో అవర్లో శాంతిభద్రతలు అంటూ ఫేక్ వార్తల్ని చదివేందుకు ప్రయత్నించిన సమయంలో రామ్మోహన్ నాయుడు గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో తర్వాత ఆయన కూడా మాట్లాడలేకపోయారు. ఇతర ఎంపీలు అసలు రాష్ట్ర అంశాలను పట్టించుకోవడం లేదు.
అయ్యో .. అయోధ్య రామిరెడ్డికి పొల్యూషన్ ప్రాబ్లం!
పార్టీ మారిపోతారని ప్రచారం జరిగిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజ్యసభలో ఎత్తుకున్న టాపిక్ కాలుష్యం. కాలుష్యంపై యుద్ధం ప్రకటించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అంతే తప్ప.. రాష్ట్రానికి సంబంధించిన అంశంపై మాట్లాడలేదు. ఆ కాలుష్యం గురించి చాలా లెక్కలు చెప్పారు.అయితే ఇక్కడ ఆయన సొంత ప్రయోజనాలు చూసుకున్నారని అనుకోవచ్చు. రామిరెడ్డి గారి బిజినెస్లో ఈ పొల్యూషన్ కంట్రోల్ కూడా ఒకటి. రాంకీ సంస్థ.. ఇలాంటి వ్యాపార వ్యవహారాల్లో ఉంది. ప్రజల గురించి …రాష్ట్రం గురించి ఏమీ మాట్లాడలేం కాబట్టి సొంత వ్యాపారానికి పనికొచ్చే ఏదైనా మాట్లాడితే బాగుండదని పొల్యూషన్ సమస్య ఎత్తుకున్నట్లుగా కనిపిస్తోంది.
సినిమా ధియేటర్ల సమస్యలపై మాట్లాడిన నిరంజన్ రెడ్డి
మరో వైసీపీ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి సినిమా ధియేటర్ల సమస్యలను అందుకున్నారు. నిరంజన్ రెడ్డి తెలంగాణకు చెందిన వారు. జగన్ ఆస్థాన లాయర్. లాయర్ ఫీజుల కింద డబ్బులివ్వకుండా రాజ్యసభ ఇచ్చారేమో కానీ ఆయన ఎప్పుడూ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనరు. కానీ న్యాయపరమైన వ్యవహారాల్లో మాత్రం జగన్, సజ్జల స్థాయి వారికి సేవలందిస్తారు. ఆయన సినిమా నిర్మాత కూడా. ఆయన లేటెస్ట్ సినిమా ఆచార్య. ఆ తర్వాత మళ్లీ ధైర్యం చేయలేదు. కానీ సినిమా ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లకు చాలా కష్టాలు ఉన్నాయని ఆదుకోవాలని కోరారు. ఈ ఎంపీ కూడా పర్సనల్ బిజినెస్ కోసమే మాట్లాడారని అర్థం చేసుకోవచ్చు.
మిథున్ రెడ్డి బాధ మిథున్ రెడ్డిది !
జగన్ ను నమ్మి జైలుకెళ్లి వచ్చిన మిథున్ రెడ్డి.. ఏపీలో అక్రమాల్లో అరెస్టులు అవుతున్న వైసీపీ నేతల బాధను పార్లమెంట్ ముందు పెట్టాలనుకున్నారు. కానీ రామ్మోహన్ నాయుడు వాగ్దాటి ముందు ఆయన గొ౧తు మూగబోయింది. ధాటిగా మాట్లాడలేని మిథున్ రెడ్డి .. ఏదో చెప్పాలనుకుని ఏదో చెబుతూంటారు. పార్లమెంట్ లో మాట్లాడాలన్నా ఆయన కిందా మీదా పడుతూంటారు.కానీ రామ్మోహన్ నాయుడు అలా కాదు.. ఆయన మాట్లాడటం ప్రారంభిస్తే మిథున్ రెడ్డికి ఏమైనా మాట్లాడాలని అనుకున్నా మర్చిపోతారు. అందుకే ఆయన కూడా రామ్మోహన్ దెబ్బకు నోరు మూసుకోవాల్సి వచ్చింది.
