ఓ మనిషికైనా.. ఓ సంస్థల్నా.. ఓ రాజకీయ పార్టీకైనా పాలసీ అనేది ఉంటుంది. ఓ మనిషి తనకు కొన్ని పద్దతులు పెట్టుకుని పాటిస్తాడు. ఓ సంస్థ తన విధానాలను తాను పాటిస్తుంది. ఓ పార్టీకి సిద్ధాంతాలు ఉంటాయి. విధానాలు ఉంటాయి. నిజానికి ఇవే ఆయా వ్యక్తులు, సంస్థలు, పార్టీల పునాదుల్ని బలంగా ఉంచుతాయి. కానీ జగన్ రెడ్డి, వైసీపీకి ఇలాంటి విధానాలు, పాలసీలు ఏమీ ఉండవు. ఓ విధానం లేకపోవడమే వారి విధానం. ఓ పాలసీ లేకపోవడమే వారి పాలసీ.
అవసరమే సిద్ధాంతం.. అధికారమే లక్ష్యం
ఏ రాజకీయ పార్టీకైనా కొన్ని మౌలిక సూత్రాలు ఉంటాయి. కానీ వైసీపీ విషయంలో అవసరమే సిద్ధాంతం.. అధికారమే లక్ష్యం అన్నట్లుగా సాగుతోంది. ఒకనాడు శాసనమండలి ప్రజాధనం వృధా అని, దానిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన జగన్ రెడ్డి, ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు మారగానే మళ్లీ అదే మండలిని కొనసాగించడం ద్వారా తన పాత మాటను తానే తుడిచేసుకున్నారు. ఇక్కడ వ్యవస్థల పట్ల గౌరవం కంటే, రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా కనిపించాయి. ఇది కేవలం ఒక నిర్ణయం మార్చుకోవడం కాదు, ఒక వ్యవస్థాకృత విధానం లేకపోవడానికి నిదర్శనం.
అమరావతి 11 మలుపుల మహా కావ్యం
రాజధాని విషయంలో జగన్ రెడ్డి తీసుకున్న యూ-టర్న్‌లు భారత రాజకీయ చరిత్రలోనే అరుదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 33 వేల ఎకరాలు రాజధానికి కావాల్సిందే అని అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపి, అధికారంలోకి రాగానే మూడు రాజధానుల’పేరుతో గందరగోళం సృష్టించడం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమే. నాడు అవునన్న నోరు, నేడు కాదన్నప్పుడు.. అక్కడ విధానం ఎక్కడ ఉంది? కేవలం గత ప్రభుత్వంపై ఉన్న ద్వేషం లేదా రాజకీయ ఆధిపత్యం కోసం ఒక రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టడం వారి అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ఠ.నాడు చంద్రబాబు హయాంలో ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే.. వారు పశువుల కంటే హీనం, రాజీనామా చేసి రావాలి అని నీతులు చెప్పిన జగన్ రెడ్డి తరవాత టీడీపీ ఎమ్మెల్యేల్ని చేర్చుకున్నారు. పార్టీ మారలేదని బుకాయించారు తన దగ్గరకు వస్తే చేరిక, అవతలి వైపు వెళ్తే ఫిరాయింపు అనే ద్వంద్వ ప్రమాణం వైసీపీ మార్క్ పాలిటిక్స్‌లో భాగమైపోయింది.
కేంద్రంతో బయట పోరాటం.. లోపల లొంగుబాటు
ప్రత్యేక హోదా విషయంలో జగన్ రెడ్డి సాగించిన డ్రామా మరొక పెద్ద యూ-టర్న్. కేంద్రం మెడలు వంచుతాం, పాతిక ఎంపీలను ఇవ్వండి అని చెప్పి, గెలిచిన తర్వాత “కేంద్రంలో మెజారిటీ ప్రభుత్వం ఉంది, మనం ఏమీ చేయలేం.. ప్రార్థించడమే మన పని” అని చేతులెత్తేయడం ఓటర్లను మోసం చేయడం కాదా? పోలవరం నిధుల విషయంలో కానీ, రాష్ట్ర విభజన హామీల విషయంలో కానీ గట్టిగా నిలబడిన సందర్భం ఒక్కటీ లేదు. లోపల సహకారం, బయట నామమాత్రపు విమర్శలు వారి పాలసీ.
వైసీపీ అనుసరిస్తున్న ఈ “నో పాలసీ” విధానం వెనుక ఉన్న అసలు నమ్మకం ఏంటంటే.. ప్రజలకు అన్నీ మర్చిపోతారు, సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతుంది అని. కానీ, మనిషికి కేవలం అన్నం మాత్రమే కాదు, ఆత్మగౌరవం , ఒక స్థిరమైన భవిష్యత్తు కూడా కావాలి. ఒక నాయకుడు ఉదయం ఒకటి చెప్పి సాయంత్రం మరొకటి చేస్తే, ఆ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుంది. సిద్ధాంతం లేని రాజకీయం పునాది లేని ఇల్లు వంటిది. అది ఎప్పుడైనా కూలిపోవచ్చు.
