అమరావతిలో ఏ పని జరుగుతున్నా ముందుగా వైసీపీకి.. ఆ పార్టీ సానుభూతిపరులకు.. ఆ పార్టీ మీడియాకు కిందా, పైనా మండిపోతోంది. జగన్ రెడ్డి రూ.600 కోట్లు పెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టి.. వెయ్యికోట్ల నష్టం చేసి.. ఎందుకూ పనికి రాని భవనం నిర్మిస్తే ఆహా..ఓహో అని పొగుడుతారు. కానీ చరిత్రలో నిలిచిపోయే.. ఐకానిక్గా ఉండే నిర్మాణాలకు మాత్రం అసలు టెండర్లు పిలవక ముందే అంత ఎందుకు అవుతుందని ప్రశ్నించడానికి లుంగీ ఎగేసుకుని వచ్చేస్తారు. కలెక్టర్ల సమావేశంలో ఐకానిక్ బ్రిడ్జి వంతెన నమూనాను చంద్రబాబు ఫైనల్ చేశారు. దానికి రెండున్నర వేల కోట్లు పెట్టబోతున్నారని.. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జికి చాలా తక్కువ అయిందని కొత్త నెరేటివ్ ప్రారంభించారు.
పులివెందులలో రోప్ బ్రిడ్జిని.. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జితో పోల్చుకున్న ఘనులు వీళ్లు
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి ప్రారంభమయ్యాక.. జగన్ రెడ్డి దాన్ని చూసి ముచ్చటపడి తన నియోజకవర్గం పులివెందులలో అలాంటిది ఉండాలని అనుకున్నారు. ఎంత ఖర్చవుతుందో ఆరా తీసి.. ఒకటి కట్టిపడేయండి అని తన అనుచరులకు చెప్పేశారు. వారు కేబుల్ బ్రిడ్జిని చూసి.. పులివెందులలో కట్టేశారు. దాన్ని జగన్ రెడ్డి ప్రారంభించారు. వైసీపీ సోషల్ మీడియా అంతా.. జయహో జగనన్న అన్నారు. రెండింటికి తేడా లేదా అంటే… హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి రియల్ ది.. పులివెందులది కనీసం రిప్లికా కూడా కాదు.. వంతెనకు .. మధ్యలో పెద్ద రాడ్ పెట్టి.. దానికి గుళ్లకు అలకరించినట్లుగా తాళ్లు వేసి.. లైటింగ్ పెట్టారు. దాన్ని హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జితో పోల్చుకున్నారు. ఇలాంటి వారు ఇప్పుడు.. ఏపీలో నిర్మించాలనుకుంటున్న ఐకానిక్ వంతెన గురించి కామెంట్ చేస్తున్నారు.
రెండున్నర వేల కోట్లు ఎందుకు అవుతుందని అప్పుడే తప్పుడు ప్రచారం
ఐకానిక్ వంతెన నిర్మాణానికి ఎంత అవుతుందో ఇంకా స్పష్టత లేదు. 2019లో పనులు ప్రారంభించినప్పుడు రూ.1380 కోట్లకు టెండర్లు ఇచ్చారు. జగన్ రెడ్డి కి ఇలాంటివి నచ్చవు కాబట్టి ఆపేశారు. ఇప్పుడు ఆరేడేళ్లు అవుతోంది. అప్పట్లో రూపాయి వాల్యూ ఎంత.. ఇప్పుడు ఎంత ?. అప్పట్లో మెటీరియల్, మ్యాన్ పవర్ కాస్ట్ ఎంత.. ఇప్పుడు ఎంత ?. జగన్ రెడ్డి ఆ పనుల్ని కొనసాగించి ఉంటే.. ఈ పాటికి వంతెన అందుబాటులోకి వచ్చేది. కానీ ఆపేశాడు. ఇప్పుడు అదే రేటుకు ఏ కాంట్రాక్టర్ కూడా చేయడు. అయినా ఎంత అవుతుందో స్పష్టత లేదు. ఎందుకంటే ఇంకా టెండర్లు పిలవలేదు. రెండున్నర వేల కోట్లు అవుతుందని.. ఉజ్జాయింపుగా.. మీడియానే వేసి లెక్కలు చెబుతోంది. అదే లెక్కలతో.. ఇతర బ్రిడ్జిలకు ఇంతే అయిందని అతి తెలివిని చూపిస్తున్నారు.
అరకిలోమీటర్ కు.. ఐదున్నర కిలోమీటర్లకు తేడా తెలియదా ?
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి అర కిలోమీటర్ కంటే తక్కువ ఉంటుంది. పైగా అది చెరువు మీద ఉంది. అమరావతిలో కట్టబోయే ఐకానిక్ బ్రిడ్జి.. నదిపై ఉంటుంది. దాని పొడవు.. ఐదున్నర కిలోమీటర్లు. ఆరు లైన్లతో.. విశాలంగా ఉంటుంది. వాక్ వే ఉంటుంది. కూచిపూడి డిజైన్లతో ఉంటుంది. గచ్చిబౌలి కేబుల్ బ్రిడ్జికి డిజైన్లు ఉండవు. బురద చల్లాలని అనుకునేవారికి ఇదంతా కనిపించవు. ఈ వివరాలు తెలిసినా తెలియనట్లుగా నటిస్తారు.
అంత సింపుల్ గా అయితే టెండర్లు వేయవచ్చుగా ?
వంతెన ఎంతకు కడితే లాభం వస్తుందో… ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి బాగా తెలిసినట్లుగా రాస్తున్నారు. ఐదు వందల కోట్లలోనే కట్టేస్తామన్నట్లుగా చెబుతున్నారు. ఇంకా టెండర్లను పిలవలేదు. వెంటనే.. తమ పార్టీ సానుభూతిపరులకు బోలెడన్ని కాంట్రాక్ట్ సంస్థలున్నాయి. వాటితో ఓ టెండర్ వేయించి.. ఐదు వందల కోట్లకు కోట్ చేసి పనులు చేపడితే.. రెండు వేల కోట్లు ఆదా చేసిన వాళ్లవుతారు. గ్రేట్.. అని అభినందిస్తారు. మరి ప్రయత్నిస్తారా ?
