సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ జాబితాలోకి వైసీపీ కూడా చేరింది. అనూహ్యంగా ఇండియా కూటమిలోని పార్టీలతో కలిసి వైసీపీ నేత మల్లాది విష్ణు ఏపీ సీఈవో వివేక్ యాదవ్ ను కలిసి సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఆపేయాలని వినతి పత్రం ఇచ్చారు. జగన్ రెడ్డి కోర్టు దగ్గర చేసిన హడావుడి మధ్య ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాన్ సర్ ప్రక్రియను వ్యతిరేకించడం అంటే.. కాంగ్రెస్ దారిలోకి వెళ్లినట్లేనని అర్థం చేసుకోవచ్చు.
ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ కూటమి
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణను కాంగ్రెస్ , మిత్రపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకునే ముందు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి అభిప్రాయాలు తీసుకుంది. ఆ సమయంలో వైసీపీ ఓటర్ల జాబితా సవరణకు మద్దతుగానే మాట్లాడింది. కానీ హఠాత్తుగా ఏపీలో అలాంటి ప్రక్రియ వద్దని మల్లాది విష్ణును కాంగ్రెస్ పార్టీ కూటమి నేతలతో సహా పంపి వినతి పత్రం ఇచ్చింది. ఇది జగన్ ఆడుతున్న డబుల్ గేమ్ లో భాగంగా కనిపిస్తోంది
ఏపీలో కూటమి కట్టాలని ప్రయత్నాలు
జగన్ రెడ్డి.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను సమీకరించాలంటే.. కూటమి కట్టాలని అనుకుటున్నారు. అందులో భాగంగా వామపక్షాలను, కాంగ్రెస్ ను కూడా కలుపుకుంటున్నారు. అయితే ఆయనకు కొన్ని పరిమితులు ఉన్నాయి. బీజేపీకీ కోపం రాకుండా.. కలిసినట్లుగా నటించాల్సి ఉంటుంది. అందుకేపార్టీతో సంబంధం లేదన్నట్లుగా మల్లాది విష్ణులాంటి వాళ్లను పంపుతున్నారు. కానీ తమ ర్యాలీలకు కలిసి రావాలని అన్ని పార్టీలనూ కోరుతున్నారు. సజ్జల ఆయా పార్టీల నేతలను స్వయంగా సంప్రదిస్తున్నారు. సీట్ల గురించి ఇప్పుడే ఎందుకు కానీ.. కలసిపోరాడదామని పిలుపునిస్తున్నారు. ఆర్థికంగా అవసరాలు తీరుస్తామని చెబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
కొన్నాళ్లకు అయినా కాంగ్రెస్ కూటమి చెంతకే
చంద్రబాబు, లోకష్, పవన్ ఎన్డీఏతో పూర్తి స్థాయిలో కలసిపోయారు. మోదీ.. నారా లోకేష్ పై ప్రత్యేక అభిమానం చూపుతున్నారు. ఇలాంటి సమయంలో మోడీ కాళ్లు పట్టేసుకుని ఉంటే రాజకీయంగా నష్టమేనని జగన్ భావిస్తన్నారు. అలాగని ఇప్పుడే తిరుగుబాటు చేస్తే జైలుకు పంపిస్తారు. అందుకే ఎన్నికల వేడి ప్రారంభమైన తర్వాత ఆయన తనదైన యూటర్న్ తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే..మెల్లగా ఇండీ కూటమికి సంకేతాలు పంపుతున్నారు. గతంలో ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఇండీ కూటమి పార్టీలే ఆయనకు మద్దతు తెలిపాయి. ఇదే మొదటి సంకేతం అనుకోవచ్చు.

