రాజకీయాలు డైనమిక్‌గా ఉంటాయి. ఎంత డైనమిక్ గా ఉంటాయంటే నిన్నటి వరకూ వైసీపీకి రేవంత్ రెడ్డి శత్రువు. ఆయనను టీడీపీ ఖాతాలో వేసి విమర్శలు చేస్తూంటారు. రేవంత్ సీఎంగా ఉన్నారనే.. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కాకుండా బెంగళూరులో ఉంటారని కూడా చెబుతారు. బీఆర్ఎస్తో పాటు వైసీపీ సోషల్ మీడియా కూడా రేవంత్ పై విమర్శలు చేస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి వైసీపీకి అత్యంత గొప్ప వ్యక్తిగా మారిపోయాడు. ఎందుకంటే జగన్ రెడ్డి చేసిన ఘోరమైన తప్పిదాన్ని రేవంత్ రెడ్డి చంద్రబాబుపై వేశారు మరి. అదే సమయంలో బీఆర్ఎస్ నిజాన్ని చెప్పింది.. జగన్ హయాంలోనే ఆ తప్పిదం జరిగిందని బీఆర్ఎస్ ప్రకటించింది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ .. వైసీపీకి శత్రువన్నమాట.
రాయలసీమ లిఫ్ట్ పనుల నిలిపివేతపై రేవంత్ రాజకీయం
రాయలసీమ లిఫ్ట్ అనే ప్రాజెక్టును జగన్ రెడ్డి కనీస అనుమతులు లేకుండా తన హయాంలో ప్రారంభించారు. అప్పట్లో కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. కాంట్రాక్టులు ఇచ్చి పనులు ప్రారంభమైన తర్వాత రాజకీయ దుమారం రేగడంతో ఎన్జీటీలో పిటిషన్లు వేసి ఆపించారు. ఓ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం కావాలంటే కనీస అనుమతులు ఉండాలి. జగన్ అవేమీ తీసుకోకపోవడంతో ప్రాజెక్టును ఆపేయాల్సి వచ్చింది. ఆయన సీఎంగా ఉన్నప్పుడే.. 2020లోనే పనుల్ని ప్రారంభించడం… ఆపేయడం జరిగిపోయాయి. కానీ ఇపుడు రేవంత్ రెడ్డి తన విజ్ఞప్తితో చంద్రబాబు ఆ పనుల్ని నిలిపివేశారని చెప్పుకున్నారు.
సిగ్గుపడకుండా.. రేవంత్ రెడ్డి మాటలతో వైసీపీ రాజకీయం
అయితే ఈ అంశంపై చర్చ జరిగితే తమ గురించి మొత్తం తెలుస్తుందని బయటపడినా.. తమ మీడియా ద్వారా ఎదురుదాడి చేయవచ్చని.. ఓ సీఎం చెప్పారు కాబట్టి ప్రచారం చేసుకోవచ్చని వైసీపీ రంగంలోకి దిగింది. చంద్రబాబు పనులు ఆపేశారని.. రేవంత్ రెడ్డి చెప్పారని ప్రచారం ప్రారంభించింది. ఎలా చెబుతున్నారంటే.. రేవంత్ రెడ్డి చెప్పారు కాబట్టి అది నిజమని వాదిస్తున్నారు. అదే రేవంత్ రెడ్డి ఇంకా జగన్ గురించి కూడా చాలా చెప్పారన్న సంగతిని వారు మరచిపోతున్నారు. కానీ ఇప్పటికైతే.., రేవంత్ మాటలు ఎంతో గొప్పగా ఉంటాయి. అందుకే ఆయన మిత్రుడైపోయాడు.
నిజం చెప్పిన బీఆర్ఎస్ – వైసీపీకి శత్రువే !
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నిజం చెప్పింది. ఆ ప్రాజెక్టును జగన్ నిర్మాణం ప్రారంభించిన కొంతకాలనికే ఆపేశారని తెలిపారు. తాము న్యాయస్థానాలకు వెళ్లి నిలిపివేయించామని హరీష్ రావు పత్రాలతో సహా బయటపెట్టారు. జగన్ రెడ్డి హయాంలోనే ఆగిపోయిందని.. మూడేళ్ల కిందటే పనులు నిలిచిపోయాయని గుర్తు చేశారు. మూడున్నరేళ్ల పాటు ఆ తర్వాత జగన్ పదవిలో ఉన్నా…. పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నించలేదని దీంతో బయటపడింది. అసలు నిజాన్ని బీఆర్ఎస్ బయటపెట్టడంతో.. వైసీపీ ఇప్పుడు బీఆర్ఎస్ మాటల్ని ఖండించడానికి రెడీ అయింది.
జగన్ తప్పులు .. తప్పులు కాకుండా పోతాయా?
జగన్ రెడ్డి ..తన పాలన అంతా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగించారు. ఆయన చేసిన తప్పుల్ని.. టీడీపీ మీద వేయడానికి ఎవరైనా చాన్స్ ఇస్తే వేసేయడానికి పరుగెత్తుతున్నారు.కానీ నిజం తెలిసిన తర్వాత అది వైసీపీ నిర్వాకమేనని ప్రజలకు క్లారిటీ వస్తుందని.. అప్పుడు పరువు పోతుందని అనుకోవడం లేదు. పోవడానికి ఎక్కడుందని.. తమ దారిన తాము పోతున్నారు.
