ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విచిత్రమైన నెరేటివ్ ను క్రియేట్ చేసుకుంటోంది. ప్రధాని మోదీకి తామే శాశ్వత మిత్రులమని, బయటకు పొత్తులు ఉన్నా బీజేపీకి అసలైన స్నేహితుడు జగన్ రెడ్డి మాత్రమేనని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి జగన్ అరెస్టు గురించి అడిగితే.. అమిత్ షా ఆయనకు హితబోధ చేశారని, చంద్రబాబు తాత్కాలిక స్నేహితుడు మాత్రమే, జగన్ మాకు లాంగ్ టర్మ్ ఫ్రెం అని చెప్పారనే వార్తను వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా సర్కులేట్ చేస్తోంది. వినడానికి ఇది వైసీపీకి బలాన్ని ఇచ్చేలా ఉన్నా, లోతుగా విశ్లేషిస్తే ఇది ఆ పార్టీ స్వయంగా తవ్వుకుంటున్న గోతిలా కనిపిస్తోంది. తనపై ఉన్న అక్రమాస్తుల కేసులు, సీబీఐ విచారణల నుంచి తప్పించుకోవడానికి బీజేపీ అండ తనకు ఉందని లోకానికి చాటి చెప్పే ప్రయత్నంలో జగన్ అండ్ గ్యాంగ్ ఒక ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు.
బీజేపీ ఇమేజ్‌కే మచ్చ
ఒకవైపు నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అవినీతిపై యుద్ధం ప్రకటిస్తుంటే, మరోవైపు ఢిల్లీ పెద్దలు అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని కాపాడుతున్నారు అనే ముద్ర పడటం బీజేపీకి ఏమాత్రం ఇష్టం ఉండదు. వైసీపీ చేస్తున్న ఈ శాశ్వత మిత్రుడు ప్రచారం వల్ల బీజేపీకి దేశవ్యాప్తంగా చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. జగన్ అండ్ కో ఇదే ప్రచారాన్ని కొనసాగిస్తే.. తమపై పడిన అవినీతిని ప్రోత్సహిస్తున్నారు అనే మరకను తుడుచుకోవడానికైనా, బీజేపీ అధిష్టానం జగన్ విషయంలో కఠినంగా వ్యవహరించక తప్పని పరిస్థితిని వైసీపీనే కల్పిస్తోంది.
అవసరం ఎవరిది?
రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు, కేవలం ప్రయోజనాలు మాత్రమే శాశ్వతం. గతంలో పార్లమెంటులో బిల్లుల కోసం వైసీపీ మద్దతు అవసరం కాబట్టి బీజేపీ కొంత మౌనం వహించి ఉండవచ్చు. కానీ, ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే బలంగా ఉంది. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇలాంటి సమయంలో జగన్ మాకు శాశ్వత మిత్రుడు అని బీజేపీ చెప్పే అవకాశం తక్కువ. పైగా, అమిత్ షా వంటి నాయకులు బహిరంగంగానే జగన్ హయాంలో అవినీతి జరిగిందని విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
అసలు అసవరం జగన్‌కే.. కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ చెంతకే
జగన్ రెడ్డికి బీజేపీ అండ ఎంత అవసరమంటే.. ఆయన బయట ఉండి రాజకీయం చేయాలన్నా, తన ఆస్తులను కాపాడుకోవాలన్నా కేంద్రం కన్నెర్ర చేయకుండా ఉండాలి. ఈ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికే, తాము బీజేపీకి అత్యంత సన్నిహితులమని నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. అయితే, ఈ ప్రచారం చూస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం.. తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి జగన్‌పై ఉన్న కేసుల వేగాన్ని పెంచే ప్రమాదం ఉంది. అంటే, వైసీపీ చేస్తున్న ఈ ఫ్రెండ్షిప్ ప్రచారం చివరకు జగన్ కాళ్లను పట్టుకుని లాగేసే పరిస్థితిని తెస్తోంది. గతంలోనూ ఇలాంటి ప్రచారాలు చేసి వైసీపీ నష్టపోయింది. ఇప్పుడు కూడా ఢిల్లీ పెద్దల పేర్లను వాడుకుంటూ చేస్తున్న ప్రచారం.. రేపు వారే జగన్‌ను జైలుకు పంపేలా ప్రేరేపించవచ్చు. రాజకీయాల్లో అతి తెలివి ప్రదర్శించడం వల్ల ఒక్కోసారి అసలుకే ఎసరు వస్తుంది. ఇలాంటివి ఆలోచించేంత రాజకీయం వారికి తెలియదు.. తెలిసినా గుర్తించలేరు.