అమరావతి రీ స్టార్ట్ అవుతోంది. ఈ విషయంలో ఏపీ రాజకీయ పార్టీలన్నీ తమ అభిప్రాయాలను బలంగా చెప్పాయి. రాజధానిగా అమరావతినే ఫైనల్ అని తేల్చేశాయి. వైసీపీ మాత్రం అమరావతికే మా మద్దతు అని ఒక్క మాట చెప్పడం లేదు. అలాగని మూడు రాజధానుల విధానానికే కట్టుబడి ఉన్నామని కూడా చెప్పడం లేదు. ఏదైనా ఓ పార్టీ తన విధానాన్ని ముఖ్యంగా ప్రజా సంబంధిత…రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాల్సి ఉంది.
రాజకీయ నిర్ణయాలు ఎలాగైనా తీసుకోవచ్చు..కానీ రాష్ట్ర విషయాల్లో మాత్రం క్లారిటీ ఉండాలి. గోడ మీద పిల్లిలా ఉండి నాశనం చేయడానికి ఏది బాగుంటే దాన్నే సందర్భాన్ని బట్టి ఎంచుకుంటానని చెబితే అంత కంటే ఘోరం ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయించే క్రమంలో జగన్ రెడ్డి అసెంబ్లీలో ఆమోదం తెలిపారు. అమరావతికి అధికారికంగా మద్దతు తెలిపి అనధిరికంగా వ్యతిరేకత తెలిపారు. రాజధానికి భూములిచ్చిన రైతులందర్నీ ఓ వర్గం వారిగా జమ కట్టారు. వారిని అవమానించారు. ఎన్నికల సమయంలో అమరావతే రాజధాని అని చెప్పి వెన్నుపోటు పొడిచారు. చివరికి ప్రజలు బుద్ది చెప్పారు.
ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ తన అమరావతి విషయంలో తన విధానాన్ని స్పష్టం చేయాల్సి ఉంది. మూడు రాజధానులకే కట్టుబడి ఉంటే ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పుకోవాలి. అమరావతిలో లెక్కలేనంత అభివృద్ధి జరుగుతోందని చెప్పి ఇతర ప్రాంతాల్లో రెచ్చగొట్టే పనులు చేయడానికి దొంగ రాజకీయాలు చేస్తే అంత కంటే రాష్ట్ర ద్రోహం ఉండదు. అమరావతి అనే కాదు.. ఏ రాజధాని అయినా రాష్ట్ర ప్రజలందరిదీ. కుట్రలు చేస్తే ప్రజలు సహించే అవకాశం ఉండదు. వారు ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే చూశారు.