జగన్ను అభిమానించడమే వారు చేస్తున్న పాపం. ఆ అభిమానాన్ని రెచ్చగొట్టి వారిని జైలు పాలు చేస్తున్నారు. కేసుల పాలు చేస్తున్నారు. తర్వాత వారు ఆ కేసుల దెబ్బకు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగుతూ జీవితంలో కష్టాలు పడుతూ ఉంటారు. కానీ వారిని ఎవరూ పట్టించుకోరు. విద్యార్థులు అయితే.. ఉద్యోగం కోసం , ఉపాధి కోసం చూస్తున్న వారికి అయితే బతుకు మీద దెబ్బ పడుతుంది. ఇలా పదుల సంఖ్యలో క్యాడర్ పై కేసులు పడుతున్నా.. రప్పారప్పాలు వద్దని వైసీపీ నుంచి ఒక్క అధికారిక ప్రకటన రావడం లేదు. మేమంతా అండగా ఉంటామని కూడా చెప్పడం లేదు.
జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకాలు చేయమని చెబుతున్నదెవరు?
జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు అయిపోయింది. ఆ రోజున రప్పా రప్పా పోస్టర్లు పెట్టిన వారికి.. జంతు బలి ఇచ్చి రక్తాభిషేకం చేసి భయభ్రాంతులకు గురి చేయాలనుకున్న వారికి పోలీసులు సరైన ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఓ వైసీపీ కార్యకర్త గర్భిణిపై దాడి చేస్తే.. పోలీసులు అతన్ని నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. ఏ కాలితో తన్నాడో.. ఆ కాలితో సరిగ్గా నడవలేకపోయాడు. ఇవన్నీ చూస్తూ కూడా.. ఇప్పుడు మళ్లీ కొంత మందికి అలాంటి పనులు చేయమని పురమాయిస్తున్నారు. చేయిస్తున్నారు. వారు కేసుల పాలయ్యేలా చేస్తున్నారు. వారంతటకు వారు చేయరు. కానీ ఆర్థిక సాయం చేసి మరీ రెచ్చగొడుతున్నారు.
రప్పారప్పాలు వద్దని ఒక్క మాట కూడా చెప్పరెందుకు?
రప్పారప్పాలు వద్దని అది మంచిది కాదని ఒక్క మాట కూడా వైసీపీ పెద్దల నుంచి ఇప్పటి వరకూ రాలేదు. పైగా రప్పా రప్పా అంటే.. నరుకుతామని కాదని.. మళ్లీ గెలుస్తామని చెప్పడం అని సమర్థించుకుంటున్నారు. సినిమాల్లో ఉందని.. తాము అంటే తప్పేమిటని వాదిస్తున్నారు. మూగ జీవాలను ఇలా నడిరోడ్డు మీద తల నరకడం.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి భయభ్రాంతులకు గురి చేయాలనుకోవడం ఘోరమైన వ్యక్తిత్వం. అలాంటివి చేసిన వారందర్నీ పోలీసులు వీధులో నడిపించుకుని వెళ్తున్నారు. అలాంటి పరిస్థితి కల్పిస్తున్నారు కానీ..తప్పులు చేయవద్దని మాత్రం చెప్పడం లేదు. పైగా అభిమానంతో చేస్తున్నారని కవర్ చేసుకుంటున్నారు.
వాళ్ల జీవితాలు చెడిపోయినా పర్వాలేదా ?
జగన్ రెడ్డిని వాళ్లు అభిమానించడానికి కారణం వారికేదో లాభం వస్తుందని కాదు. కానీ వైసీపీ పెద్దలు తమ పార్టీని నమ్ముకున్నవారంతా.. సంపాదించుకోవడానికే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వారంతా తమ కోసం జీవితాలు నాశనం చేసుకున్నా తప్పు లేదనుకుంటున్నారు. అలాగే చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నారని రప్పా రప్పా ఉద్యమానికి వారు ఇస్తున్న సహాయసహకారాలతో అర్థమైపోతుంది. వారికి ఇంకా అర్థం కాని విషయం ఏమిటంటే.. ఇలాంటి బెదిరింపులతో ప్రజలు భయపడరు. అధికారంలో ఉన్నప్పుడే ప్రతి యాభై ఇళ్లు ఓ వాలంటీర్ ను పెట్టి బెదిరిస్తే .. పాతాళానికి పడేశారు. విపక్షంలో ఉండి ఇలాంటివి చేస్తే.. ఇక కోలుకోనివ్వరు. ఆ విషయం తెలుసుకునేందుకు తెలివి వైసీపీ పెద్దల్లో లేదు. వారి మూర్ఖత్వానికి క్యాడర్ బలవుతోంది.
