వైసీపీలో జరిగే సామాజిక న్యాయం గురించి రాజకీయాల్లో పడే సెటైర్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పార్టీ అంటేనే సామాజిక న్యాయానికి ప్రతీక. ఒకే ఒక్క కులానికి న్యాయం చేస్తుంది. మిగతా వారికి ఏదైనా పదవులు ఇచ్చినా ఆ పనులు కూడా పరోక్షంగా తమ వర్గం వారే చేస్తారు. పార్టీ పదవుల్లోనూ అంతే. ఘోరంగా ఓడిపోయినా వారి తీరులో మార్పు రాలేదు. తాజాగా పార్టీ నుంచి బయటకు పోకుండా ఉండేందుకు చాలా మందికి పదవులు ఇస్తున్నారు. కొత్తగా కార్యదర్శుల పేరుతో ఏకంగా 51 మందికి పదవులు ప్రకటించారు.
ఈ 51 మందిలో 30 మంది రెడ్డి సామాజికవర్గానికి వారు ఉన్నారు. ఈ జాబితా చూసి.. ఎలాంటి పరిస్థితుల్లోనూ జగన్ మోహన్ రెడ్డి సామాజిక న్యాయం మానుకోరని ఆ పార్టీలో కూడా సెటైర్లు పడుతున్నాయి. పార్టీ కోసం పని చేసేవారు ఒకే వర్గం అని.. ఒకే వర్గం వారు మాత్రమే ఓట్లు వేస్తేనే బండి నడుస్తోందన్నట్లుగా ఆ పార్టీ అగ్రనేతల తీరు ఉంటుంది. ఇతరులు ఎవరికైనా చిన్న పదవి ఇస్తే..అది అలంకార ప్రాయమే . పనులన్నీ.. మళ్లీ అదే వర్గానికి చెందిన వ్యక్తి చేస్తారు.
వైసీపీ హయాంలో హోంమంత్రులు, ఎక్సైజ్ మంత్రులు సహా కీలకమైన వారంతా బడుగు, బలహీనవర్గాల వారు ఉంటారు. కనీసం వారికి పేషీలోకి అడుగుపెట్టే స్వాతంత్ర్యం కూడా ఉండదు. వారి నియోజకవర్గాల్లో ఉంటే..ఇక్కడ పనుల్ని సకల శాఖల మంత్రి చక్కబెట్టేవారు. ఇప్పుడు పార్టీలోనూ అదే చేస్తారు. ఒకే ఒక్క వర్గంతో గెలవాలని జగన్ ఎలా అనుకుంటున్నారో కానీ.. ఆ పార్టీ పూర్తిగా రాంగ్ ట్రాక్ లో నడుస్తోందని.. ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది.