కర్నూలు బస్సు ప్రమాదంపై తప్పుడు ప్రచారం చేసిన వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల కర్నూలు పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఎస్వీమోహన్ రెడ్డి ఆమెను కొంత మంది కార్యకర్తలతో కాన్వాయ్ గా డీఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లారు. లాయర్ తో కలిసి శ్యామల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
వి కావేరి బస్సు ప్రమాదం జరిగిన తర్వాత వైసీపీ రకరకాల తప్పుడు ప్రచారాలు చేసింది. అందులో భాగంగా బైక్ నడిపిన వారు బెల్టు షాపుల్లో నకిలీ మద్యం కొనుగోలు చేశారని ఆరోపించారు. అయితే లైసెన్స్డ్ షాపులో మద్యంకొనుగోలు చేసినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. శ్యామల తప్పుడు ప్రచారాలు చేశారని కర్నూలుకు చెందిన వ్యక్తి కేసు పెట్టారు. పోలీసులు శ్యామల సహా.. వైసీపీ సోషల్ మీడియాకు చెందిన 27 మందిపై కేసులు పెట్టారు. విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు.
ఇప్పుడు కేసును పెట్టినందున తాను చేసిన ఆరోపణలకు ఆధారాలన్నీ శ్యామల చూపించాల్సి ఉంది. గాలి వార్తలు పోగేసి సోషల్ మీడియాలో చూసి చెప్పాను అని చెబితే చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ సోషల్ మీడియాకు చెందిన వారిపైనా కేసులు పెట్టారు. వారు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది.
టీవీయాంకర్ గా కాస్త పేరున్న శ్యామలను అధికార ప్రతినిధిగా పెట్టి.. తప్పుడు ఆరోపణలతో స్క్రిప్టులు ఇప్పించి చదివించడంతో ఆమెపై కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు.
                                                
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
                                              
                                              
                                              
                                              
                                              