ప్రతిపక్షం దివాలా తీసిందని నిరూపించడం కూడా అధికారపక్షం చేతుల్లో ఉంటుంది. ఎలా అంటే విపక్షాలకు చెందిన వారి కంపెనీల్ని వివాదాల్లోకి నెడితే చాలు. వారు వ్యతిరేకించలేరు.. పైగా ఆ కంపెనీలకే మద్దతుగా తాము..తమ మీడియాతో యుద్ధం చేస్తారు. ఆ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతు ఇవ్వలేరు. ?ఇప్పుడు ఇండోసోల్ విషయంలో వైసీపీకి అదే పరిస్థితి ఎదురయింది. రైతులకు మద్దతు ఇవ్వలేక.. ఇండోసోల్ కు మద్దతుగా మాట్లాడుతూ.. దివాలా స్థితికి చేరుకుంటోంది.
ఇండోసోల్ అనేది జగన్ రెడ్డి బినామీ కంపెనీ అని టీడీపీ వర్గాలు ఆరోపిస్తూంటాయి. అందులో తప్పేం లేదని అది నిజమేనని ఇప్పుడు సాక్షి తో పాటు వైసీపీ నేతలు నిరూపిస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడానికి ఒప్పందాలు చేసుకుంది కాబట్టి .. ఏపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేయలేదు. పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతినకుండా ఉండటానికి కొనసాగింపు ఇచ్చింది. భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ అక్కడి రైతులు తిరగబడ్డారు. తాము భూములు ఇచ్చేది లేదంటున్నారు.
భూపోరాటాలు ప్రారంభమైతే విపక్షాలకు పండగే పడంగ. అమరావతిలో భూసమీకరణ చేస్తున్నారని తెలిస్తే అడ్డగోలు ప్రచారాలు చేసి.. భూములు ఇవ్వొద్దు అని గ్రామసభల్లో తమ పార్టీ సానుభూతిపరులతో రచ్చ చేయిస్తున్న వైసీపీ నేతలు.. ఇండోసోల్ రైతులకు మాత్రం మద్దతు తెలియచేయడం లేదు. పైగా ప్రభుత్వమే భూములు ఇవ్వకుండా కుట్ర చేస్తోందని కథనాలను సాక్షిలో రాయిస్తున్నారు. ఓ కంపెనీ కోసం సాక్షి పత్రిక రైతుల కోసం కాకుండా.. మాట్లాడటం విచిత్రం కాకపోతే మరేమిటి ?
రైతులను కాదని.. వారి పోరాటాలను కాదని.. ఇండోసోల్ కోసం ప్రభుత్వం భూసేకరణ జరిపే అవకాశం ఉండదు. ఆ కంపెనీ నిర్మాణం కూడా జరగదు. కానీ ఇండోసోల్ జగన్ రెడ్డి బినామీ కంపెనీ అని ప్రజలకు మరోసారి నిరూపితం అయ్యేలా చేశారు. ఇప్పుడు ఆ కంపెనీ పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ చేస్తే.. చాలా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.