పదవులు నీడలాంటివి. ఈరోజు వస్తాయి రేపు పోతాయి. కానీ ధర్మం సూర్యుడి లాంటిది. నీవు ఉన్నా లేకపోయినా శాశ్వతంగా వెలుగునిస్తుంది. రాజకీయం, పదవుల కోసం ధర్మాన్ని వదులుకోవడం అంటే వెలుగును వదిలి చీకటిని ఆలింగనం చేసుకోవడమే.
హిందూత్వంపై నిరంతరం దాడి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఈ విషయం ఇంకా అర్థం కావడం లేదు. తిరుమలలో జరిగింది మహా ఘోర అపరాధం. అన్నీ కళ్ల ముందు ఉన్నాయి. ఐదేళ్ల పాటు స్వామివారికి నెయ్యి కాని నెయ్యిని రసాయనాల రూపంలో పెట్టారు. సిబిఐ సిట్ దాన్ని స్పష్టం చేసింది. జంతుకొవ్వు కూడా చాలా తక్కువ స్థాయిలో ఉందని చెప్పిందని ఉండవల్లి తేల్చారు. ‘వెరీ లో’ అంటే అసలు లేదని ఆయన తర్జుమా చేసి ఉండవచ్చు కానీ సాధారణ జనానికి దాని అర్థం తెలుసు. తిరుమల శ్రీనివాసుడికి ఘోరాపరాధం చేశారని స్పష్టమయింది. అయినా వైసీపీ నేతల్లో ఒక్క హిందువు కూడా నోరు మెదపలేదు. పైగా పార్టీ ఆదేశం అంటూ జంతుకొవ్వు లేదని చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు అది నెయ్యే కాదని సిట్ తేల్చిన విషయాన్ని వారు గుర్తించడం లేదు.
దేవదేవుడికి చేసిన ఘోరాన్ని సమర్థిస్తారా?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన ఘోర అపరాధం తెలిసిన తర్వాత కూడా వైసీపీలోని హిందూ నేతలు మౌనంగా ఉండటమే కాక ఎదురుదాడి చేయడం వారి నైతిక పతనానికి నిదర్శనం. ఐదేళ్ల పాటు ఆ కలియుగ దైవానికి నెయ్యి కాని నెయ్యిని, రసాయనాల మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించడం కంటే దారుణం మరొకటి ఉంటుందా? తిరుమల నెయ్యి వ్యవహారంపై సిట్ ఇచ్చిన నివేదిక అన్నీ స్పష్టం చేసింది. జంతు కొవ్వు తాలూకూ ఆనవాళ్లు ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. స్వామివారి ప్రసాదంలో ఒక చుక్క కల్తీ ఉన్నా అది మహా పాపమే. ఈ రిపోర్టులో ఏముందో అందరికీ తెలిసిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందరో పేరున్న హిందూ నేతలు ఉన్నారు. నిత్యం పూజలు చేసేవారు, నుదుట తిలకం దిద్దుకునే వారు, తిరుమలకు నడక దారిన వెళ్లే వారు కూడా ఆ పార్టీలో తక్కువ మంది లేరు. కానీ సనాతన ధర్మంపై, స్వయంగా ఆ వేంకటేశ్వరుడిపై దాడి జరుగుతుంటే ఆ నేతంతా ఎందుకు నోరు మెదపడం లేదు? పార్టీ నాయకుడు క్రైస్తవుడు కావచ్చు, అది ఆయన వ్యక్తిగత విశ్వాసం. కానీ ఆయన నాయకత్వంలో హిందూ దేవాలయాల పవిత్రత దెబ్బతింటుంటే మీ హిందూత్వాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఇది కాదా? పార్టీ లైన్ కన్నా పరమాత్ముడు తక్కువైపోయాడా?. అధికారం మనిషికి అహంకారాన్ని ఇవ్వొచ్చు. కానీ ధర్మం మాత్రమే ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. వేల ఏళ్ల చరిత్ర గల సనాతన ధర్మం ముందు ఏ రాజకీయ కుర్చీ అయినా అశాశ్వతమైన చిన్న పీట వంటిదే. అధికారం ఒక ప్రవాహం లాంటిది. అది ఈరోజు ఒకరి దగ్గర ఉంటే రేపు మరొకరి దగ్గరకు చేరుతుంది. కానీ సనాతన ధర్మం సముద్రం వంటిది. పార్టీ పట్ల విధేయత ఉండటం తప్పు కాదు. కానీ ఆ విధేయత దైవనిందను కూడా భరించే స్థాయికి చేరడమే విచారకరం. తిరుమల వంటి పవిత్ర క్షేత్రాల విషయంలో జరిగిన అపచారాలు వెలుగు చూస్తున్నా నోరు విప్పడానికి భయపడుతున్నారంటే వారు ధర్మం కంటే రాజకీయ కుర్చీకే ఎక్కువ విలువ ఇస్తున్నారని స్పష్టమవుతోంది. రాజకీయ కుర్చీలు సనాతన ధర్మం ముందు అశాశ్వతమైన చిన్న పీట వంటివి. పదవి పోతే మళ్ళీ వస్తుందేమో కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోతే తిరిగి పొందడం అసాధ్యం. దేవదేవుడికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించలేని నాయకత్వం రేపు సమాజానికి ఏం రక్షణ ఇస్తుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశం.
అన్యమతస్తుడి రాజకీయంగా పావులవుతారా?
వారు నమ్ముతున్న నాయకుడు కష్టం వస్తే పట్టించుకునేవాడా అంటే ఇప్పటి వరకూ జగన్ రెడ్డి రాజకీయ పయనాన్ని చూస్తే తనను నమ్ముకున్న వారందరినీ తొక్కుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆయన వల్ల బాగుపడిన వారు ఒక్కరంటే ఒక్కరిని చూపించగలరా? రాజకీయాల్లోకి రాక ముందే చేసిన అవినీతి వల్ల పదుల సంఖ్యలో సివిల్ సర్వీస్ అధికారులు జైలు పాలయ్యారు. తన అక్రమార్జన కోసం వ్యవస్థలను మేనేజ్ చేసి అధికారులను బలిపశువులను చేసిన చరిత్ర ఆయనది. ముఖ్యమంత్రి అయ్యాక కూడా అదే ధోరణి కొనసాగింది. తన వికృత ఆలోచనలకు, చట్టవిరుద్ధమైన పనులకు అధికారులను పావులుగా వాడుకుని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. నేడు వారంతా విచారణలు ఎదుర్కొంటుంటే జగన్ మాత్రం తన ప్యాలెస్కే పరిమితమయ్యారు. ఇప్పుడు ఓడిపోయాక సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు నమ్మిన నేతల్నే బలిపశువుల్ని చేస్తున్నారు. అంబటి రాంబాబు ఉదంతమే దీనికి సాక్ష్యం. ఇలాంటి నేతలు జగన్ కోసం అసాంఘిక శక్తులుగా మారి పరువు పోగొట్టుకుంటూ బలి పశువులుగా మారుతుంటే జగన్ మాత్రం అవేమీ పట్టనట్టు రోడ్డు మీద ఊరేగుతుంటారు. ఏ రోజైనా తన కోసం నోరు పారేసుకున్న నాయకుడికి ఆపద వస్తే అండగా నిలబడిన సందర్భం ఒక్కటైనా ఉందా? పార్టీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తల పరిస్థితి మరింత దారుణం. గత ఐదేళ్లలో వందల సంఖ్యలో కార్యకర్తలు కేసులు ఎదుర్కొన్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. కానీ జగన్ రెడ్డి కనీసం వారిని పరామర్శించిన దాఖలాలు లేవు. తన రాజకీయ లబ్ధి కోసం కార్యకర్తలను రెచ్చగొట్టి వీధి పోరాటాలకు పంపి వారు జైలు పాలైతే కనీసం న్యాయ సహాయం కూడా అందని స్థితిలో వదిలేశారు. అంటే హిందూయేతరుడు అయిన జగన్ హిందూ నేతల్ని పావులుగా వాడుకుని హిందూ ధర్మంపైనే దాడి చేస్తున్నారన్నమాట.
మతమార్పిళ్లు, ప్రసాదాల కల్తీ అంతా హిందూత్వంపై భారీ కుట్ర
జగన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో మానవత్వమే నా మతం అనే నినాదాన్ని ఒక రక్షణ కవచంలా వాడుకుంటున్నారు. అయితే ఈ పాత తరం సినిమా డైలాగుల వెనుక బలమైన మతపరమైన ఎజెండా ఉందనేది ఇప్పుడు బహిరంగ రహస్యం. తాను క్రైస్తవుడినని స్పష్టంగా చెప్పుకోరు, అలాగని హిందూ ధర్మం పట్ల గౌరవాన్ని ప్రదర్శించరు. కేవలం ఎన్నికల సమయంలో హిందూ ఓట్ల కోసం దేవాలయాల చుట్టూ తిరుగుతూ అధికారం చేజిక్కించుకున్నాక అదే ధర్మంపై గొడ్డలిపెట్టులా మారడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనం. రాజకీయ లబ్ధి కోసం మతాన్ని ఒక ఆయుధంగా మలుచుకుని మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం ద్వారా ఆయన క్రిస్టియన్ మెజారిటీ ఏపీని సాధించాలనుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చర్చిల్లో జగన్ రెడ్డి ప్రతినిధులు పాగా వేయడం, ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో మత మార్పిడి ముఠాలు స్వైరవిహారం చేయడం వెనుక వ్యవస్థీకృత కుట్ర కనిపిస్తోంది. గతంలో ఎమ్మెల్యేలకు మత మార్పిళ్లపై టార్గెట్లు విధించినట్లు వచ్చిన వీడియోలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన సాక్ష్యాలు జగన్ రెడ్డి పాలనలో హిందూ ధర్మం ఎంతటి ప్రమాదంలో ఉందో చాటిచెప్పాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుని ఒక వర్గం మతాన్ని ప్రోత్సహిస్తూ సనాతన ధర్మాన్ని బలహీనపరచడమే లక్ష్యంగా పాలన సాగించడం అత్యంత దారుణం. తెనాలి వంటి చోట్ల మత మార్పిళ్లకు ప్రత్యేకమైన ఘాట్లు ప్రభుత్వ నిధులతో నిర్మించే ప్రయత్నం చేశారు. కంచె ఐలయ్య వంటి వారితో మత మార్పిడి హక్కు అని సాక్షి పత్రికలో వ్యాసాలు రాయించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెడుతూ మత మార్పిళ్లకు పచ్చజెండా ఊపడం ఆయన వికృత ఆలోచనలకు పరాకాష్ట. కాలపరీక్షకు నిలిచి మనిషిని అంతిమంగా రక్షించేది కేవలం ధర్మం మాత్రమే. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నాయకులు తమ ఆరాధ్య దైవం పట్ల ఉండాల్సిన భక్తి కంటే తమ రాజకీయ బాస్ పట్ల ప్రదర్శించే విధేయతే మిన్న అని భావిస్తున్నారు. ఈ క్రమంలో వారు తాము నమ్మే ధర్మాన్ని, దైవ పవిత్రతను కూడా తాకట్టు పెట్టడానికి వెనుకాడకపోవడం ఒక విషాదకర పరిణామం. నాయకుడు రాజకీయంగా పతనం కావడం కంటే నైతికంగా పతనం కావడం అత్యంత ప్రమాదకరమైనది. దైవ ద్రోహం జరుగుతున్నప్పుడు లేదా పవిత్రమైన ఆచారాలు భ్రష్టు పడుతున్నప్పుడు మౌనంగా ఉండటం కూడా ఆ నేరంలో భాగస్వామ్యం పంచుకోవడమే అవుతుంది. పార్టీ క్రమశిక్షణ పేరుతోనో పదవీ వ్యామోహంతోనో దైవనిందను భరిస్తూ ధర్మ విరుద్ధమైన పనులకు మద్దతుగా నిలిచే నాయకులు తమ నైతికతను కోల్పోతున్నారు. రాజకీయ కుర్చీ అశాశ్వతమని తెలిసి కూడా శాశ్వతమైన ధర్మాన్ని పట్టించుకోకపోవడం వారి వివేకహీనతకు నిదర్శనం. రాజకీయంగా ఎన్ని విజయాలు సాధించినా మనస్సాక్షిని చంపుకుని చేసే అధికారం మనిషిని అంతర్గతంగా కృంగదీస్తుంది. దైవం పట్ల భక్తిని విస్మరించి ఒక వ్యక్తి ఆరాధనలో మునిగిపోయినప్పుడు ఆ నాయకుడి పతనం అనివార్యం.
జగన్ కుట్రలకు హిందూ నేతలు మద్దతు పలకడం ఆత్మహత్యాసదృశం
సనాతన ధర్మం ముందు ఏ రాజకీయ వేదికైనా చిన్నదే. ఈ సత్యాన్ని గ్రహించకుండా వ్యవస్థీకృతమైన మత విద్వేషాలకు , దైవ ద్రోహానికి వంత పాడే హిందూ నాయకులు భవిష్యత్తులో ప్రజల ముందు, దైవం ముందు దోషులుగా నిలబడక తప్పదు. పదవి పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ కోల్పోయిన నైతికతను, దైవ అనుగ్రహాన్ని మళ్ళీ పొందడం సాధ్యం కాదు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారంపై యావత్ హిందూ సమాజం ఆగ్రహంతో ఉంటే వైసీపీలోని హిందూ నేతలు ఇంకా జగన్ రెడ్డి వెనకే నడవడం విచారకరం. స్వార్థం కోసం మనుషులను, అధికారులను బలిపెట్టిన నాయకుడు ఇప్పుడు దైవానికి జరిగిన అపచారాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఇలాంటి వ్యక్తి కోసం ఆయన చేస్తున్న దైవ ద్రోహానికి మద్దతుగా నిలబడటం అంటే స్వచ్ఛందంగా ఆత్మాహుతి చేసుకోవడమే. అన్యమతస్థులు తిరుమలకు వెళ్లేటప్పుడు విశ్వాసం ప్రకటించాలనే నిబంధన దశాబ్దాలుగా ఉంది. ఆ నిబంధనను పాటించి ఒక్క సంతకం పెట్టడానికి ఇష్టపడని నాయకుడికి మద్దతుగా నిలుస్తూ హిందూ ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడటం ఏ రకమైన రాజకీయం అవుతుంది? దైవం మీద నమ్మకం ఉందని సంతకం పెట్టలేని నాయకుడు హిందూత్వాన్ని కాపాడతాడని ఎలా నమ్ముతున్నారు? ఆ నాయకుడి అడుగుజాడల్లో నడుస్తూ శ్రీవారికి జరుగుతున్న అపరాధాన్ని చూసీచూడనట్టు వదిలేస్తున్న మౌనం భవిష్యత్తులో శాపంగా మారుతుందని గ్రహించాలి. అధికారం కోసం అదే శ్రీవారి పాదాల చెంతకు వెళ్లి మీరు మొక్కులు చెల్లించుకోరా? అప్పుడు ఆ స్వామికి మీరు ఏం సమాధానం చెబుతారు? ఐదేళ్ల పాటు విషతుల్యమైన నెయ్యిని ప్రసాదంగా పెట్టి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంటే అప్పుడు కేవలం పదవులను కాపాడుకోవడానికి మీరు వహించిన మౌనం ఆ స్వామి క్షమిస్తాడని అనుకుంటున్నారా? రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని తాకట్టు పెట్టడం అంటే సొంత ఇంటికి నిప్పు పెట్టుకోవడమే.
ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది.!
ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఇది కేవలం శ్లోకం కాదు, వేల ఏళ్ల భారతీయ జీవన తత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందూ నాయకులు ఈ పరమ సత్యాన్ని విస్మరిస్తున్నారు. తాను నమ్మిన ధర్మం, ఆరాధించే దైవం పట్ల చూపించే భక్తి మాత్రమే ఒక మనిషి వంశానికి గౌరవాన్ని, ఆత్మకు శాంతిని ప్రసాదిస్తాయి. దైవకార్యం ముందు ఏ రాజకీయ జెండా అయినా తలవంచాల్సిందే అన్న స్పృహ ఈ నేతల్లో లోపిస్తోంది. తన నాయకుడి మెప్పు కోసం దేవుడికి జరిగిన అన్యాయాన్ని సమర్థించడం అంటే తమ ఆత్మగౌరవాన్ని ఒక రాజకీయ కుర్చీ కోసం తాకట్టు పెట్టడమే అవుతుంది. మనిషి సంపాదించే పదవులు, ఆస్తులు కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ ఒక వ్యక్తి తన ధర్మం కోసం నిలబడ్డాడా లేదా అన్నదే చరిత్రలో నిలిచిపోతుంది. ఏ రాజకీయ పార్టీ జెండా అయినా దైవ పీఠం కంటే ఎత్తులో ఉండదు. అధికారం ఉన్నప్పుడు విర్రవీగే అహంకారం దైవ శాసనం ముందు పేకమేడలా కూలిపోక తప్పదు. నేడు మీరు పట్టుకున్న జెండా రేపు మిమ్మల్ని రక్షించకపోవచ్చు. కానీ మీరు నమ్మే దైవం వైపు నిలబడితే ఆ ధర్మమే మిమ్మల్ని ఆపదలో ఆదుకుంటుంది. కార్యకర్తలు, ప్రజలు దైవ నిందను భరించలేక రోడ్ల మీదకు వస్తుంటే కీలక పదవుల్లో ఉన్న హిందూ నాయకులు మాత్రం తమ గొంతును పార్టీ ఆఫీసుల్లో తాకట్టు పెట్టడం వారి నైతిక పతనానికి పరాకాష్ట.
వైసీపీ హిందూ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలి!
వైసీపీలోని హిందూ నేతలు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. పార్టీ కండువా కంటే ధర్మం గొప్పదని గుర్తించాలి. ఉండవల్లి చెప్పే అర్థం లేని తర్జుమాలకు, పార్టీ ఇచ్చే స్క్రిప్టులకు లోబడకుండా ఒక భక్తుడిగా నిలదీయాల్సిన బాధ్యత మీపై ఉంది. ధర్మానికి హాని కలిగినప్పుడు మౌనంగా ఉండటం కూడా అధర్మమే. ఆనాడు కురుసభలో భీష్మ ద్రోణులు మౌనంగా ఉండి ఎలాగైతే పతనమయ్యారో, నేడు స్వామివారికి అన్యాయం జరుగుతున్నప్పుడు నోరు విప్పని నేతలు కూడా కాలక్రమంలో కనుమరుగవ్వక తప్పదు. వ్యక్తి పూజ కంటే దైవ ప్రార్థన, పార్టీ సిద్ధాంతం కంటే ధర్మ రక్షణ గొప్పవని చాటిచెప్పాలి. లేనిపక్షంలో చరిత్ర మిమ్మల్ని కేవలం రాజకీయ నేతలుగా కాదు, ధర్మానికి అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండిపోయిన మౌన సాక్షులుగా ముద్ర వేస్తుంది.
