ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ నిర్ణయించుకుంది. అయితే రెగ్యులర్గా కాదు. కేవలం గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరు కానున్నారు. గతంలో కూడా గవర్నర్ ప్రసంగానికి హాజరై పదకొండు నిమిషాల్లో వెళ్లిపోయారు. ఈ సారి కూడా అలాంటి స్కిట్ వేయబోతున్నారు.
ఫిబ్రవరి 11వ తేదీన ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో, కేవలం తొలిరోజు జరిగే గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరు కావాలని పార్టీ నిర్ణయించుకుంది. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ, మిగిలిన బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ భావిస్తోంది. కేవలం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను గౌరవిస్తూ గవర్నర్ ప్రసంగం వరకు వెళ్లి, తమ నిరసనను వ్యక్తం చేయాలని జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ నిర్ణయించుకుంది.
సమావేశాలకు హాజరయ్యామని చెప్పుకునేందుకు ఒక్క రోజు హాజరు వేయించుకోవడానికి వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. లేకపోతే అనర్హతా వేటు వేస్తారని భయపడుతున్నారు. అయితే గవర్నర్ ప్రసంగం అనేది బిజినెస్ డే కాదని శాసనసభ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ అనర్హతా వేటు వేస్తే తాము అసెంబ్లీకి హాజరయ్యామని చెప్పుకుని న్యాయపోరాటం చేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే అసెంబ్లీకి హాజరు కాకుండా దొంగ సంతకాలు పెడుతున్న ఆరుగురిపై ఇప్పటికే ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతోంది. ఆ కమిటీ ఇచ్చే నివేదిక కీలకం కానుంది.