తెలుగుదేశం ఎన్నికల ప్రచారం ఎలా ఉండబోతోందో రానురానూ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక పక్కా వ్యూహంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా ఆయన చర్యలే చెబుతున్నాయి.పెన్షన్లను ఒకేసారి డబుల్ చేశారు. డ్వాక్రా మహిళలకు పదేసి వేలు చెప్పున పంపీణీకి శ్రీకారం చుట్టారు. రైతులకు అనుకూలంగా త్వరలోనే కొన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. చేయాల్సినవి చూస్తూనే… కొత్త పథకాలను ప్రకటించడంతోపాటు వెంటనే వాటిని అమల్లోకి తెస్తున్నారు. అమలు జరిగితే ఎలా ఉంటుందో కూడా చూపిస్తున్నారు. ఇవన్నీ హామీలు కాదు… అమల్లోకి వస్తున్న వాస్తవాలు. ఇలా చంద్రబాబు సర్కారు జోరు పెంచేసరికి వైకాపా శిబిరం ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శించగలిగే అవకాశం దక్కడం లేదు. అందుకే, ఎప్పటివో ప్రజలు మరచిపోయిన అంశాలను తవ్వి తీయడం, ఓటర్ల జాబితాలో తమ పార్టీకి చెందినవారి ఓట్లను తొలగిస్తున్నారంటూ కొత్తగా హడావుడి చేయడం, ఇకపై ప్రజలకు జగన్ ఉత్తరాలు రాస్తారంటూ చెప్పడం… ఇలా రకరకాల మార్గాలవైపు పరుగులు తీస్తున్న పరిస్థితి.
ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి, టీడీపీ గెలవదని చాలా సర్వేలు చెబుతున్నాయి కాబట్టి… ఇలా ఇబ్బడిముబ్బడిగా చంద్రబాబు వరాలు కురిపించేస్తున్నారు అంటూ వైకాపా విమర్శిస్తోంది. లేదంటే, ఎన్నికల ముందుగానే ఇంత హడావుడిగా ఎందుకు ఈ ప్రకటనలు అంటూ ఇవాళ్టి సాక్షి పత్రికలో కూడా కొన్ని కథనాలు కనిపించాయి. పెన్షన్లు రెట్టింపు చేసినప్పుడు… ఇది మా నవరత్నాల్లో ఒకటనీ, సీఎం కాపీ కొట్టేశారంటూ విమర్శలు చేశారు. ఇప్పుడేమో, డ్వాక్రా మహిళలకు పెట్టుబడి కింద చెక్కులు ఇస్తుంటే… ఇది మరో నాటకం అంటున్నారు. ఈ క్రమంలో పెన్షన్ దారులు, మహిళలకు లాభం చేకూరుతోంది కదా అనే కోణాన్ని వైకాపా వదిలేస్తోంది. కేవలం రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇస్తోంది.
ఈ విమర్శలకు కూడా టీడీపీ నుంచి కచ్చితమైన సమాధానం ఉంటుంది. ఎందుకంటే, చంద్రబాబు వ్యూహం ఎలా ఉందంటే… వచ్చే ఎన్నికల్లో ఏదో చేస్తామని హామీలు ఇచ్చే కంటే… వాటిని అమలు చేసి చూపించాలనే లక్ష్యంతో ఉన్నారు. అంటే, ప్రచారానికి వచ్చేసరికి… ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగించాలంటే, ఇలాంటి సంక్షేమం ఇంకా పెరగాలంటే, తమను అధికారంలో కొనసాగిస్తే చాలని ప్రజలకు పిలుపును ఇచ్చే దిశగా చంద్రబాబు వ్యూహం ఉందని చెప్పొచ్చు. అదే పరిస్థితి వస్తే… వైకాపా ఇచ్చే హామీలకు ప్రజల్లో ప్రాధాన్యత ఉంటుందా..? అన్నీ చంద్రబాబు సర్కారే సక్రమంగా చేస్తుంటే… వాటికి అతీతంగా జగన్ ఏం చెయ్యగలరు అనే చర్చ ప్రజల్లో జరుగుతుంది కదా! ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు వైకాపా దగ్గర సరైన ప్రచారాస్త్రాలు లేవు. అందుకే, వైకాపా శ్రేణుల్లో ఇప్పుడు కొంత గందరగోళం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది.