పరకాల ప్రభాకర్ చెప్పిన ఒక అర్థం పర్థం లేని ఓట్ల కథ ను పట్టుకుని వైసీపీ సోషల్ మీడియా విభాగం ఇప్పుడు కొత్త రాగం అందుకుంది. మొన్నటి వరకు
ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ గగ్గోలు పెట్టిన మేధావులు, ఇప్పుడు అర్థరాత్రి వేళ ఓట్లు రిగ్గింగ్ అయ్యాయంటూ వింత వాదనలు తెరపైకి తెస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో అదే పనిగా గగ్గోలు పెడుతున్నారు. కొత్త కొత్త వ్యక్తులతో మాట్లాడిస్తున్నారు.
రిగ్గింగ్ అంత తేలికా?
ఆధునిక ఎన్నికల ప్రక్రియలో ప్రతి పోలింగ్ బూత్లోనూ పార్టీ ఏజెంట్లు, వెబ్ కాస్టింగ్ కెమెరాలు, కేంద్ర బలగాల నిఘా నీడన ఓటింగ్ జరుగుతుందనే కనీస స్పృహ లేకుండా మాట్లాడుతుండటం వారి అజ్ఞానానికి పరాకాష్ట. కేవలం క్లరికల్ లోపాల వల్ల అక్కడక్కడా టైమింగ్‌లో తప్పులు దొర్లితే, దాన్నే పట్టుకుని మొత్తం ఎన్నికల ఫలితాలనే తప్పుబట్టడం చూస్తుంటే, ఓటమి భారంతో వైసీపీ శ్రేణులు జోకర్లుగా మారుతున్నారని అర్థం చేసుకోవచ్చు. గుద్దుకోవడానికి ఇవి పాతకాలపు బ్యాలెట్ పేపర్లు కావని, బటన్ నొక్కితే రికార్డ్ అయ్యే ఈవీఎంలని ఈ మేధావులకు ఎవరు చెప్పాలి?
ఎన్నాళ్లు మోసం చేసుకుంటారు?
పోలింగ్ జరిగిన రోజున ఏ బూత్లోనూ లేని అభ్యంతరాలు, ఫలితాలు వచ్చి రెండేళ్లు నెలలు గడిచాక ఇప్పుడు సోషల్ మీడియాలో మొరగడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? సొంత పార్టీ ఏజెంట్లు బూత్‌లలో నిద్రపోతున్నారా లేక ఎన్నికల కమిషన్ వ్యవస్థలన్నీ కలిసి మీ ఒక్కరినే టార్గెట్ చేశాయా? ఇలాంటి అర్థరహిత నేరేటివ్స్తో తమ కార్యకర్తలను తామే మోసం చేసుకుంటూ, గెలుపు గుర్రాలమని భ్రమల్లో బతకడం వైసీపీకి అలవాటుగా మారింది. వాస్తవాలను అంగీకరించలేక, కుట్ర సిద్ధాంతాల వెనుక దాక్కోవడం వారి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం.
నిజమనుకుంటే రాహుల్‌తో కలిసి ఎందుకు పోరాడరు?
నిజంగానే జగన్ మోహన్ రెడ్డికి, సాక్షి పత్రికకు లేదా ఆ పార్టీ సోషల్ మీడియా సైన్యానికి ఎన్నికల ఫలితాలపై ఇంచక్కా అనుమానాలు ఉంటే, కేవలం కీబోర్డ్ వెనుక దాక్కుని ప్రతాపం చూపడం ఎందుకు? దేశవ్యాప్తంగా ఇదే ఈవీఎంలు, ఓట్ల చోరీపై పోరాడుతున్న రాహుల్ గాంధీతో జతకట్టి వీధుల్లో ఉద్యమించవచ్చు కదా! కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల సంఘంపై పోరాటం చేయకుండా, కేవలం ఎక్స్ లోను, ఫేస్బుక్లోను తప్పుడు ప్రచారాలు చేసుకుంటే వచ్చే లాభమేమిటి? బయటకొచ్చి పోరాడే దమ్ము లేక, కుక్కిన పేనులా పడి ఉండి, తెర వెనుక నుండి విష ప్రచారం చేయడం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే.
వచ్చే ఎన్నికల ఓటమికీ ఇప్పుడే సాకులా?
వైసీపీ నాయకత్వం ఈ పిచ్చి కథల కు స్వస్తి పలికి వాస్తవ లోకంలోకి వస్తే గుడ్డిదీపం అయినా ఉంటుంది. ఓటమికి అసలైన కారణాలను విశ్లేషించుకోకుండా, ఇలాంటి అభూత కల్పనలతో కాలక్షేపం చేయడం వల్ల పరువు పోవడం తప్ప ప్రయోజనం ఉండదు. వ్యవస్థల మీద నమ్మకం లేనప్పుడు ఎన్నికల్లో పాల్గొనడం ఎందుకు? ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించలేనప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఎందుకు? అనే ప్రశ్న అందరికీ వస్తుంది.
