ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మునుపెన్నడూ లేని విధంగా తీవ్రమైన ఆత్మరక్షణ ధోరణి కనిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కీలకమైన కాపు సామాజికవర్గ నేతలు ఇప్పుడు పార్టీ జెండాను మోయడానికి, మేం వైసీపీ తరపున నిలబడతాం అని గంభీరంగా ప్రకటించడానికి వెనుకడుగు వేస్తున్నారు. తోట త్రిమూర్తులు గారు జనసేన ఎమ్మెల్యేపై విసిరిన సవాల్లో.. తాను వైసీపీ తరపున కాకుండా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని చెప్పడం కేవలం ఒక వ్యక్తిగత వ్యూహం కాదు. అది ప్రస్తుత వైసీపీ బ్రాండ్ ఇమేజ్‌పై ఆ పార్టీ సీనియర్ నేతలకు ఉన్న నమ్మకరాహిత్యానికి నిదర్శనం. ఒక్క త్రిమూర్తులు మాత్రమే కాదు, చివరకు ఉత్తరాంధ్రాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ లాంటి ఉద్దండులు సైతం రాబోయే రోజుల్లో తాము వైసీపీ అభ్యర్థులుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు.
సొంత వర్గానికి దూరమైన నేతలు.. ‘కుట్ర’ ముద్ర!
ఈ సాఫ్ట్ కార్నర్ వెనుక ఉన్న అసలు కారణం.. గత ఐదేళ్ల పాలనలో వైసీపీలోని కాపు నేతలు వ్యవహరించిన శైలి. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన వైపు కాపు సామాజికవర్గ యువత, మెజారిటీ ఓటర్లు బలంగా అడుగులు వేస్తున్న తరుణంలో.. వైసీపీలోని కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్‌కు అనుగుణంగా సొంత సామాజికవర్గ నేతలపైనే తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు గుప్పించారనే భావన క్షేత్రస్థాయిలో బలంగా నాటుకుపోయింది. కాపు ఓట్లను చీల్చడానికి, జనసేన ప్రభావాన్ని తగ్గించడానికి వీరంతా జగన్‌తో కలిసి సొంత కులంపైనే కుట్రలు పన్నుతున్నారు అనే నమ్మకం మెజారిటీ పౌర సమాజంలో ఏర్పడింది. దీని ఫలితంగానే, సదరు నేతలు ఇప్పుడు తమ సొంత గ్రామాల్లో, నియోజకవర్గాల్లో సామాజిక పట్టును పూర్తిగా కోల్పోయి, తీవ్రమైన ట్రస్ట్ డెఫిసిట్ ఎదుర్కొంటున్నారు.
అనుచరుల రివర్స్ గేర్
ఏ లీడర్‌కైనా సొంత అనుచరులే బలగం. కానీ ప్రస్తుతం వైసీపీ కాపు నేతల ప్రధాన అనుచరులు, ద్వితీయ శ్రేణి క్యాడర్ సైతం ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తే తాము క్షేత్రస్థాయిలో తిరిగి ఓట్లు అడగలేమని చేతులెత్తేస్తున్నారు. వైసీపీ జెండాతో వెళ్తే దక్కే ఓట్ల కంటే, వ్యక్తిగతంగా వచ్చే ఓట్లు కూడా పోతాయనే భయం నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ లీడర్లకు ఇటు క్షేత్రస్థాయిలో సామాజిక మద్దతు కరువవడంతో.. వీరి ఉనికిని చాటడానికి ఇప్పుడు కేవలం వైసీపీ సోషల్ మీడియా పెయిడ్ వింగ్ మాత్రమే దిక్కయింది. ఎక్స్ , ఫేస్‌బుక్‌లలో సదరు నేతల పాత వీడియోలను, కృత్రిమ సవాళ్లను ట్రెండ్ చేస్తూ సింహం , ఫైటర్ అంటూ బిల్డప్ ఇస్తున్నారే తప్ప, గ్రౌండ్ రియాలిటీ దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద పెయిడ్ పోస్టులతో వచ్చే ఈ తాత్కాలిక మైలేజ్.. రేపు ఎన్నికల బరిలో ఓట్ల రూపంలో మారదని, సామాజికవర్గం దూరం పెడితే రాజకీయం ఎలా శూన్యమవుతుందో ఈ నేతలకు బాగా తెలుసు. అందుకే, పెయిడ్ ఆర్మీ ఇచ్చే ఎలివేషన్లను చూసి మురిసిపోకుండా, లోలోపల సేఫ్ గేమ్ కోసం రూట్ మ్యాప్ వెతుక్కుంటున్నారు.
జంపింగ్‌లకు గ్రౌండ్ ప్రిపరేషన్?
రాజకీయాల్లో ఏ నేత అయినా అపజయాలు ఎదురైనప్పుడు పార్టీని నమ్ముకుని నిలబడితేనే భవిష్యత్తు ఉంటుంది. కానీ, తాత్కాలిక లబ్ధి కోసం సొంత సామాజికవర్గాన్ని దూరం చేసుకుని, ఇప్పుడు పార్టీ గుర్తును కూడా ఓటర్ల ముందుకు తీసుకెళ్లలేకపోవడం అనేది సదరు నేతల రాజకీయ అపక్వతను సూచిస్తోంది. తాము వైసీపీలో ఉంటే పొలిటికల్ కెరీర్ ముగిసిపోతుందనే సత్యాన్ని గ్రహించిన తోట త్రిమూర్తులు, బొత్స లాంటి నేతలు.. రాబోయే రోజుల్లో అనుకూలమైన సమయం చూసుకుని పక్కా ప్లానింగ్‌తో వేరే ప్రత్యామ్నాయాల వైపు జంప్ అవ్వడానికే ఈ ఇండిపెండెంట్ ముసుగులు, నిశ్శబ్ద వ్యూహాలు అని సులభంగా అర్థం చేసుకోవచ్చు.
