వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ .. ఆ పార్టీ అధినేత, ఆ పార్టీ ఆలోచనలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో వెల్లడించే అంశం ఇది. కడప జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో రాయలసీమ లిఫ్ట్ ను ఆపేశారంటూ రచ్చ చేసిన వైసీపీ ప్రజా ప్రతినిధులు.. చర్చలో పాల్గొనకుండా బయటకు వచ్చారు. బయట ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ లిఫ్ట్ కు అనుమతులు తేవాలని..ఆ ప్రాజెక్టు తెలంగాణకు టిట్ ఫర్ టాట్ అని చెప్పుకొచ్చారు.
అంటే తెలంగాణకు పోటీగా.. అనుమతులు లేకుండా అడ్డగోలుగా ప్రాజెక్టులు నిర్మించేసుకుందామని జగన్ రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారన్నమాట. ప్రభుత్వం అంటే.. చట్టబద్ధంగా నడవాలి. అధికారం ఉందని వ్యవస్థలన్నింటినీ మ్యానిపులేట్ చేస్తా.. మా ఇష్టం వచ్చినట్లుగా చేస్తామంటే కుదరదు. ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఇలాగే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. మా ఇష్టం అని రోడ్లకు అడ్డంగా గోడలు కట్టేసుకుంటూ ఉంటారు. కానీ అది పద్దతి కాదు. వైసీపీ నేతలకు మాత్రం అదే పద్దతి.
తెలంగాణతో జలవివాదాలు పెంచుకునేందుకు టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా ఆ ప్రాజెక్టును జగన్ ప్రారంభిస్తే ఇప్పుడు ఎవరికి లాస్ అయింది. ఎన్జీటీ పనులు నిలిపివేసింది. రెండున్నర వేల కోట్లు ఆ ప్రాజెక్టు మీద పోసి .. కాంట్రాక్టర్ ఖాతాలో ఉంచారు. ఇప్పుడు అనుమతులు టీడీపీ తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పై ఇప్పటికే పీటముడి పడిపోయింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?. నీళ్లతో గొడవలు పెట్టుకుని వాటిని పెంచుకుంటూ పోతే రాష్ట్రానికే తీవ్ర అన్యాయం జరుగుతుంది. దిగువ రాష్ట్రం అయిన ఏపీ మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఫ్యాక్షన్ తరహాలో డీల్ చేయాలని వైసీపీ నేతలు అనుకోవడంతోనే సమస్యలు ఏర్పడుతున్నాయి.
